ప్రకృతి పరిచిన ఎర్రని తివాచీ!
కనుచూపు మేర అంతా ఎరుపు! ఆ ప్రకృతి వింతను చూస్తే మైమరుపు... చిత్తడి నేల మీద ఎంచక్కా పరుచుకున్న చక్కని ఎర్రని తివాచీ అది! ఏటా దోచుకుంటోంది పర్యాటకుల మది! మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!
చైనాలోని పంజిన్ నగరానికి 80 కి.మీ.దూరంలో లియోహే నది డెల్చాలో ఉంది ఈ ప్రకృతి పరిచిన ఎర్రని తివాచీ. దీన్ని “రెడ్ బీచ్ అని పిలుస్తారు. నిజానికి ఇది బీచ్ మాత్రం కాదు. చిత్తడి నేలల్లో పెరిగిన ఒకరకమైన మొక్కల సమూహం. సూర్యోదయం, సూర్యస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం మరింత అందంగా ఉంటుంది. ఈ ఎర్రని మొక్కల మీద పడ్డ సూర్యకాంతి పరావర్తనం చెందడమే దానికి కారణం. అందుకే ఈ ప్రకృతి వింతను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
పచ్చగా. ఎర్రగా.
రెల్లు జాతికి చెందిన ఈ మొక్కలు ఏప్రిల్, మేలో పెరుగుతాయి. అప్పుడు ఆకు పచ్చని రంగులోనే ఉంటాయి. కానీ తర్వాత నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఎరుపురంగులోకి మారుతాయి. అందుకే అక్టోబర్ నుంచి ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతుంది.
కొంతభాగం మాత్రమే...
అయితే ఈ ప్రాంతం మొత్తాన్ని సందర్శించడానికి ప్రజలకు అనుమతి లేదు. కేవలం కొంత భాగాన్ని చూడ్డానికి మాత్రమే అనుమతిస్తారు. అది కూడా చిన్న చిన్న చెక్కవంతెనల మీద నడుస్తూ చూడాలి. ఈ అరుదైన మొక్కజాతిని కాపాడటం కోసమే ఈ ఏర్పాటన్న మాట. చలికాలం ప్రారంభం కాగానే ఈ మొక్కలు ఊదారంగులోకి మారతాయి. ప్చ్... కానీ తర్వాత చనిపోతాయి. పక్షులకు ఆవాసం!
ఈ రెల్లు గడ్డిలో దాదాపు 260 రకాల పక్షులు, 898 రకాల జంతువులు ఆశ్రయం పొందుతున్నాయని అంచనా. మరో విషయం ఏంటంటే ఈ గడ్డిని కాగితం తయారీలో కూడా వాడతారట. అందుకే ఈ ప్రాంతాన్ని చైనావాళ్లు ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ “రెడ్ బీచ్ సంగతులు. భలే ఉన్నాయి కదూ!