పందికొక్కుల్లాంటి పందులోచ్!
హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా?! ఇప్పుడు మనం ప్రపంచంలోకెల్లా అత్యంత అరుదైన, అతి చిన్నదైన పంది జాతి గురించి తెలుసుకుందాం సరేనా! ఈ వరాహాలు ఎక్కడో విదేశాల్లో ఉన్నాయనుకుంటే పొరపాటు. ఈ బుజ్జి బుజ్జి వరాహాలు మన దేశంలోనే ఉన్నాయి. ఆ మాటకొస్తే... కేవలం ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలో ఇంకెక్కడా లేవు! మరి వాటి విశేషాలేంటో చకచకా చదివేద్దామా!
దాదాపు పెద్ద పందికొక్కులంత పరిమాణంలో ఉన్న ఈ బుజ్జి పందుల పేరు పిగ్మీ హోగ్. ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేరిపోయాయి. ప్రస్తుతం అస్సోంలో మనుగడ సాగిస్తున్నాయి. ఒకప్పుడు దక్షిణ నేపాల్, బెంగాల్ మీదుగా దక్షిణ హిమాలయ పర్వత ప్రాంతాల్లోని గడ్డిభూములు, దక్షిణ భూటాన్‌లో ఇవి విస్తృతంగా ఉండేవి. 1960 ప్రారంభంలోనే ఈ జాతి అంతరించిపోయిందని అంతా భావించారు. కానీ విచిత్రంగా 1911లో అస్సోంలోని బర్నాడి వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో సంభవించిన అగ్నిప్రమాదంలో వీటి ఉనికి మళ్లీ బయటపడింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద అస్సోంలోని మనస్ జాతీయ పార్క్‌లో మాత్రమే ఈ పిగ్మీ హోగ్‌లున్నాయి.
కేవలం వందల్లోనే...
వీటి జనాభా ప్రస్తుతం 250 కంటే కూడా తక్కువగా ఉంది. ఈ పందులు గోధుమ, బూడిద రంగులో ఉంటాయి. పెద్దవైన మగవాటిలో కోరలు కూడా ఉంటాయి. వీటికీ అడవి పందులకు అసలు సంబంధం లేదు. ఇవి పూర్తిగా వేరే జాతికి చెందిన జీవులు.
పట్టుమని పది కిలోలు కూడా...
ఇవి చాలా తక్కువ బరువుంటాయి. పట్టుమని పది కిలోలు కూడా ఉండవు. 8 కిలోల నుంచి 9.7 కిలోల వరకు మాత్రమే బరువు పెరుగుతాయి. పొడవేమో కేవలం 55 నుంచి 71 సెంటీమీటర్లు ఉంటాయంతే. ఆడవి, మగవాటికన్నా కాస్త చిన్నగా ఉంటాయి. వీటి తోకలు చాలా చిన్నగా, 2.5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి.
'చిన్న చిన్న గుంపులుగా.
ఇవి చిన్న చిన్న గుంపులుగా కలిసి జీవనం సాగిస్తాయి. కొన్నిసార్లు ఒక్కో గుంపులో 20 వరకు ఉంటాయి. మగవేమో సాధారణంగా ఒంటరిగా జీవిస్తుంటాయి. వీటి జీవితకాలం 8 నుంచి 14 సంవత్సరాలుంటుంది. ఇవి గడ్డి, వేర్లు, దుంపలను ఆహారంగా తీసుకుంటాయి. పురుగులు, చిన్న చిన్న పక్షులు, వాటి గుడ్లను కూడా తిని తమ బొజ్జ నింపుకుంటాయి. ఇవి నేలనూ సారవంతం చేస్తాయి. కొండచిలువలు, గద్దలు, చిరుతపులులు మొదలైనవి వీటికి ప్రధాన శత్రువులు. గడ్డినేలలు రోజురోజుకూ నాశనమవడం, పర్యావరణ మార్పులు ఈ పిగ్మీ హోగ్స్ సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలు. నేస్తాలూ మొత్తానికి ఇవీ ఈ బుజ్జి బుజ్జి పందుల విశేషాలు. ఇవి అంతరించిపోకుండా ఉండాలని, భవిష్యత్తులో వీటి సంఖ్య పెరగాలని ప్రకృతి ప్రేమికులుగా మనమూ మనసారా కోరుకుందామా!!