చూడచక్కని సరస్సును నేను!



నమస్తే నేస్తాలూ! నేనో సరస్సును. నాకో ప్రత్యేకత ఉంది. నా చిత్రాలు చూడగానే మీకు ఈ పాటికే అర్ధమై ఉంటుంది. ఇంతకీ నా పేరేంటి... నేను ఉండేది ఎక్కడ. ఇలాంటి వివరాలన్నీ మీకు తెలుసుకోవాలని అనిపిస్తోంది కదూ! అయితే ఎంచక్కా ఈ కథనం చదివేయండి సరేనా! చూడ్డానికి పెనంలా గుండ్రంగా కనిపిస్తున్న నా పేరు కింగ్స్‌లీ లేక్‌. నేను ఫ్లోరిడాలో ఉన్నాను. నన్ను "సిల్వర్‌ డాలర్‌ లేక్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇంతకీ నాకు ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసా? నా పై నుంచి ఆకాశమార్గంలో విమానాలు నడిపే పైలట్లు! నన్ను పై నుంచి చూస్తే వారికి ఓ వెండినాణెం మెరుస్తున్నట్లుగానే కనిపిస్తాను. అందుకే నన్ను ముద్దుగా అలా పిలుస్తారు. 'మరో విషయం ఏంటంటే... ప్రపంచంలోనే అత్యంత గుండ్రటి సరస్సును నేనే అని సందర్శకులు భావిస్తుంటారు.

వేసవి వచ్చిందంటే చాలు...

నేను చాలా పెద్ద సరస్సును. నా విస్తీర్ణం దాదాపు 2000 ఎకరాలు. నేను ఫ్లోరిడాలోని స్టార్క్‌కు తూర్పున క్లే కౌంటీలో ఉన్నాను. వేసవి వచ్చిందంటే చాలు వేల సంఖ్యలో సందర్శకులు నా దగ్గర సేద తీరడానికి వస్తుంటారు. నా తీరం పొడవు 8 కిలోమీటర్ల కన్నా కూడా ఎక్కువే ఉంటుంది. నా లోతు గరిష్టంగా 90 అడుగులు ఉన్నట్లు అంచనా. ఫ్లోరిడాలోనే లోతైన సరస్సుగానూ నాకు గుర్తింపు ఉంది. కొలత కొలిచినట్లుగా ఇంత గుండ్రంగా ఉన్నా కదా... నన్ను ఎవరైనా ఇంజినీర్లు నిర్మించి ఉంటారని అనుకుంటున్నారు. కదూ! అయితే మీరు పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే నేను ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ అతి పురాతనమైన సరస్సును. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ! సరే.. ఇక ఉంటామరి. అన్నట్లు మీకో విషయం చెప్పాలి అనుకుంటున్నా... ఎక్కడన్నా నా లాంటి చెరువులు, సరస్సులు, జలాశయాలు, ఈత కొలనులు కనిపిస్తే దూరం నుంచే చూడండి. ఈత రాకుండా నీటిలో దిగే ప్రయత్నం మాత్రం చేయొద్దు... సరేనా!

Responsive Footer with Logo and Social Media