చెట్లలో బాహుబలి



బాహుబలిలా కనిపిస్తున్న ఈ భారీ చెట్టు పేరు కౌరీ. దీన్ని అగతిస్‌ ఆస్ట్రేలిస్‌ అని కూడా పిలుస్తుంటారు. పేరులో ఆస్ట్రేలిస్‌ ఉందని... ఇది ఆస్ట్రేలియాకు చెందిన చెట్టు అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే... ఇది న్యూజిలాండ్‌కు చెందిన వృక్షజాతి. ప్రపంచంలోకెల్లా పురాతనమైన చెట్లలో ఇవి కూడా ఉన్నాయి. ఈ వృక్షాల జీవితకాలం చాలా ఎక్కువ. ఇవి ఏకంగా కొన్ని వేల సంవత్సరాల వరకు జీవిస్తాయి. కౌరీ చెట్లు దాదాపు 50 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. కాండం చుట్టుకొలత 18 మీటర్ల వరకు ఉంటుంది.

పూర్వం ఈ చెట్లను పడవల తయారీ, ఇళ్ల నిర్మాణానికి విపరీతంగా ఉపయోగించేవారు. 20వ శతాబ్దం ప్రారంభంలో వ్యవసాయ భూములు, కలప కోసం ఇష్టం వచ్చినట్లుగా నరికేశారు. దీంతో ప్రస్తుతం కౌరీ చెట్లు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న వృక్షాల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఈ చెట్లకు శంఖు ఆకారంలో ఉండే కాయల్లాంటివి కాస్తాయి.

వీటిలోనే విత్తనాలు ఉంటాయి. ఇవి నేల రాలినప్పుడు కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. ఈ వృక్షజాతిలో ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద చెట్టు పేరు 'తానే మహుత.. దీన్నే “లార్డ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌' అని కూడా పిలుస్తారు. దీని వయసు రెండు వేల సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. ఈ చెట్టును 1920 సంవత్సరంలో గుర్తించారు. అప్పటి నుంచి కంటికి రెప్పలా దీన్ని రక్షిస్తున్నారు. ఈ చెట్టును చూడటానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు. నేస్తాలూ ఇవీ బాహుబలి చెట్టు సంగతులు. మీకు నచ్చాయి కదూ!

Responsive Footer with Logo and Social Media