చక్కని చుక్కల చేపను నేను!
హాయ్ ఫ్రెండ్స్..! ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. “ఈ చేప ఏంటబ్బా... చిరుతపులిలా ఒళ్లంతా చుక్కలతో చూడచక్కగా ఉందేంటి?” అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఆ వివరాలు చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను. నా విశేషాలు తెలుసుకుంటారా మరి!
నా పేరు లెపర్ట్ బుష్ ఫిష్. స్పాటెడ్ లీఫ్ ఫిష్, స్పాటెడ్ సెట్నొపొమా, లెపర్డ్ సెట్నొపొమా, స్పాటెడ్ క్లైంబింగ్ పెర్చ్, స్పాటెడ్ సిచ్లిడ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. నేనో మంచి నీటి చేపను. మధ్య ఆఫ్రికాలోని కాంగో నదీ పరివాహక ప్రాంతంలో జీవిస్తుంటాను.
నేను చాలా నెమ్మదిగా పెరుగుతాను. పూర్తి పరిమాణానికి చేరుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే నన్ను చాలా మంది తమ అక్వేరియాల్లో పెంచుకుంటారు. సహజ వాతావరణంలో నేను 20 సెంటీమీటర్ల వరకు పొడవు పెరగగలను. అక్వేరియాల్లో మాత్రం 15 సెంటీమీటర్ల వరకు చేరుకోగలను.
దూకుడుగా ఉంటాను!
నేను చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాను. నా కంటే చిన్న చేపలపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి వాటిని ఆహారంగా తీసుకుంటాను. అందుకే నన్ను అక్వేరియాల్లో పెంచుకోవాలనుకునేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న పురుగులు, రొయ్యలను కూడా హాంఫట్ చేసేస్తాను. నేను 5 నుంచి 10 సంవత్సరాల వరకు జీవిస్తాను. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై... బై...!