అయ్య బాబోయ్... విచిత్ర బీచ్!
హాయ్ నేస్తాలూ...! బీచ్ అనగానే మనకు సముద్రం, ఇసుక గుర్తుకు వస్తాయి కదూ! కొన్ని చోట్ల కొండరాళ్లు కూడా ఉంటాయనుకోండి. కానీ ఓ బీచ్‌లో మాత్రం గుండ్రని బండ రాళ్లుంటాయి తెలుసా. మరి దాని విశేషాలేంటో చకచకా తెలుసుకుందామా!
న్యూజిలాండ్‌లోని మోరాకి, హాంప్‌డెన్ మధ్య... ఒటాగో తీరంలో ఉన్న ఈ విచిత్ర బీచ్ పేరు కోకోహె. ఇక్కడ ఇసుకతోపాటు గోళాకార రాళ్లు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో చాలా పెద్ద సంఖ్యలో, మరి కొన్ని ప్రదేశాల్లో విసిరేసినట్లుగా చెల్లాచెదురుగా ఏర్పడ్డాయి. 0.5 మీటర్ల నుంచి2.2 మీటర్ల వరకున్న రాళ్లూ ఉన్నాయి. ఇవి చాలా వరకు గోళాకారం, పాక్షిక గోళాకారంలో ఉన్నాయి. వీటిని కౌటు బౌల్డర్స్ అని పిలుస్తుంటారు. ఇవి చూడ్డానికి పెద్ద పెద్ద ఫిరంగి గుళ్లలా కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల పగిలిపోయిన రాళ్లు కూడా ఉంటాయి.
కాల క్రమేణా...
కోకోహె బీచ్‌లో ఇప్పుడున్న ఈ రాళ్లు ఏర్పడడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టిందని శాస్త్రవేత్తల అంచనా. బీచ్‌లోనే కాకుండా... ఇంకా సముద్రం లోపల ఇలాంటి గోళాకార రాళ్లు చాలా ఉన్నాయి. అసలు ఇలాంటి రాళ్లు ఎలా ఏర్పడ్డాయో.. ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ ఖనిజాల వల్ల ఏర్పడిన శిలలు, అలల తాకిడికి ఇలా గుండ్రని రాళ్లుగా మారాయని విశ్వసిస్తుంటారు. ఈ బీచ్‌లో అరచేతిలో పట్టేంత పరిమాణంలో ఉండే గోళాకార రాళ్లు కూడా దొరుకుతుంటాయి.
సందడే సందడి...
ఈ విచిత్రమైన రాళ్లను చూడ్డానికి కోకోహె బీచ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు.. కనుచూపుమేర పేరుకుపోయి ఉన్న ఈ గుండ్రని రాళ్లను చూసి... 'తామంతా ఈ భూమి మీద కాకుండా... మరో ప్రపంచంలో ఉన్నామా... ఏంటి?" అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటారు. తమ అనుభూతులు, అనుభవాలను ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇలా... నిత్యం ఈ ప్రాంతమంతా సందర్శకులతో సందడి సందడిగా ఉంటుంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ ఈ విచిత్ర బీచ్ విశేషాలు! మీకు నచ్చాయి కదూ!