ఈ పిజ్జా... అధరహో...!
హాయ్ నేస్తాలూ...! ఇంట్లో అమ్మ చేసిన స్నాక్స్ తినమంటే. ఏవేవో సాకులు చెప్పి, తినకుండా తప్పించుకుంటాం. అదే చాక్లెట్స్, పిజ్జాలు, బర్గర్లు లాంటివైతే తినొద్దని చెప్పినా వినకుండా తినేస్తాం... అంతే కదా...! ఇప్పుడు ఈ స్నాక్స్ గోలేంటి అనుకుంటున్నారా...? ఎందుకంటే మనం ఒక రకమైన పిజ్జా గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం కాబట్టి...!
ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిజ్జా పేరు 'లూయిస్ 18. ఇప్పటి వరకు మనం మహా అయితే ఒక పిజ్జాకు రూ.500 వరకు ఖర్చు పెట్టి ఉంటాం. కానీ దీని ధర మాత్రం 12000 డాలర్లట. అంటే 'మన ఇండియా రూపాయల్లో అయితే దాదాపు రూ.9,88,218. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ... కానీ నిజమే ఫ్రెండ్స్, అంత ధర ఉందంటే. పరిమాణం ఎంత పెద్దగా ఉంటుందో అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే... అది 20 సెంటీ మీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిజ్జా కూడా ఇదే.
ప్రత్యేకమైన పదార్థాలతో...
ఈ పిజ్జాను ఇటలీకి చెందిన రెనాటో వియోలా అనే చెఫ్, మరో చెఫ్ సాయంతో తయారు చేశాడు. వీటిని తయారు చేయడంలో ప్రపంచంలోనే తనకెవ్వరూ సాటి లేరట. పిజ్జా అంటే. ఓ రెండుమూడు గంటల్లో చేసేస్తారు ఏముందిలే అనుకుంటాం. కానీ దీని తయారీకి మాత్రం "12 గంటల సమయం పట్టిందట. దీని కోసం అన్నీ ప్రత్యేకమైన పదార్థాలనే ఉపయోగించారట. ఇతర దేశాలకు చెందిన అత్యంత ఖరీదైన ఎండ్రకాయలు, వివిధ జాతులకు చెందిన రొయ్యలు అలాగే ముర్రే నది నుంచి సేకరించిన... ఆస్ట్రేలియన్ పింక్ సాల్ట్‌ను వాడారట. ఇంకా ఇందులో ఉపయోగించే చీజ్‌ను ఇటాలియన్ గేదె పాలతో ప్రత్యేకంగా తయారు చేయించారు. మీకో విషయం తెలుసా... ఈ లూయిస్ పిజ్ఞాను తయారుచేసి నిల్వ ఉంచరట. కావాల్సిన వాళ్లు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే తయారు చేయడం ప్రారంభిస్తారట. ఈ పిజ్జా విశేషాలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదా.. రుచిగా ఉంటాయని మీరు ఎక్కువగా ఈ పిజ్జాలు, బర్గర్లు తినకండి నేస్తాలూ..! అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు సరేనా...!