భలే భలే... బన్నీ మ్యూజియం!
ఫ్రెండ్స్. మన అందరికీ కుంధేళ్లంటే బోలెడంత ఇష్టం కదూ! అవి గెంతుతున్నప్పుడు భలేగా ఉంటుంది కదా! అయితే ఈ రోజు మనం కుండేళ్ల మ్యూజియం గురించి తెలుసుకుందాం. ఇందులో నిజమైన కుందేళ్లు ఉండవు కానీ..వాటి బొమ్మలు, వస్తువులు ఉంటాయి. మరి ఆ మ్యూజియం ఎక్కడుందో, దాని విశేషాలేంటో తెలుసుకుందామా!
ఈ బన్నీ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. దీన్ని 1998లో ప్రారంభించారు. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు... దాదాపు 385,000 పైచిలుకు కుందేలు బొమ్మలున్నాయి. ఇవన్నీ 18 గ్యాలరీల్లో కొలువుతీరి ఉన్నాయి. మ్యూజియం ఏడువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
ఘనమైన రికార్డు.
ఇక్కడ ఎక్కువగా సిరామిక్ కుందేలు బొమ్మలున్నాయి. పురాతనకాలం నాటి బొమ్మలు, కుకీ జార్ బొమ్మలు... ఇలా ఈ జాబితా చాలా పెద్దదిగానే ఉంది. ఈ మ్యూజియానికి 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కూడా దక్కింది. ప్రపంచంలోకెల్లా ఎక్కువ కుందేలు బొమ్మలు, వస్తువులున్న మ్యూజియంగా ఇది రికార్డు సాధించింది. 1999 నుంచి ఈ ఘనత దీని పేరు మీదనే కొనసాగుతోంది. మొదట్లో 8418 వస్తువులు, బొమ్మలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు కొన్ని రెట్లు పెరిగాయి.
ఆనందమే ఆనందం...
ఈ బన్నీ మ్యూజియానికి ఓ నినాదం కూడా ఉంది. అదేంటంటే... 'ది హ్యాపియెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. నిజమే మనలాంటి పిల్లలందరికీ ఇంతకంటే సంతోషకరమైన ప్రదేశం ఇంకేముంటుంది. బన్నీ మ్యూజియాన్ని కాండేస్ ప్రేజీ, స్ట్రీవ్‌లు బాన్స్కి దంపతులు ప్రారంభించారు. వారు ప్రతి రోజూ ఒకరికొకరు కుందేలు థీమ్‌తో ఉన్న బహుమతులు ఇచ్చుకునేవారు. అలా పోగైన కానుకలను ప్రదర్శనకు పెట్టారు. రానురాను కుందేలు బొమ్మల సంఖ్య విపరీతంగా పెరగడంతో 2011లో నూతన భవనంలోకి మార్చారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ బన్నీ మ్యూజియం సంగతులు. భలే ఉన్నాయి కదూ!