మొసలి కాని మొసలి
చూడ్డానికి కాస్త మొసలిలా కనిపిస్తున్న దీని పేరు క్రోకోడైల్ న్యూట్. హిమాలయన్ న్యూట్, క్రోకోడైల్ సాలమండర్, హిమాలయన్ సాలమండర్, రెడ్‌నాబీ న్యూట్ అని కూడా పిలుస్తుంటారు. ఇదో చిన్న సరీసృపం. దాదాపు 20 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఈ జీవి నాలుక చాలా చిన్నగా ఉంటుంది. చిరు దంతాలు ఉంటాయి. దీని శరీరంకన్నా తల బలంగా, పెద్దగా కనిపిస్తుంది. దీని కాళ్లకు అయిదు వేళ్లుంటాయి. అన్నట్లు ఇది తన తోక సాయంతో చక్కగా ఈదగలదు కూడా.
దీని వీపు మీద అచ్చం మొసలికి ఉన్నట్లే బొడిపెలు కనిపిస్తుంటాయి. అందుకే దీనికి క్రోకోడైల్ న్యూట్ అని పేరు వచ్చింది. దీని జీవితకాలం దాదాపు పది సంవత్సరాలు. ఈ జీవులు మన దేశంలోని సిక్కిం, మణిపూర్‌లో కనిపిస్తుంటాయి. ఇంకా మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, చైనా, నేపాల్‌లో జీవిస్తుంటాయి. మళ్లీ ఇందులో చాలా రకాలున్నాయి. ఈ మద్యే కొత్తగా వియత్నాంలో నలుపు, కాషాయ రంగుల్లో ఉండే కొత్త దాన్ని కనుగొన్నారు. దానికి కో బ్యాంగ్ క్రోకోడైల్ న్యూట్ అని పేరూ పెట్టారు. ఇంతకీ ఈ క్రోకోడైల్ న్యూట్ ఏం తింటుందో తెలుసా? చిన్న చిన్న సాలెపురుగులు, ఇతర కీటకాలు, తేళ్లను కరకరలాడించి తన బుజ్జి బొజ్జను నింపుకొంటుంది. నేస్తాలూ! మొత్తానికి ఇవీ ఈ వింత ప్రాణి విశేషాలు.