చాల్లీ... సాధనతో సాధించాడు!
హాయ్ నేస్తాలూ...! మనం చాలాసార్లు రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసే ఉంటాం కదా.. కాసేపు సరదాగా అనిపించినా, అది సాల్వ్ అవ్వకపోతే మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది. కాసేపటికే పక్కన పెట్టేస్తాం... అంతే కదా! కానీ ఓ అన్నయ్య మాత్రం ఆ ఆటలో రికార్డు సాధించాడు. మరి తనెవరో... ఆ వివరాలేంటో తెలుసుకుందామా!
ఆస్ట్రేలియాకు చెందిన చార్లీ ఎగ్గిన్స్‌కు ప్రస్తుతం 14 సంవత్సరాలు. అతను అతితక్కువ సమయంలో 3×3×3 రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసి రికార్డు బ్రేక్ చేశాడు. అయితే తను ఈ రికార్డు సాధించడానికి ముందు చాలా పోటీల్లో పాల్గొని చివరి వరకు వచ్చి ఓడిపోయాడట.
కళ్లకు గంతలతో...
'మన చార్లీ కళ్లకు గంతలు కట్టుకొని 12.10 సెకన్లలో రూబిక్ క్యూబ్‌ని సాల్వ్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అమెరికాకు చెందిన టామీ చెర్రీ పేరున ఉంది. అతడు 12.78 సెకన్లలో క్యూబ్‌ని సాల్వ్ చేసి, స్పీడ్‌క్యూబర్‌గా రికార్డు సృష్టించాడు. 0.68 సెకన్ల తేడాతో ఆ రికార్డును చార్లీ బ్రేక్ చేసి, ప్రపంచంలోనే నంబర్ వన్ స్పీడ్‌క్యూబర్‌గా నిలిచాడు.
చిన్నప్పటి నుంచే...
నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి రూబిక్ క్యూబ్స్ సాల్వ్ చేయడం నేర్చుకుంటున్నా. కానీ, మొదట్లో ఎక్కువ ఆసక్తి చూపేవాడిని కాదు. 2022 నుంచి ఈ ఆటపై దృష్టి సారించాను. కళ్లకు గంతలు కట్టుకొని సాధన చేయడం మొదలుపెట్టాను. అలా చేస్తున్న సమయంలో ఒక క్యూబ్ సాల్వ్ చేయడానికి కనీసం 5 నిమిషాలు పట్టేది. కానీ ఇప్పుడు కేవలం కొన్ని సెకన్లలోనే పూర్తి 'చేయగలుగుతున్నాను. ఇదంతా సాధనతోనే సాధ్యమైంది. నేను దీని కోసం కొన్ని గంటల సమయం కష్టపడ్డాను. దాదాపు 25వేల సార్లు ప్రాక్టీస్ చేశాను' అని చెబుతున్నాడు మన చార్లీ. ప్రస్తుతం తను మరో రికార్డును సాధించడానికి సన్నద్ధం అవుతున్నాడట. సాధనతో ఏదైనా సాధించవచ్చని చెబుతున్న చార్లీ... తను అనుకున్నట్లు మరిన్ని రికార్డులు సాధించాలని 'ఆల్ ది బెస్ట్' చెబుదామా...!