సముద్రానికి నేనే 'బాస్'!
అనగనగా ఓ చేప . అది రాజుగారి ఏడు చేపల కథలోది మాత్రం అస్సలు కాదంట. తనే సముద్రానికి 'బాస్' అంట. బాహుబలిలాంటి తన గురించి మనకు కొన్ని సంగతులు చెబుతుందట. మరి ఆ విశేషాలేంటో దాని మాటల్లోనే తెలుసుకుందామా!
నా పేరు జెయింట్ సీ బాస్. పసిఫిక్ మహాసముద్రం నా స్వస్థలం. బ్లాక్ సీ బాస్, జెయింట్ బ్లాక్ సీ బాస్ అని కూడా నన్ను పిలుస్తుంటారు. నేను దాదాపు 8 అడుగుల పొడవు వరకు 'పెరగగలను. ఇక బరువేమో ఏకంగా 250 కిలోల వరకు తూగుతాను. పొడవు, బరువే కాదు.. మా జీవితకాలం కూడా మిగతా చేపలతో పోల్చితే ఎక్కువే 15 సంవత్సరాల వరకు జీవించగలమని మీ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. నేను ఎక్కువగా చేపలు, పీతలు, చిన్న చిన్న సౌరచేపలు, ఇతర జలచరాలను ఆహారంగా తీసుకుంటాను. నా శరీరం పెద్దగా ఉన్నప్పటికీ నేను నీటిలో మెరుపువేగంతో కదలగలను, ఈదగలను తెలుసా!
మా భారీ శరీరం మీద నల్లని మచ్చలు కూడా పెద్దగానే ఉంటాయి. వీటి ఆధారంగానే మమ్మల్ని గుర్తించవచ్చు. ప్స్... కానీ ప్రస్తుతం మా జనాభా చాలా తక్కువగా ఉంది. 1998 నుంచి "ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు నన్ను తీవ్రంగా అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. తిమింగలాలు, షార్క్‌లు నాకు ప్రధాన శత్రువులు. నేను వాటికి కనిపిస్తే చాలు... వెంబడించి మరీ చంపేస్తాయి. మీ మనుషులు కూడా నాకు శత్రువులు. గతంలో నన్ను విపరీతంగా వేటాడం వల్ల కూడా నేడు నాకీ దుస్థితి వచ్చింది. పర్యావరణ మార్పులు, కాలుష్యం... అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ!