అబ్రకదబ్ర... రికార్డు అదిరిందబ్బా!
హలో ఫ్రెండ్స్. ఎవరైనా ఏదైనా సాధిస్తే... 'సరికొత్త శిఖరాలను అధిరోహించారు', 'మరో మెట్టు 'పైకెక్కారు' అనే మాటలు వింటుంటాం కదా, కానీ, ఓ నేస్తం మాత్రం తన ప్రతిభను చాలా లోతుకు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. మీకు అర్థం కాలేదు కదూ.. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి మరి...
అమెరికాకు చెందిన అవెరీ ఎమర్సన్‌కు ప్రస్తుతం 18 సంవత్సరాలు. ఈ నేస్తానికి స్కూబా డైవింగ్‌తోపాటు మ్యాజిక్ చేయడమంటే చాలా ఇష్టం. అందుకే, తన రెండు ఆసక్తులను కలిపి ఒకేసారి ప్రదర్శించింది. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
లాక్‌డౌన్‌లో వచ్చిన ఆలోచన...
కరోనాతో అన్నీ బంద్ కావడంతో ఎక్కడి వారక్కడే ఉండిపోవాల్సి వచ్చింది కదా. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక, తండ్రిని అడిగింది అవెరీ. ఆయన సూచనతో వాళ్ల ఇంటికి సమీపంలోనే ఉన్న టన్నెల్ అక్వేరియంలో స్కూబా డైవింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది. అలా కొద్దిరోజుల్లోనే అందులో పట్టు సాధించింది. ఒకవైపు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతూనే, స్కూబా డైవింగ్‌లో మెలకువలు నేర్చుకోసాగింది. అలా సుమారు 12 ప్రశంసా పత్రాలు సాధించింది. సముద్ర జలాల పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడుకోవడంతోపాటు అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే స్కూబా డైవింగ్‌పైన ఆసక్తి చూపిందట.
మూడు నిమిషాల్లో ౩8 ట్రిక్స్...
కొద్దిరోజుల క్రితం తనకిష్టమైన స్కూబా డైవింగ్‌తోపాటు మ్యాజిక్‌ను ఒకేసారి ప్రదర్శించి, రికార్డు సాధించాలని అనుకుంది. తన ఆలోచనను తండ్రితో పంచుకుంది. ఆయనా సరేననడంతో, అందుకు సంబంధించిన గత రికార్డులను ఇంటర్నెట్‌లో వెతికింది. 2020లో యూకేకు చెందిన ఓ వ్యక్తి, మూడు నిమిషాల్లో 20 ట్రిక్స్ ప్లే చేసినట్లు తెలిసింది. తాను అంతకుమించి సాధించాలని నిర్ణయించుకుంది. ఇటీవల టన్నెల్ అక్వేరియంలో నీటి లోపల 14 డిగ్రీల ఉష్ణోగ్రతలో, కేవలం మూడు నిమిషాల్లోనే 88 మ్యాజిక్ ట్రిక్స్ ప్రదర్శించింది. ఆ వీడియోను గిన్నిస్ ప్రతినిధులకు పంపించడంతో వారు అన్నీ పరిశీలించి రికార్డును నమోదు చేశారు. ఇటీవలే సంబంధిత ధ్రువపత్రం కూడా అందజేశారు. అయితే, అవెరీ మొత్తం 50 ట్రిక్స్‌ను సాధన చేసిందట. పిల్లలూ... ఈ నేస్తానికి మనమూ కంగ్రాట్స్ చెప్పేద్దామా!