నేనూ నెమలినే తెలుసా!
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా! ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. నేను ఎవరనా?! నేను ఓ నెమలిని. మీరు నమ్మడం లేదు కదూ! అందుకే నా గురించి చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. నా విశేషాలు తెలుసుకుంటారా మరి.
నా పేరు సాటిర్ ట్రాగోపాన్. నాకు క్రిమ్బన్ హార్న్ నెమలి అనే పేరు కూడా ఉంది. నేను చూడ్డానికి కాస్త కోడిలా కనిపించినా నెమలి జాతికి చెందిన జీవినే. నేను టిబెట్, నేపాల్, భూటాన్, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో జీవిస్తుంటాను. దట్టమైన పొదలు నాకు ఆవాసాలు. మాలో మగవి, ఆడవి చూడ్డానికి వేరు వేరు పక్షిజాతుల్లా ఉంటాయి. మగ పక్షులు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటే.. ఆడవి మాత్రం నలుపు, గోధుమ వర్ణంలో ఉంటాయి.
ఏం తింటానంటే...
నాకు వెదురు మొలకలు అంటే చాలా ఇష్టం. వాటిని తెగ తింటాను. విత్తనాలు, దుంపలు, పండ్లను ఆహారంగా తీసుకుంటాను. అలా అని నన్ను పూర్తి శాకాహారి అనుకునేరు. నేను చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు, సాలీళ్షనూ కరకరలాడిం చేస్తాను. మేం పెద్దగా ఎగరలేం. చిన్న చిన్న దూరాలకు మాత్రం ఎగరగలం. మాకు తెగ సిగ్గు. ఏదైనా శబ్దం వస్తే చాలు... పొదల్లో దాగుండిపోతాం.
ఎత్తైన ప్రాంతాల్లో...
నేను చాలా ఎత్తైన ప్రాంతాల్లో జీవిస్తుంటాను. వేసవిలో సముద్రమట్టానికి 2400 నుంచి 4200 మీటర్ల ఎత్తున్న ప్రాంతాల్లో, శీతాకాలం 1800 మీటర్ల ఎత్తైన ప్రదేశాల్లో బతుకుతుంటాను. నా జీవితకాలం దాదాపు 20 సంవత్సరాలు. మాలో మగవి 11 సెంటీమీటర్లు, ఆడవేమో (61 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. నేను 110 సంవత్సరాలకు పూర్వం డార్జిలింగ్‌లో కూడా కనిపిస్తూ ఉండేదాన్ని. తర్వాత అంతర్జానమైపోయాను... తిరిగి ఈ మధ్యే మళ్లీ నా ఉనికిని చాటుకున్నాను. మిగతా ప్రాంతాల్లోనూ నా సంఖ్య చాలా తక్కువగా ఉంది. పర్యావరణ మార్పులు, కాలుష్యం, అడవుల నరికివేత వల్ల నేను ప్రమాదంలో ఉన్నాను. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి. బై... టై..!