అందమైన మచ్చల సరస్సు!
నేస్తాలూ..! ఏదైనా వస్తువుపైన మచ్చలు.. మరకలు... పడితే దాని అందం దెబ్బతింటుంది! కానీ ఓ సరస్సును మాత్రం ఈ మచ్చలే అత్యంత అందమైనదిగా మార్చాయి. సరస్సు ఏంటి... దానికి మచ్చలేంటి... అని ఆలోచిస్తున్నారు కదూ! ఈ కథనం చదివేయండి... మీకే అసలు విషయం తెలుస్తుంది.
ఈ మచ్చల సరస్సు కెనడాలో ఉంది. బ్రిటీష్ కొలంబియాలోని ఒకానగన్ వ్యాలీలోని ఓసోయోస్‌లో ఇది కనువిందు చేస్తోంది. దీన్నే లేక్ ఖిలుక్ అని కూడా పిలుస్తుంటారు. ఈ వింత సరస్సును చూడ్డానికి పెద్ద సంఖ్యలో పర్యావరణ ప్రేమికులు, సందర్శకులు వస్తుంటారు. ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేస్తుంటారు. కానీ దీని చుట్టూ రక్షణ కంచె ఉంటుంది. దాన్ని దాటి లోపలకు వెళ్లడానికి వీల్లేదు!
ఖని'జలాలు'!
ఈ సరస్సు నీటిలో చాలా పెద్ద మొత్తంలో ఖనిజాలున్నాయి. మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం, సోడియం సల్ఫేట్‌లాంటి మరో ఎనిమిది రకాల ఖనిజాలతో పాటు, కొద్ది మొత్తంలో సిల్వర్, టైటానియం కూడా నిక్షిప్తమై ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ నీటిలోని ఖనిజాలతో మందుగుండు సామగ్రిని కూడా తయారు చేశారని స్థానికులు చెబుతుంటారు.
మండు వేసవిలోనే పండుగ!
ఈ సరస్సును ఎప్పుడంటే అప్పుడు చూస్తే మజా ఏమీ ఉండదు. కేవలం వేసవిలోనే అత్యంత అందంగా కనిపిస్తుంది. ఎండలకు నీరు ఆవిరవడం మొదలయ్యాక అసలు విచిత్రం బయటపడుతుంది. నీటి మట్టం తగ్గగానే సరస్సు గర్భంలో ఉన్న పెద్దపెద్ద గుంటలు బయటకు కనిపిస్తాయి. సరస్సు అంతా ఎండిపోయి గుంటల్లో మాత్రమే నీరు మిగులుతుంది. వీటిలో ఉండే ఖనిజాల వల్ల ఈ జలాలు పసుపు, ఆకుపచ్చ, నీలం వర్దాల్లో కనువిందు చేస్తుంటాయి. అప్పుడు ఈ ప్రకృతి వింతను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే నమ్మండి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ అందాల మచ్చల సరస్సు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!