అద్భుత కళాకాండం!
హాయ్ ఫ్రెండ్స్! నేను బాగున్నానా...! భలేగా మెరిసిపోతున్నా కదూ! మామూలుగా అయితే చెట్టుకు పత్రాలో, ఫలాలో అందాన్ని అందిస్తాయి కదా! కానీ నాకు మాత్రం నా కాండం, బెరడే అందం. ఇంతకీ నా పేరేంటి? నేనెక్కడ ఉంటానో తెలుసా?
నేస్తాలూ.. నాకు బోలెడు పేర్లున్నాయి. నన్ను ప్రూనస్ సెర్రులా, బిర్చ్ బార్క్ చెర్రీ, పేపర్ బార్క్ చెర్రీ, టిబెటియన్ చెర్రీ అని పిలుస్తుంటారు. నేను చైనా, టిబెట్‌కు చెందిన చెట్టును. కానీ ప్రస్తుతం చాలా దేశాల్లోనూ పెరుగుతున్నాను. రాగి, ఎరుపు రంగు బెరడే నాకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. అవే నాకు ఇంతటి ప్రాముఖ్యాన్ని తెచ్చాయి. నా పత్రాలేమో ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
నాటిన తర్వాత...
నేను దాదాపు 20 నుంచి 80 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాను. గరిష్టంగా 8 నుంచి 9 మీటర్ల వరకు విస్తరిస్తాను. ఎలాంటి వాతావరణంలోనైనా పెరగగలను. కానీ నాకు ఎండ తగినంత ఉండాలి. నీరు నిలవని నేల రకాలై ఉండాలి. ఒక్కసారి నన్ను నాటిన తర్వాత, ఇక నా గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. నా పాటికి నేను పెరుగుతుంటా.. కానీ అప్పుడప్పుడు కొన్ని రకాల కీటకాలు నాకు నష్టం చేస్తుంటాయి.
కళ్లు తిప్పుకోలేరు!!
నాకుండే కాండం, బెరళ్లు నున్నగా మెరుస్తాయి. ఎర్రటి సిల్కు వస్త్రాన్ని చుట్టినట్లుగా ఉంటుంది. పగటిపూట సూర్యకాంతిలో నేను మరింతగా మెరిసిపోతుంటా. కొత్తగా నన్ను చూసిన వాళ్లు అస్సలు కళ్లు తిప్పుకోలేరు. ఆకు రాలే కాలంలో అయితే నేను బోసి కొమ్మలతో మరింత అందంగా కనిపిస్తుంటా. నేను చూడ్డానికి చక్కగా ఉంటానని చాలా దేశాల్లో నన్ను పార్కులు, ఖాళీ స్థలాల్లో పెంచుతుంటారు. అలాగే నాకు కాసే చిన్ని చిన్ని పండ్లను కూడా ఎంచక్కా తినేయొచ్చు. అవి భలే రుచిగా కూడా ఉంటాయి. నన్ను 1908లో ఇంగ్లాండ్‌లో నాటారు. అప్పట్లో నా అందాన్ని చూసిన వారు ముగ్ధులయ్యారు. నాకు తెలిసి... ఈ ప్రపంచంలో నా అంత అందమైన కాండం ఇంకే చెట్టుకూ ఉండదు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై... బై...!!