చేతి వేళ్లు సృష్టించిన సంగీత పరవళ్లు!



హాయ్‌ నేస్తాలూ..! మనకు ఊహ తెలిసినప్పటి నుంచి రకరకాల పాటలు వింటూనే ఉంటాం.. కానీ అందరూ పాడటానికి ధైర్యం చేయరు. కొంతమంది మాత్రం సంగీతం నేర్చుకొని మరీ చక్కగా పాడతారు. ఇంకొంత మందేమో.. ఆ పాటలకు మ్యూజిక్‌ని అందిస్తారు... అయినా ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? 'యంగెస్ట్‌ పియానిస్ట్‌గా' పేరు తెచ్చుకున్న ఓ చిన్నారి గురించి, తన విజయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి..! తన వివరాలేంటో తెలుసుకుందామా...

ఇప్పటి వరకు మనం చెప్పుకున్న చిన్నారి పేరు పాలక్‌ చౌహాన్‌. ప్రస్తుతం తనకు 14 సంవత్సరాలు. వాళ్ల సొంతూరు చైన్నై ఆమెకు అయిదేళ్లు ఉన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించిందట. నేర్చుకోవడమే కాకుండా రకరకాల మ్యూజిక్‌లు వాయిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేదట. తను ప్రస్తుతం సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఏర్పాటు చేసిన మ్యూజిక్‌ స్కూల్లో శిక్షణ పొందుతోంది.

ఎన్నో ప్రదర్శనలు...

'మన చౌహాన్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పియానో పోటీల్లో పాల్గొని పదుల సంఖ్యలో బంగారు, వెండి, కాంస్య పతకాలు... అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది. అమెరికా, ఇటలీ, లండన్‌, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, రష్యా వంటి ఇతర దేశాల్లో తన ప్రదర్శనలు ఇచ్చి విదేశీయులను కూడా మెప్పించింది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ వంటి ఎందరో ప్రముఖుల ముందు పియానో వాయించి... వారి ప్రశంసలు పొందింది. ఇటీవల నాగాలాండ్‌లో నిర్వహించిన పియానో ఫెస్టివల్లో ఇతర దేశాలకు చెందిన పియానిస్టులతో పాటు చౌహాన్‌ కూడా పాల్గొందట. ఇంకో విషయం ఏంటంటే. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అతిచిన్న వయస్కురాలు తనేనట. ఈ చిన్నారి... అత్యుత్తమ ప్రతిభ చూపి, 'గ్లోబల్‌ కిడ్స్‌ ఎచీవర్స్‌, 'చైల్డ్‌ ప్రొడిజ్‌' అవార్డులను అందుకుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇస్తూ, అందరికీ మంచి సంగీతాన్ని అందించడమే తన లక్ష్యమట. ఎంతైనా మన పాలక్‌ చౌహాన్‌ చాలా గ్రేట్‌ కదూ...!

Responsive Footer with Logo and Social Media