హచ్ కుక్క కాదు... ఇది హచికో!
అప్పట్లో ఓ వాణిజ్య ప్రకటనలో చూపించిన హచ్ కుక్క గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! మరి మీకు హచికో గురించి తెలుసా! 'ఉహూ.. మాకు తెలియదు' అని అంటారు కదూ! అయితే ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది... సరేనా!
హచికో అంటే మనకు సరిగ్గా తెలియదు కానీ... జపనీయులకు మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే ఇది అక్కడ హీరో మరి. టోక్యోలోని షిబుయా రైల్వే స్టేషన్ సమీపంలో దీనికి ఓ కాంస్య విగ్రహం కూడా ఉంది. నిత్యం వందలాదిమంది ఈ బొమ్మతో సెల్ఫీలు, ఫొటోలు దిగుతుంటారు. హాలీవుడ్ వాళ్లు దీని మీద 'హచికో.. ఏ డాగ్స్ స్టోరీ' అని సినిమా కూడా తీశారు. కేవలం జపాన్‌లోనే కాదు... అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోనూ దీనికి విగ్రహం ఉంది. టోక్యోలో ఉన్న ప్రతిమకు ప్రతిరూపంగా దీన్ని ఏర్పాటు చేశారు.
“ఇంతకీ ఈ హచికోలో ఉన్న గొప్పదనం ఏంటి? అసలు ఎందుకు సినిమా తీశారు, విగ్రహాలు ఏర్పాటు చేశారు? ' అనే అనుమానం మీకు ఈ పాటికే వచ్చి ఉంటుంది కదా! జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీలో 'హిడేసబురో యునో' అనే వ్యక్తి అగ్రికల్చర్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఈయనే హచికోకు మొదటి యజమాని. హచికో 1928 నవంబర్ 10న జపాన్‌లోని ఓడేట్ సిటీలో జన్మించింది. ఇది అకిటా జాతికి చెందిన కుక్క. దీన్ని ప్రౌఫెసర్ యునో 80 యెన్‌లకు కొనుగోలు చేశారు. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం కిందే లెక్క. అలా కొనుగోలు చేసిన అకిటా జాతి కుక్కపిల్లను టోక్యోకు రైలులో తీసుకెళ్లారు. అప్పుడు అది చాలా గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. 1924 జనవరిలో ప్రొఫెసర్ యునో ఇంటికి వచ్చేనాటికి ఆ కుక్కపిల్ల చాలా బలహీనంగా ఉంది. పరిస్థితి కూడా విషమంగా తయారైంది. దాదాపు అందరూ చనిపోతుందనే అనుకున్నారు.
కొన్ని నెలల్లోనే...
కానీ ప్రొఫెసర్ యునో చూపించిన ప్రత్యేక శ్రద్ధ వల్ల అది తిరిగి ఆరునెలల్లోనే బలంగా తయారైంది. ఆయన దీనికి 'హచికో' అని పేరు పెట్టారు. అంటే జపనీస్ భాషలో ఎనిమిది అని అర్ధం. జపనీయులు ఎనిమిదిని అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారు. హచికో, ప్రొఫెసర్ యునో మంచి స్నేహితులయ్యారు. ఆయన దీన్ని తన సొంత కొడుకులానే చూసుకునే వారు.
వీడ్కోలు... స్వాగతం...
హచికో ప్రతిరోజూ తన యజమాని యునోకు షిబుయూ రైల్వేస్టేషన్‌లో వీడ్కోలు పలికేది. తిరిగి ఆయన మధ్యాహ్నం పని నుంచి వచ్చేటప్పటికి స్టేషన్‌కు వెళ్లి స్వాగతం పలికేది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. 1925 మే 21న షిబుయా రైల్వేస్టేషన్‌లో ఎప్పటిలానే తన యజమాని యునోకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది హచికో! కానీ... ఎన్ని గంటలు ఎదురు చూసినా ఆయన రాలేదు.
పదేళ్ల ఎదురు చూపులు!
ప్రొఫెసర్ యునో సెరిబ్రల్ హెమరేజ్‌తో 58 సంవత్సరాల వయసులో విధినిర్వహణలో ఉండగానే మరణించాడు. ప్చ్! పాపం ఈ విషయం హచికోకు తెలియదు. యునో మరణించాక హచికోను కొజాబురో కొబయాషి అనే మరో వ్యక్తి పెంచుకోసాగారు. ఈ కొత్త యజమాని ఇల్లు కూడా షిబుయా రైల్వేస్టేషన్‌కు దగ్గరే కావడంతో హచికో రోజూ మధ్యాహ్నం అక్కడికి వెళ్లేది. తన మొదటి యజమాని రాకకోసం గంటల తరబడి ఓపికగా నిరీక్షించేది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు పదేళ్లు... ఎండనక వాననక, మంచు అనక ఎదురు చూసింది.
కథ మార్చిన పత్రికా కథనం!
ఇలా రైల్వే స్టేషన్‌లో ఎదురు చూసే క్రమంలో హచికో ఎన్నో అవమానాలు, దాడులకు గురైంది. ప్రయాణికులు, సిబ్బంది, పిల్లలు ఈ కుక్కను విపరీతంగా కొట్టేవారు. 1982లో ఓ ప్రముఖ జపనీస్ పత్రికకు చెందిన విలేకరి ఒకరు హచికో ఎదురు చూపుల వెనక ఉన్న వాస్తవం గురించి కథనం ప్రచురించాడు. దీంతో హచికో ఒక్కసారిగా హీరో అయిపోయింది. అప్పటి నుంచి దాన్ని ఎవరూ కొట్టేవారు కాదు. పైగా చాలామంది చక్కటి ఆహారాన్నీ అందించేవారు. రైల్వేస్టేషన్ సిబ్బంది కూడా దాన్ని ఇబ్బంది పెట్టేవారు కాదు. ఇలా దాదాపు తొమ్మిది సంవత్సరాల, తొమ్మిది నెలల 15 రోజుల నిరీక్షణ అనంతరం మార్చి 8, 1985లో హచికో తన ప్రాణాలను విడిచింది. మరణించేనాటికి హచికో వయసు సుమారు 11 సంవత్సరాలు.
విశ్వాసానికి చిహ్నంగా...
ఒక సంవత్సర కాలం పాటు తన ఆలనాపాలనా చూసిన యజమాని కోసం హచికో దాదాపు తన జీవితకాలం మొత్తం ఎదురు చూస్తూనే గడిపింది. ఈ కుక్క ప్రేమ, భక్తి, విధేయత, విశ్వాసానికి చిహ్నంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో జపాన్‌లో మ్యూజియాన్నీ నిర్మించారు. ఎన్నో పుస్తకాలూ ప్రచురితమయ్యాయి. హచికో కథతో హాలీవుడ్‌లో సినిమా కూడా తీశారు. ఇది మరణించి ఏళ్లు గడుస్తున్నా... ఇప్పటికీ జపనీయుల గుండెల్లో శాశ్వతంగా జీవించే ఉంది. నేస్తాలూ! మొత్తానికి ఇదీ హచికో కథ. హృదయాన్ని హత్తుకునేలా, కంటతడి పెట్టించేలా ఉంది కదూ! మీరూ కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటూ ఉంటే. వాటిని అస్సలు హింసించకండి... చక్కగా చూసుకోండి సరేనా!