అయ్‌ బాబోయ్‌... పాముల కుప్ప!



నేస్తాలూ.. మనకు ఎప్పుడైనా ఒకసారి ఓ పాము కనబడితేనే బెంబేలు పడిపోతుంటాం. ఒక్కోసారి ఒకేసారి నాలుగైదు పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ మీరెప్పుడైనా పాముల కుప్పను చూశారా! లేదు కదా! అయితే వెంటనే ఈ పాముల గురించి తెలుసుకోండి... సరేనా! ఎందుకంటే ఇవన్నీ కుప్పగానే ఉంటాయి. అసలు ఈ పాములు ఇలా ఎందుకు గుంపులుగుంపులుగా ఉంటాయి. ఇంతకీ ఇవి ఏం సర్పాలు? ఎక్కడుంటాయి? ఏం చేస్తుంటాయి? ఇలా ఎన్నో సందేహాలు మీ చిట్టి మెదళ్లను తొలుస్తున్నాయి కదూ! అయితే ఈ కథనం చదవండి మరి... మీ అనుమానాలన్నీ తీరిపోతాయి సరేనా!

చూడ్డానికి సన్నగా, నున్నగా, చారలతో కనిపిస్తున్న ఈ పాము పేరు గార్డర్‌. ఇది కెనడాకు చెందిన సర్పం. ఇందులో దాదాపు 35 ఉపజాతులున్నాయి. ఈ పాములు మిగతా పాములతో పోల్చుకుంటే కాస్త వైవిధ్యంగా కనిపిస్తాయి. వీటి నేత్రాలు పెద్దగా ఉంటాయి. వీటిలో కొన్ని నీలం, పసుపు, ఎరుపు చారలతో ఉంటాయి. మరి కొన్నింటిలో అసలు చారలేమీ ఉండవు.

అసలు నిజానికి ఈ పాములు కెనడాకు చెందినవి కావు. ఇవి ఇక్కడికి ఎలా చేరుకున్నాయో కచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ... ఎప్పుడో గతంలో ఎండుగడ్డి రవాణా సమయంలో ఇక్కడికి వచ్చి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. ఇక్కడి పరిస్థితులు అనుకూలించడంతో 2010 తర్వాత నుంచి వీటి సంఖ్య మరింత విపరీతంగా పెరిగిందట.

ఎంచక్కా నీళ్లలోనూ...

ఈ పాములు ఎక్కువగా పొలాలు, గడ్డిభూములు, చిత్తడినేలల్లో నివసిస్తుంటాయి. చెరువులు, కాలువల్లోనూ కనిపిస్తుంటాయి. ఇవి వానపాములు, జలగలు, బల్లులు, కప్పలు, ఎలుకలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే గుడ్లను తింటాయి. అసలు వీటికి విషం ఉండదని చాలాకాలం అనుకున్నారు. కానీ అదంతా అపోహే అని తర్వాత పరిశోధనల్లో తేలింది. ఇవి న్యూరోటాక్సిన్‌ను ఉత్పత్తి చేసుకుంటాయి.. కానీ ఇది మనుషుల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. కొన్ని సందర్భాల్లో ఇవి కరిచిన చోట వాపు మాత్రం వస్తుంది. ప్రాణాలకైతే పెద్దగా ప్రమాదం ఉండదు.

శీతాకాలంలో...

మామూలు రోజుల్లో వేటికవే సంచరిస్తుంటాయి. కానీ శీతాకాలం వచ్చిందంటే చాలు. అన్నీ ఓ 'చోటకు చేరుకుంటాయి. తమను తాము వెచ్చగా ఉంచుకునేందుకోసమే ఈ ఏర్పాటన్నమాట. ఇలా అన్నీ కుప్పగా వచ్చాక... నెమ్మదిగా ఒక్కక్కటే శీతాకాల నిద్రలోకి జారుకుంటాయి. మళ్లీ వేసవికాలం రాగానే వేటి దారిన అవి వెళ్లిపోతాయి. ఇవి ఒక రకమైన వాసనను వెదజల్లడం ద్వారా ఒకదాని ఉనికి మరోటి కనుక్కుంటాయట. అలా శీతాకాలంలో అన్నీ ఓ చోట గుమిగూడి, విజయవంతంగా చలిని ఎదుర్కొంటాయి. నేస్తాలూ.. మొత్తానికి ఈ గార్డర్‌ పాము సంగతులు భలేగా ఉన్నాయి. కదూ!

Responsive Footer with Logo and Social Media