భలే భలే.. సీతాకోకచిలుక!
సీతాకోక చిలుకలు అనగానే మనకు రంగురంగుల రెక్కలు గుర్తుకు వస్తాయి కదూ! కానీ గ్రీన్ డ్రాగన్ టెయల్ సీతాకోకచిలుకలు మిగతావాటికి పూర్తి భిన్నంగా ఉంటాయి. వీటి రెక్కల చివర తోకల్లాంటి నిర్మాణాలతో బుజ్జి డ్రాగన్‌లా కనిపిస్తాయి. వీటి రెక్కలు 40 నుంచి 55 మిల్లీమీటర్ల వరకు ఉంటాయి. వీటికి 25 నుంచి 40 మిల్లీమీటర్ల పొడవుతో పెద్ద కొనలు కూడా ఉంటాయి. ఇవే తోకల్లా కనిపిస్తాయి. ఈ గ్రీన్ డ్రాగన్ టెయల్ సీతాకోకచిలుకల రెక్కలు నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో కనువిందు చేస్తాయి.
ఇవి తమ రెక్కలను వేగంగా ఆడిస్తాయి. ఆహారం తీసుకునేటప్పుడు కూడా వాటిని కదిలిస్తూనే ఉంటాయి. ఎగిరేటప్పుడు తూనీగలను గుర్తుకు తెస్తాయి. వీటి పొడవాటి తోకలు చుక్కానిలా పనిచేస్తాయి. ఆడవాటి కంటే మగవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. వీటి గుడ్లు లేత ఆకుపచ్చ రంగులో గోళాకారంలో ఉంటాయి. గొంగళిపురుగేమో ముదురు ఆకువచ్చ, నలుపు రంగులో ఉంటుంది. ఇవి ఎక్కువగా మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, దక్షిణ చైనా, కంబోడియా, తూర్పు మలేషియా, ఇండోనేసియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాల్లో జీవిస్తుంటాయి. మనదేశంలోనూ వీటి ఉనికి ఉంది. అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపుర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి.