ఇదో.. జల బాహుబలి!
హాయ్ ఫ్రెండ్స్! మీకు అక్వేరియం తెలుసు కదా! అందులో బుజ్జి బుజ్జి చేపలు పెంచుకుంటూ ఉంటారు. వీటిలో గోల్డ్‌ఫిష్‌కు క్రేజ్ ఎక్కువ. నారింజ రంగులో ఉండే ఈ చేప భలే ఆకట్టుకుంటుంది. అందుకే చాలామంది తమ అక్వేరియాల్లో ఈ చేపకు కచ్చితంగా చోటు కల్పిస్తారు. కానీ ఓ గోల్డ్‌ఫిష్ మాత్రం అమాంతం పెరిగి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 'మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!
ఇటీవల ఫ్రాన్స్‌లోని బ్లూవాటర్ లేక్స్ అనే పేరున్న ఓ చెరువులో పే...ద్ద గోల్డ్‌ఫిష్ దొరికింది. దీని బరువు ఏకంగా 30 కిలోలుగా తూగింది. ఈ చేప ఇంగ్లాండ్‌కు చెందిన ఆండీ హాక్కెట్ అనే వ్యక్తి గేలానికి చిక్కింది. కానీ దీన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఆయన 25 నిమిషాల పాటు శ్రమించాల్సి. వచ్చింది.
ఆశ్చర్యం + ఆనందం...
ఎప్పటిలానే ఆండీ... చెరువులో గేలం వేశాడు. కాసేపటికి దానికి ఏదో చిక్కినట్లుగా అనిపించి, పైకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ అదేదో పెద్ద జీవిగా తోచింది. ముందు చాలా భయపడ్డాడు. తర్వాత కాసేపటికి నారింజ రంగులో ఉన్న పే...ద్ద చేప ప్రత్యక్షమైంది. ఇంకేముంది ఒకేసారి ఆశ్చర్యం, ఆనందానికి లోనయ్యాడు. అన్నట్లు ఈ చేపకు ఆ అంకుల్ క్యారెట్ అని ముద్దు పేరు కూడా పెట్టాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్‌ఫిష్ అని తెలుసుకుని మరింత మురిసిపోయాడు. ఆ జల బాహుబలితో కొన్ని ఫొటోలూ తీసుకున్నాడు.
గత రికార్డు బద్దలు!
ఇంతకు ముందు ఈ రికార్డు 2019లో అమెరికాలోని మిన్నసోటాలో దొరికిన గోల్డ్‌ఫిష్‌కు ఉండేది. దీన్ని జాన్సన్ పుగేట్ అనే వ్యక్తి పట్టుకున్నాడు. ఈ చేప 11 కిలోల బరువు ఉండేది. ఆండీకి చిక్కిన 'క్యారెట్' దీని కన్నా 18 కిలోల ఎక్కువ బరువుంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్‌ఫిష్ రికార్డును 'క్యారెట్ సొంతం చేసుకుంది.
పదిలంగా వదిలేశాడు...
ఆండీ హాక్కెట్ అంకుల్ చాలా మంచివారు కాబట్టి 'క్యారెట్‌ను తిరిగి పదిలంగా చెరువులోనే వదిలేశారు. అంటే అది ముందు ముందు మరింత బరువు పెరిగే అవకాశముందన్నమాట! బ్లూవాటర్ లేక్స్‌కు సంబంధించిన ఫిషనరీ మేనేజర్ జాసన్ కోవ్లర్... మరో ఆసక్తికరమైన విషయమూ చెప్పాడు. ఆండీ అంకుల్ పట్టుకున్న ఈ 'క్యారెట్‌కు దాదాపు 20 సంవత్సరాలు ఉండొచ్చన్నాడు. ఇరవై సంవత్సరాల క్రితం ఇలాంటి చేపల్ని, ఫిషింగ్ కోసం ఈ చెరువులో వదిలిపెట్టారని చెప్పారు. కానీ ఇది ఇన్ని సంవత్సరాలు ఎవరికీ చిక్కలేదు. పైగా ఎవరి కంటికీ కనిపించకుండా... ఇలా భారీగా పెరుగుతూ వచ్చింది. మామూలుగా అయితే ఈ జాతి చేపలు ఎక్కువలో ఎక్కువ 59 సెంటీమీటర్ల పొడవు, 4.5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. కానీ ఈ జల బాహుబలి మాత్రం ఏకంగా 30 కిలోల వరకు బరువు పెరిగింది. ఎంతైనా ఈ 'క్యారెట్... అదే నేస్తాలూ.. ఆండీ అంకుల్ పట్టుకున్న గోల్డ్‌ఫిష్ గ్రేట్ కదూ!