ఇది ప్రకృతి పరిచిన దారి!
హాయ్ ఫ్రెండ్స్... సముద్రాన్ని ఆనుకుని ఎవరో రాళ్లు పరిచినట్లు ఉంది కదూ ఈ దృశ్యాలను చూస్తుంటే కానీ ఇది మనుషులు చేసిన పని కాదు. ప్రకృతి మలిచిన రాళ్లు ఇవి. కాస్త వింతగా ఉన్నా.. ఇది నిజం.. ఇదే నిజం! మరి ఈ విశేషాలేంటో.. తెలుసుకుందామా!
ఈ విచిత్ర రాళ్లు... ఉత్తర ఐర్లాండ్‌లోని ఉత్తర తీరంలోని బుష్‌మిల్స్ పట్టణానికి 4.8 కిలోమీటర్ల దూరంలోని కౌంటీ ఆంట్రిమ్‌లో ఉన్నాయి. ప్రకృతి చేసిన వింతను 'జెయింట్ కాజ్ వే అని పిలుస్తారు. దాదాపు 50 నుంచి 60 మిలియన్ సంవత్సరాలకు పూర్వం కౌంటీ ఆంట్రిమ్ ప్రాంతంలో తీవ్రమైన అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవించాయి. అప్పుడు వెలువడిన లావా పెద్ద ఎత్తున పేరుకుపోయింది. అది అత్యంత వేగంగా చల్లబడటం వల్ల ఇలా పగుళ్లు ఏర్పడి, స్థూపాకార నిర్మాణాలు వచ్చాయి. చాలా చోట్ల ఆరు, నాలుగు, అయిదు, ఏడు, ఎనిమిది భుజాలుగా ఆకారాలు ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని 12 మీటర్ల, 28 మీటర్ల మందంతోనూ ఉన్నాయి.
లక్షల సంఖ్యలో...
కౌంటీ ఆట్రిమ్‌లో మొత్తం మీద దాదాపు 40,000 వరకు ఇంటర్‌లాకింగ్ స్తంభాలున్నాయి. ఈ ప్రకృతి వింతను 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 1987లో ఐర్లాండ్ పర్యావరణ శాఖ 'జాతీయ ప్రకృతి రిజర్వ్'గా ప్రకటించింది. బసాల్డ్ శిలలతో ఏర్పడిన ఈ వింతను చూడ్డానికి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. తెగ ముచ్చటపడి సెల్ఫీలూ తీసుకుంటూ ఉంటారు. వాటన్నింటినీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ... సంబరపడిపోతుంటారు.
రంగులే రంగులు...
ప్రకృతి సృష్టించిన ఈ శిలాస్తంభాలు నలుపు, ఇసుక, లేత గోధుమ రంగుల్లో కనువిందు చేస్తున్నాయి. ఇంకా చిమ్మీ, హనీకోంబ్, ఒంటె మూపురం, షూ ఆకారంలో ఉన్న శిలలు కూడా అక్కడక్కడా దర్శనమిస్తుంటాయి. వీటిని వీక్షించిన వారు కచ్చితంగా ఇవన్నీ మానవ నిర్మితాలే అని భ్రమపడుతుంటారు. నేస్తాలూ.. మొత్తానికి 'జెయింట్ కాజ్ వే విశేషాలు భలే ఉన్నాయి కదూ!