చిన్నారి... పొన్నారి.. నెమలి!



నెమలి ఎంతో అందమైన షక్షి.! దాని అందమంతా ఈకల్లోనే ఉంటుంది. అది పురివిప్పితే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ బుజ్జి పక్షిలో కూడా కొన్ని నెమలి లక్షణాలు అగుపిస్తున్నాయి కదూ! ఇంతకీ ఈ పిట్ట పేరేంటి? ఇది నెమలిలా ఎందుకు ఉందో.. తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.

'నెమలిలాంటి ఈ పక్షి పేరు మలయన్‌ పికాక్‌- ఫెసెంట్‌, దీని తోక నెమలితో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. మలేషియా, థాయిలాండ్‌, మయన్మార్‌, సుమత్రా, సింగపూర్‌లాంటి దేశాల్లో ఇవి జీవిస్తూ ఉంటాయి. వీటిలో మగవి 50 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. వీటి రెక్కలేమో 20 నుంచి 21 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. బరువేమో 80 నుంచి 100 గ్రాములు ఉంటాయి. ఆడ పక్షులు మగవాటి కన్నా కాస్త చిన్నగా ఉంటాయి. 40 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. తోకేమో 20 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. రెక్కల పొడవేమో 18 సెంటీమీటర్లు ఉంటుంది. బరువేమో 450 నుంచి 550 గ్రాముల వరకు తూగుతుంది.

కాస్త సిగ్గెక్కువ!

పికాక్‌ ఫెసెంట్‌ పక్షికి కాస్త సిగ్గు ఎక్కువ. గుంపులుగా కాకుండా ఈ పక్షులు సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. మనుషులు, జంతువులు, ఇతర పక్షుల అలికిడి వినిపిస్తే 'చాలు దూరంగా వెళ్లిపోతాయి. అడవుల నరికివేత, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల వీటి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పక్షుల సంఖ్య పట్టుమని పదివేలు కూడా లేదు. ఏం తింటాయంటే...

ఈ పక్షులు ఎక్కువగా చిన్న చిన్న పురుగులు, పండ్లు, విత్తనాలు, గింజల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆడ పక్షులు విడతకు ఒకటి, రెండు గుడ్లు పెడతాయి. 20 నుంచి 21 రోజుల తర్వాత వీటి నుంచి పిల్లలు బయటకు వస్తాయి. దాదాపు రెండు సంవత్సరాల వరకు పిల్ల పక్షుల ఆలనాపాలనా తల్లి, తండ్రి పక్షులు చూసుకుంటాయి. వీటి జీవితకాలం 11 నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవీ బుజ్జి నెమలి విశేషాలు. భలే ఉన్నాయి కదూ!

Responsive Footer with Logo and Social Media