ఎంచక్కా... ఎగురుతానోచ్‌!



కాదు... ఎగరడమూ వచ్చు. మీకు నమ్మకం కుదరడం లేదు కదూ! కానీ ఇది నిజంగా నిజం. ఆ వివరాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉంది కదా! అందుకే... ఆ విశేషాలు చెప్పిపోదామని నేనే ఇదిగో ఇలా స్వయంగా వచ్చా.

నా పేరు జపనీస్‌ స్క్విడ్‌. జపనీస్‌ కామన్‌ స్క్విడ్‌, పసిఫిక్‌ ఫ్రైయింగ్‌ స్క్విడ్‌ అని కూడా పిలుస్తుంటారు. నేను ఆక్టోపస్‌కు బంధువును. ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో, జపాన్‌ సముద్రజలాల్లో, చైనా తీరం వెంట రష్యా వరకు జీవిస్తుంటాను. బేరింగ్‌ జలసంధి తూర్పున అలస్కా, కెనడా దక్షిణ తీరంలో, వియత్నాం చుట్టూ కూడా కనిపిస్తుంటాను. మరో విచిత్రమైన విషయం ఏంటంటే నాకు మూడు హృదయాలు ఉంటాయి. నేను దాదాపు 0.5 కిలోల వరకు బరువు తూగగలను. నా జీవిత కాలం కేవలం సంవత్సరం మాత్రమే. నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. మేం గుంపులు గుంపులుగా జీవిస్తుంటాం.

శక్తిని ఆదా చేసుకునేందుకు...

నాకు ఎనిమిది చేతులు, రెండు టెంటకిల్స్‌ ఉంటాయి. నేను ఒకటిన్నర అడుగుల పొడవు ఉంటాను. సముద్ర జలాల ఉపరితలం మీద 10 అడుగుల ఎత్తు వరకు ఎగరగలను. శత్రువుల నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు, వలస వెళ్లినప్పుడు నా శక్తిని ఆదా చేసుకునేందుకు ఇలా ఎగురుతాను అన్నమాట. ఆల్బాట్రాస్‌, తిమింగలాలు, డాల్ఫిన్లు, సీల్స్‌ కూడా నాకు ప్రధాన శత్రువులు. నన్ను మీ మనుషులు సైతం ఆహారంగా తీసుకుంటారు. అందుకే నన్ను పెద్ద మొత్తంలో వేటాడుతుంటారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! ఇక ఉంటా మరి బై.. బై...!

Responsive Footer with Logo and Social Media