నలుపు... తెలుపు.. కలగలుపు!
హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా! నేనో వానరాన్ని, మీ దగ్గర కనిపించను కదా! మీకు నా గురించి తెలిసి ఉండదు. అందుకే నా గురించి మీకు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను. నలుపు, తెలుపు రంగుల్లో, పొడవైన తోకతో మామూలు కోతులకు భిన్నంగా భలే ఉన్నాను కదూ! మరి నా పేరేంటి? నేను ఎక్కడ ఉంటాను? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుంటారా? !
నా పేరు రోలోవే కోతి. నేను ఆఫ్రికాకు చెందిన జీవిని. ఈ ఖండంలో పశ్చిమ భాగంలో ఐవరీకోస్ట్, ఘనా అడవుల్లో నేను జీవిస్తూ ఉంటాను. చాలా అరుదైన జీవిని. మా సంఖ్య అడవుల్లో చాలా తక్కువగా ఉంది. నా శరీరం మీద నలుపు, తెలుపు రంగు వెంట్రుకలుంటాయి. నాకు తెల్లని గడ్డం కూడా ఉంటుంది. నుదుటి మీద కళ్లపైన సమాంతరంగా తెల్లటి గీత సైతం కనిపిస్తుంది. నా ముఖమేమో నలుపు రంగులో ఉంటుంది. 40 సెంటీమీటర్ల నుంచి 55 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. తోక చాలా పొడవుగా ఉంటుంది. 50 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. మాలో మగవి 5 కిలోల వరకు బరువు తూగుతాయి. ఆడవేమో 2.5 కిలోల వరకు పెరుగుతాయి.
చిన్న చిన్న కీటకాలనూ...
నేను ఎక్కువగా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, పత్రాలను ఆహారంగా తీసుకుంటాను. చిన్న చిన్న కీటకాలు, లార్వాలు, గుడ్లను కూడా తింటాను. దాదాపు 180 రకాల వృక్షజాతుల ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటాను. పగటిపూట చాలా ఉత్తేజంగా ఉంటాను. రాత్రిపూట హాయిగా నిద్రపోతాను. నేను 20 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు జీవించగలను.
సీజన్లను బట్టి...
నేను సంవత్సరకాలానికి అనుగుణంగా నా ఆహారాన్ని మార్చుకుంటాను. వేసవి, శీతాకాలంలో ఎక్కువగా పండ్లు, విత్తనాలను తింటాను. వర్షాకాలంలో కీటకాలు, లార్వాలు, పక్షుల గుడ్ల మీద ఎక్కువగా ఆధారపడతాను. చిరుతపులులు, గద్దలు, చింపాంజీలు మాకు ప్రధాన శత్రువులు. వీటి నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవడానికి అరుపులు, కేకలతో ఇతర రోలోవే కోతులను అప్రమత్తం చేస్తుంటాం. పర్యావరణ మార్పులు, విపరీతమైన వేట వల్ల మా సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. మేం ప్రస్తుతం అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ!