భలే చిలుక…



హాయ్‌ నేస్తాలూ..! నేను చింటూని. ఇప్పటి నుంచి నేను మీ స్నేహితుడిని అన్నమాట. ఇలా అప్పుడప్పుడు కొత్త కొత్త విషయాలు చెప్పడానికి మన హాయ్‌బుజ్జీలో వస్తుంటాను. ఈరోజు మీకోసం ఓ విషయం మోసుకొచ్చాను. ఆలస్యం చేయకుండా చదివేయండి మరి!

మన మనుషులు అద్భుతాలు చేసి... రికార్డులు సాధించడం సాధారణమే.. కానీ జంతువులు, పక్షులు సాధించడం చాలా అరుదు కదా! ఇప్పుడు మనం అలాంటి ఓ షక్షి గురించే చెప్పుకోబోతున్నాం. రామచిలుకలు తెలుసు కదా! 'ఓ బోలెడు సార్లు చూశాం' అంటారా! హా...! ఓ రామచిలుకే.. రికార్డు సాధించింది. దాని పేరు 'ఆఫ్రికన్‌ గ్రే ప్యారెట్‌. దానికి ఇప్పుడు నాలుగేళ్లట. "చింటూ రామచిలుక అని చెప్పాడు. కానీ ఇదేంటి... బూడిద రంగులో కనిపిస్తుంది. తనకేం తెలిసినట్టు లేదు' అని నవ్వుకోకండి మిత్రమా..! ఇందాకే చెప్పాను కదా.. గ్రే ప్యారెట్‌ అని. దాని రంగు వల్లే... ఆ పేరుతో పిలుస్తారన్నమాట.

నేను తీసుకొచ్చానంటే. దానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది కదా మరి! ఈ చిలుక చాలా తెలివైనది తెలుసా! నాకంటే బాగా అన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటుంది. దానికి ఫ్లోరిడాకు చెందిన సెయింట్‌ పీటర్‌ అనే అన్నయ్య శిక్షణ ఇచ్చాడట. మీకో విషయం తెలుసా... మూడు నిమిషాల్లో ఎక్కువ వస్తువులు గుర్తుపట్టి “గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. పీటర్‌ అన్నయ్య ఆ చిలుకకు ఆహారం పెడుతూ, శిక్షణ ఇస్తూ ఎంచక్కా పెంచుకుంటున్నాడట. ఏ విషయం చెప్పినా చాలా తొందరగా నేర్చేసుకుంటుందట. భలేగా ఉంది కదా! 'నా దగ్గర కూడా ఇలాంటి పక్షి ఉంటే ఎంత బాగుండో!' అనుకుంటున్నారు కదా! సరే మరి.. ఇవి, ఈ చిట్టి చిలుక విశేషాలు. మళ్లీ వచ్చేటప్పుడు ఇంకా బోలెడు విషయాలు తీసుకొస్తాను. నేనూ స్కూల్‌కి వెళ్లాలి కదా... వెళ్తున్నాను.. బై నేస్తాలూ!

Responsive Footer with Logo and Social Media