భలే.. భలే.. బాతునోయ్‌!



తెలిసి ఇంతకుముందెన్నడూ నన్ను చూసి ఉండరు. అందుకే నా గురించి చెప్పి పోదామని... ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చి వాలాను. మరి నా విశేషాలు తెలుసుకుంటారా! నా పేరు కామన్‌ షెల్డ్‌ డక్‌ నేను సాధారణంగా మీరు పెంచుకునే బాతు పరిమాణంలో ఉంటాను. నా ముక్కు ఎరుపు రంగులో ఉంటుంది. పాదాలేమో లేత గులాబీ వర్ణంలో ఉంటాయి. నా ఈకలు తెలుపు, నలుపు, ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉంటాయి. మాలో ఆడ, మగ చూడ్డానికి ఒకేలా ఉంటాయి. కానీ ఆడవి పరిమాణంలో కాస్త చిన్నవి. మరో విశేషం ఏంటంటే. మేం ఎంచక్కా ఎగరగలం.

యూరప్‌, ఆసియా, ఆఫ్రికాల్లో మేం కనిపిస్తుంటాం. శీతాకాలంలో దూరప్రాంతాలకు 'వలసపోతుంటాం. మాకున్న మరో ప్రత్యేక లక్షణం ఏంటంటే. ఎక్కువగా కుందేలు బొరియల్లో మా గూళ్లను నిర్మించుకుంటాం. చెట్ల తొర్రల్లోనూ నివాసాలు ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడే గుడ్లను పెట్టి, వాటిని 'పొదుగుతాం. మాలో ఆడవి ఒక్కసారికి 5 నుంచి 10 గుడ్లను పెడతాయి. నత్తగుల్లలు, కీటకాలు, చిన్న చిన్న చేపలు, ఇతర జలచరాలను ఆహారంగా తీసుకుంటాం. మా జీవితకాలం దాదాపు 14 సంవత్సరాలు. గద్దలు, కుక్కలు, నక్కలు, పులులు మాకు ప్రధాన శత్రువులు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. అరరె... మీకో విషయం చెప్పడం మరిచిపోయానే. ఫర్లేదులే... ఎంచక్కా ఇప్పుడు చెప్పేస్తా! అదేంటంటే మీ అందరికీ "స్నేహితుల దినోత్సవం' శుభాకాంక్షలు. సరే... ఇక ఉంటామరి. బై... బై...!

Responsive Footer with Logo and Social Media