చిన్ని యూట్యూబ్‌ క్వీన్‌...!



హాయ్‌ నేస్తాలూ..! మనకు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు... అమ్మానాన్నల ఫోన్‌ తీసుకొని గేమ్స్‌ ఆడేస్తాం. లేదంటే ఎంచక్కా యూట్యూబ్‌ వీడియోలు చూస్తాం అంతే కదా! కానీ మనలాంటి ఓ చిన్నారి... వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో కోట్లలో ఫాలోవర్లను సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన డయానాకు పది సంవత్సరాలు. తను ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతుంది. అందులో విద్య, సంగీతం, సరదా ఆటలు, క్రాఫ్ట్‌లు, స్కూల్‌కు సంబంధించిన ప్రాజెక్టు వర్క్స్‌ చేయడం... వంటి అంశాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తుంది. మీకో విషయం తెలుసా... ఆ ఛానెల్‌కు 18 కోట్ల 20 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

“ఛానెల్‌ ప్రారంభించినప్పుడు కొంతమంది మాత్రమే మా వీడియోలు చూసేవారు. అయినా కూడా నిరాశపడకుండా.. రకరకాల అంశాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఉన్నాం. అలా ఈ రోజు విజయాన్ని సాధించాం. ఓపికతో... కష్టపడి పని చేస్తే... ఏదో ఒక రోజు కచ్చితంగా గెలుపు మన సొంతం అవుతుంది. అయితే ఇందులో మా అమ్మానాన్నలు, తమ్ముళ్ల సహకారం చాలా ఉంది. చదువు, యూట్యూబ్‌ రెండింటికీ ఒక సమయాన్ని కేటాయించి... దానికి తగ్గట్లుగా నన్ను సన్నద్ధం చేశారు. వాళ్లు కూడా నాతో పాటు... వీడియోలు చేస్తారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు 'మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి' అని చెబుతోంది డయానా. ఈ చిన్నారి... తన ప్రతిభతో యూట్యూబ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు, వీక్షకులు కలిగిన అమ్మాయిగా 'గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.

Responsive Footer with Logo and Social Media