బుస్‌.. బుస్‌... తుస్‌... తుస్‌…



ప్రమాదం ఎదురైతే ముందు నాగరాజులా పడగ విప్పినట్లు నటిస్తుంది. పెద్దగా బుస కొడుతుంది. శత్రువు బెదిరితే సరి.. లేకపోతే వెంటనే చచ్చినట్లు పడిపోతుంది. ముందు బుస్సు బుస్సుమని బుస కొట్టినా... తర్వాత తుస్సుమని కళ్లు తేలేస్తుంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది... ఇదొక పాము గురించి అని. మరి ఆ సర్పం విశేషాలేంటో తెలుసుకుందామా. అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.

ఈ వింత పాము పేరు హాగ్నోస్‌. దీనిలో మళ్లీ అయిదు రకాలున్నాయి. ఇవి ఉత్తర, దక్షిణ అమెరికాల్లో జీవిస్తుంటాయి. ఆహారంగా ఎలుకలు, బల్లులను తీసుకుంటాయి. ఇంకా కీటకాలు, గుడ్లను కూడా హాంఫట్‌ చేస్తాయి. ఇతర పాములతో పోల్చుకుంటే వీటి కనుగుడ్లు పెద్దగా ఉంటాయి. తోక మాత్రం చిన్నగా ఉంటుంది. బూడిద, పసుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. చిన్న పాము పిల్లలు పెద్దవాటికన్నా రంగులమయంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి.

అరుదుగా కాటు!

ఈ హాగ్నోస్‌ పాములు భయానికి గురైనప్పుడు, శత్రువు ఎదురైనప్పుడు పెద్దగా బుస కొడతాయి. 'తమ తల భాగాన్ని చదునుగా చేస్తాయి. నాగుపామును అనుకరించే ప్రయత్నం చేస్తాయి. చాలా అరుదుగా కాటేస్తాయి. ఇవి విషపూరితం కాదు. కానీ వీటి లాలాజలంలో మాత్రం కాస్త విషం ఉంటుంది. ఇది మనుషులకు పెద్దగా హాని చేయదు. చిన్న చిన్న ప్రాణులకు మాత్రం ప్రమాదకరం.

ఆస్కార్‌ స్థాయిలో...

ఈ పాము నటన ఆస్కార్‌ స్థాయిలో ఉంటుంది. ముందు నాగుపాములా బుస కొడుతుంది. తన పప్పులు ఉడకనప్పుడు వెంటనే చచ్చినట్లు పడిపోతుంది. ఈ క్రమంలో తన నాలుకను కూడా బయటకు పెడుతుంది. దుర్వాసన కలిగించే ద్రవాన్ని సైతం నోటి నుంచి విడుదల చేస్తుంది. శత్రువుల నుంచి రక్షణ కోసమే ఇదంతా! ముందు బుస కొట్టి బెదిరించాలని చూసినా... తర్వాత తుస్ఫుమని చచ్చినట్లు పడిపోతుందన్నమాట. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ హాగ్నోస్‌ పాము విశేషాలు. భలే ఉన్నాయి కదూ!

Responsive Footer with Logo and Social Media