పిట్టమాంసం తినే పాము!
నేనో జిత్తులమారి పామును. చాలా తెలివిగా, ఏమాత్రం శ్రమ లేకుండా తేలిగ్గా ఆహారాన్ని సంపాదించుకుంటాను. నా తోక చివరే నేను వాడే ఎర! ఇంతకీ మీకు నా పేరు చెప్పనే లేదు కదూ! నన్ను స్పైడర్ టైల్డ్ హార్మ్‌డ్ వైపర్ అని పిలుస్తారు. నేను విషపూరిత సర్పాన్ని. ఇరాన్, ఇరాక్ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాను. కేవలం 55 నుంచి 85 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను అంతే.
నాకు పక్షి మాంసం అంటే భలే ఇష్టం. కానీ అవేమో నాకు అందనంత ఎత్తులో గాల్లో ఎగురుతుంటాయి. మరి నేనేమో నేలమీద పాకుతుంటాను. వాటిని పట్టుకొని తినాలంటే నిజానికి చాలా కష్టం. కానీ నేను చాలా తెలివిగా నా తోకను వాడి వాటి పని పడతాను. ఎలా అంటే నా తోక చివర ఓ చిన్న బొడిపెలాంటి నిర్మాణం ఉంటుంది. అది చూడ్డానికి అచ్చం సాలీడులా కనిపిస్తుంది. బండ మీదో, కొండపైనో, ఇసుకలోనో హాయిగా సేదతీరుతూ.. నా తోకను ఆడిస్తూ ఉంటాను. అప్పుడు ఆ బొడిపెను చూసిన పక్షులు సాలీడు అని భ్రమపడతాయి. ఆకలితో ఉన్న అవి ఎంచక్కా బొజ్జ నింపుకొందామని వేగంగా నా దగ్గరకు వస్తాయి.
అప్పుడు నేను రెప్పపాటులో వాటిని పట్టుకుని అమాంతం గుటుక్కున మింగేస్తాను. కేవలం పిట్టల్నే కాదు ఎలుకలు, బల్లులు, తొండల్లాంటి జీవులను కూడా ఇలానే బురిడీ కొట్టించి, వాటిని హాంఫట్ చేసేస్తా. అన్నీ అనుకూలిస్తే నేను ఎంచక్కా 20 సంవత్సరాల వరకు హాయిగా బతికేస్తా, నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ప్చ్... నాకు తెగ ఆకలి వేస్తోంది. ఇక ఉంటామరి. బై.. బై...!