ఎక్కడి జీవులు అక్కడే గప్‌చుప్!
చూస్తే చిన్న కుక్కపిల్లంత ఉంటాను. అమాయకంగానూ కనిపిస్తాను. కానీ... నా పేరు చెబితే చాలా ప్రాణులకు హడల్. నేను వస్తున్నా అంటే చాలు అవన్నీ . గప్‌చుప్! అయిపోతాయి. ఎందుకంటే నేను వాటిని వేటాడేస్తా కాబట్టి.
నా పేరు టాస్మేనియన్ డెవిల్, నిజానికి ఆస్ట్రేలియా నా స్వస్థలం. కానీ 8,500 సంవత్సరాల క్రితమే అక్కడ నేను అంతరించిపోయాను. ప్రస్తుతం టాస్మేనియా ద్వీపానికి మాత్రమే పరిమితమయ్యాను. 'మా సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. 2018 నుంచి ఆస్ట్రేలియా, పలు దేశాల జూలల్లో ఆశ్రయం పొందుతున్నాను. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం కూడా మా సంరక్షణ కోసం ప్రస్తుతం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
నేను చిన్నగా ఉన్నా. చాలా వేగంగా పరిగెత్తగలను. నాకు ఈత కూడా వచ్చు. చెట్లనూ ఎక్కగలను, కానీ వయసు పెరిగే కొద్దీ కాస్త కష్టమవుతుంది. మాలో ఆడవాటికి కంగారూలకు ఉన్నట్లే పొట్టకు సంచి ఉంటుంది. అందులోనే అవి పిల్లలను సంరక్షిస్తాయి.
నాకు బలమైన దవడలు, గట్టి దంతాలుంటాయి. వీటితో చిన్న చిన్న కంగారూలనూ కరకరలాడించేయగలను. ఇంకా కంగారూల్లా ఉండే వల్లబీలు, కుందేళ్లు, గొర్రెలు, మేకలు, పక్షులు, చేపలు, కప్పలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాను. పండ్లు, కూరగాయలనూ తింటాను. దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు జీవించగలను. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా సంగతులు.