ఈ నీరు... మరిగినది!



ఈ చలికాలంలో పొద్దున లేవాలంటే మనకు బద్ధకం! బడికి బయలుదేరాలంటే ఇంకా బద్ధకం! ఇక రాత్రైతే చలి గురించి చెప్పాల్సిన పనిలేదు... గజగజ వణికిపోతుంటాం...!! ఈ శీతాకాలంలో నదులు, చెరువుల్లో స్నానం చేయాలంటే ఇక అంతే సంగతులు. కానీ ఓ నదిలో మాత్రం నీరు కాలాలతో సంబంధం లేకుండా నిత్యం వేడిగా ఉంటోంది. అలా అని ఆ నది నీటిలో స్నానం చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టం. మరి ఆ వింత నది సంగతులేంటో తెలుసుకుందామా! షానయ్‌- టింపిష్కా..! "శీతాకాలం అన్నారు. చలి అన్నారు. నది అన్నారు. వేడి నీరు అన్నారు. ఇప్పుడేంటి షానయ్‌- టింపిష్కా.. అని ఏదో నోరు తిరగని పదం అంటున్నారు! అని ఆలోచిస్తున్నారు కదూ! షానయ్‌- టింపిష్కా.. ఇదే ఆ నది పేరు మరి! ఇది పెరులోని హువానుకో అనే దట్టమైన అడవిలో ఉంది. ఈ నది అమెజాన్‌ నదికి ఉపనది. దీనికి లా బొంబా అనే మరో 'పేరు కూడా ఉంది. ఎక్కువగా ఈ పేరుతోనే అది ప్రసిద్ధి. దీనిలో నీరు వేడిగా ఉంటుంది. ప్రపంచంలో ఇదొక్కటే మరుగుతున్న నది. ఇక మరే నదికీ ఈ లక్షణం లేదు!

'పొగలే పొగలు!

షానయ్‌- టింపిష్కా నది నీరు నిత్యం మరుగుతూనే ఉంటుంది. ఈ నీటి ఉష్ణోగ్రతలు ఏకంగా వంద డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయి. దీనికి చుట్టుపక్కల ఎక్కడా అగ్నిపర్వతాలు, వేడినీటి బుగ్గలు కానీ లేవు. అయినా ఈ నదిలో నీరు వేడిగా ఉంటుంది. నీళ్లు ఇలా నిత్యం పొగలు కక్కుతూ ఉండటానికి గల కారణం ఏంటో మాత్రం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. ఎన్ని పరిశోధలు జరిగినా ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే ఉంది.

రాళ్లల్లో... చెట్లల్లో...

ఈ మరిగే నది చుట్టూ... 80 అడుగుల ఎత్తులో రాళ్లు, అడవి రక్షణగా ఉన్నాయి. ఈ నది అడుగున ఉన్న రాళ్లలోంచి వస్తోన్న వేడి వల్ల నీళ్లు ఇలా మరుగుతున్నట్లు ప్రాథమికంగా తేలింది. కానీ ఆ రాళ్లలోంచి వేడి ఎలా వస్తోందో మాత్రం ఇంతవరకూ ఎవరూ కచ్చితమైన కారణం చెప్పలేకపోయారు. ఎక్కడా లేని విధంగా ఈ నదీ గర్భం నుంచే వేడి ఎందుకు ఉద్భవిస్తుందో కూడా పరిశోధకులు తెలుసుకోలేకపోయారు.

బౌషధ జలాలు!

స్థానికులు ఈ నీటిలో జెషధ గుణాలున్నట్లు విశ్వసిస్తుంటారు. ఎన్నో వ్యాధులను తగ్గిస్తాయని నమ్ముతుంటారు. ఎలాగూ షానయ్‌- టింపిష్కా నదిలో నీరు వేడిగా ఉంటుంది కాబట్టి... అందులో ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర సూక్ష్మజీవులు మనుగడ సాగించలేవు. ఎంచక్కా ఈ నీటిని చల్చార్చుకుని తాగేయొచ్చు. నదినీళ్లలో నేరుగా చేతులు పెడితే మాత్రం కాలిపోతాయి. అక్కడక్కడా ఈ నీళ్లల్లో కప్పల్లాంటి జీవులు చనిపోయి, ఉడికిన స్థితిలో కనిపిస్తుంటాయి. అంతెందుకు ఈ నది తీరంలోని బురద కూడా చాలా వేడిగా ఉంటుంది.

తండోపతండాలు!

షానయ్‌- టింపిష్కా నది కేవలం 8.4 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. దీని వెడల్పేమో 225 మీటర్ల వరకు ఉంటుంది. ఇక లోతేమో 6 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రకృతి వింతను చూడ్డానికి ఈ మధ్య తండోపతండాలుగా పర్యాటకులు వస్తున్నారు. వీరి వల్ల ఈ నదికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని ప్రకృతి ప్రేమికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మరిగే నది విశేషాలు. భలే ఉన్నాయి కదూ!

Responsive Footer with Logo and Social Media