పిట కొంచెం... తోక దాదాపు శూన్యం!
హాయ్ నేస్తాలూ! నేను మీకు తోక లేని పిట్టలా కనిపిస్తున్నాను కదూ! కానీ నాకు ఉండీ లేనట్లుగా చాలా చిన్న తోక ఉంటుంది. నేను చిరు పక్షిని. నా పేరు, వివరాలు తెలుసుకోవాలని మీకు తెగ ఆసక్తిగా ఉంది కదా! అందుకే ఆ విశేషాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.
నా పేరు న్యూజిలాండ్ రాక్‌రెన్. నా స్వస్థలం న్యూజిలాండ్. రాక్‌రెన్ పేరుతో మరో షక్షి కూడా ఉంది. అది ఉత్తర అమెరికాలో ఉంటుంది. కానీ దానికి, నాకూ ఏ సంబంధమూ లేదు. నిజానికి దానికన్నా నేనే అందంగా ఉంటాను తెలుసా! ప్రస్తుతం నేను, న్యూజిలాండ్‌లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాను.
కాళ్లలోనే బలం!
నా కాళ్లు పొడవుగా, బలంగా ఉంటాయి. వీటితోనే దూకుతాను. వేగంగా పరిగెత్తుతాను. నిజానికి నేను పెద్దగా ఎగరలేను. చాలా చిన్న చిన్న దూరాలకు మాత్రమే రెక్కల్ని ఆడిస్తాను. భూమి నుంచి కేవలం 2 మీటర్ల నుంచి 80 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఎగురుతాను. మేం చాలా బుజ్జి పక్షులం. మాలో మగపక్షులు 18 గ్రాముల బరువుంటే. ఆడపక్షులు 20 గ్రాముల వరకు బరువు తూగుతాయి. మగవి ఆకుపచ్చ రంగులో ఉంటే ఆడవి గోధుమ రంగులో ఉంటాయి.
ఏం తింటామంటే...
మేం చిన్న చిన్న పురుగులు, బెర్రీలు, గింజలను తింటాం. కొన్ని రకాల పువ్వుల నుంచి మకరందాన్ని కూడా తాగుతాం. మేం దాదాపు ఏడు సంవత్సరాల వరకు జీవిస్తాం. మంచుకురిసే సమయాల్లో మేం ఇతర పక్షుల్లా వలసవెళ్లలేం. బదులుగా రాళ్ల సందుల్లోకెళ్లిపోయి.. అక్కడే నిక్షేపంగా... కాలక్షేపం చేస్తుంటాం. ఎలుకలు, అడవి పిల్లుల్లాంటి జీవులు... మాకు ప్రధాన శత్రువులు. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల మా జనాభా వేగంగా క్షీణిస్తోంది. నేస్తాలూ...! మొత్తానికి ఇవీ నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ!