భలే భలే రంగు పక్షిని…
హాయ్ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా! ఏంటి దీని రంగు భలేగా ఉందే... అనుకుంటున్నారు. కదూ! రంగే కాదు.. నా తోక కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ విశేషాలన్నీ మీతో పంచుకుందామనే ఇలా వచ్చాను. అలస్యం చేయకుండా వెంటనే ఈ కథనం చదివేయండి మరి!
నా పేరు రెస్పెలెండెంట్ క్వెట్టల్. పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదా. అయితే... మీకు నచ్చినట్లుగా పిలవండి పలుకుతాను. నేను అమెరికాకు చెందిన పక్షిని. ఇంకా మెక్సికోలో కూడా కనిపిస్తాను. నా శరీర పైభాగం ఆకుపచ్చ, కింది భాగం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. 'రెక్కలేమో.. నలుపు రంగులో ఉంటాయి. నా తోక కూడా చాలా పెద్దగా ఉంటుంది. మాలో మగ పక్షుల ముక్కు నలుపు, ఆడ పక్షుల ముక్కు పసుపు రంగులో ఉంటుంది. దాని వల్ల మమ్మల్ని ఇట్టే గుర్తు పట్టేయొచ్చు. నా చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. నాకు ఎలాంటి గాయాలు అవ్వకుండా... నా ఒంటి మీద ఉన్న ఈకలే కాపాడతాయి.
అలా ఉండటమే ఇష్టం...!
నేను ఎక్కువగా పండ్లు తినడానికే ఇష్టపడతాను. అందులోనూ... అవకాడో పండ్లంటే మహా ఇష్టం. అవి దొరకనప్పుడు... చిన్నచిన్న కప్పలు, బల్లులను ఆహారంగా తీసుకుంటాను. నాకు ఒంటరిగా ఉండటమే చాలా ఇష్టం. ఒక్కదాన్నే ఎంచక్కా అడవంతా తిరిగేస్తాను. అత్యవసరమైన సమయాల్లో మాత్రమే గుంపులో చేరతాను. మీకో విషయం తెలుసా..? నేను పాటలు కూడా పాడతాను. కానీ అవి మీకు అర్ధం కావనుకోండి. నాకు ఒక చోట ఉండటం కంటే... ఎగరడం అంటేనే చాలా ఇష్టం. నా బరువు 180 నుంచి 210 గ్రాముల వరకు ఉంటుంది. పొడవు 88 నుంచి 40 సెంటీ మీటర్లు. ప్రస్తుతం మా సంఖ్య వేలల్లోనే ఉంది. సాధారణంగా అయితే మూడేళ్లు... కాస్త రక్షణ కల్పిస్తే పది సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ!