నా తలకట్టు... అదిరేట్టు!
'హాయ్ ఫ్రెండ్స్... బాగున్నారా! ఏంటి అలా చూస్తున్నారు. 'నేను ఎవరనా?'... నేనో నీటి పక్షిని. “మరేంటి... మాకు ఎప్పుడూ కనిపించలేదు?” అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది కదూ! నేను 'మీ దేశంలో... అంతెందుకు మీ ఖండంలోనూ ఉండను. అందుకే నేనెవరో మీకు తెలిసి 'ఉండకపోవచ్చు. అందుకే నా విశేషాలు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.
'కిరీటంలాంటి తలకట్టుతో ఉన్న నాపేరు హూడెడ్ గ్రే్ నేను కేవలం అర్జెంటీనాలోని దక్షిణ ప్రాంతంలో మాత్రమే నివసిస్తుంటాను. నా శరీరం మీద నలుపు, తెలుపు రంగు ఈకలుంటాయి. కళ్లేమో ఎర్రగా భలేగా ఉంటాయి. అన్నింటికన్నా నా తలకట్టే నాకు ప్రత్యేకం! నేను అత్యంత అరుదైన పక్షిని. దాదాపు 82 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాను. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ 'కన్టర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అనే సంస్థ నన్ను 2012లో అంతరించిపోతున్న పక్షుల జాబితా నుంచి తీవ్రంగా అంతరించిపోనున్న జాబితాలోకి చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా మా సంఖ్య చాలా తక్కువ. 1991లో 3,000 నుంచి 5,000 మధ్య ఉన్న మా జనాభా 2013 నాటికి కేవలం 900కు పడిపోయింది. 2014 నుంచి తీసుకుంటున్న చర్యల వల్ల ప్రస్తుతం మా సంఖ్య కాస్త పెరిగింది!
కనబడితే చాలు...
అడవుల నరికివేత, పర్యావరణ మార్పులు, మాకు నివాస యోగ్యమైన ప్రాంతాలు తగ్గిపోవడం... ఇవన్నీ మా జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు. మామూలుగానే మాలో సంతానోత్పత్తి తక్కువ. దానికి తోడు ఈ ప్రతికూలతలతో మా సంఖ్య నానాటికీ వేగంగా పడిపోతోంది. విపరీతంగా మేకలు, గొర్రెల పెంపకంతో కూడా మా సహజ ఆవాసాలు దెబ్బతింటున్నాయి. అలాగే మింక్ అనే నీటికుక్కలాంటి జీవి మాకు ప్రధాన శత్రువు. అసలే మేం అరుదైన జీవులం అంటే మేం కనబడితే చాలు. అది మమ్మల్ని తినేస్తోంది. మా దగ్గరి ప్రభుత్వ యంత్రాంగాలు కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యాయి. పటగోనియా నేషనల్ పార్క్‌ను మాకు రక్షిత ప్రాంతంగా కేటాయించి, మా పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి.
'చేపలంటే ఇష్టం...
అన్నట్లు... ఇంతకీ మేం ఏం తింటామో చెప్పనేలేదు కదూ! చేపలు, కప్పలు, పీతలు, చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాం. మేం నీళ్లలో డైవ్ చేస్తాం కానీ... మరీ లోతు వరకు వెళ్లలేం. 15 నుంచి 80 సెకన్ల వరకు మాత్రమే డైవ్ చేయగలం. ఈలోగానే మేం మా ఆహారాన్ని సంపాదించుకోవాలి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై...!