భలే పండు... పోషకాలు మెండు!



చూడ్డానికి కాస్త పసుపు రంగులో ఉండి, టొమాటోలా కనిపిస్తున్న ఈ పండు భలే ఉంది కదూ! కేవలం రూపులోనే కాదు... తీరులోనూ ఇది ప్రత్యేకతమే. దీని నిండా పోషకాలే ఉంటాయి. ఇంతకీ ఈ ఫలం పేరేంటి... దీని విశేషాలేంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్‌! అయితే... చకచకా ఈ కథనం చదివేయండి సరేనా!

ఈ పండు పేరు పెర్సిమాన్‌. ఇందులో చాలా రకాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చైనీయులు వీటిని పండిస్తున్నారు. పెర్సిమాన్‌ చెట్లు 4.5 నుంచి 18 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంటాయి. పత్రాలేమో ముందు ఆకుపచ్చగా ఉంటాయి. తర్వాత పసుపు, ఆరెంజ్‌, ఎరుపు రంగులోకి మారతాయి. ఆ తర్వాత రాలిపోతాయి. అప్పుడు చెట్టంతా బోసిపోయి కేవలం పండ్లతో కనువిందు చేస్తుంది. ఏడో శతాబ్దంలో జపాన్‌లో, 1వ శతాబ్దంలో దక్షిణ కొరియాలో వీటి సాగు ప్రారంభమైంది. వీటిని చైనాలో షి, జపాన్‌లో కకి, కొరియాలో గమ్‌, కొరియన్‌ మ్యాంగో అని, మన పొరుగు దేశమైన నేపాల్‌లో హల్వాబేద్‌ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, అజర్‌బైజాన్‌, ఇండియా, ఇజ్రాయిల్‌, స్పెయిన్‌, తైవాన్‌లోనూ వీటిని సాగు చేస్తున్నారు.

పత్రాలతోనూ...

'పెర్సిమాన్‌ ఫలాన్ని తొక్కతోనూ తినొచ్చు. తొక్క తీసివేసే తినొచ్చు. పచ్చి కాయలు కాస్త పుల్లగా, వగరుగా ఉంటాయి. పక్వానికి వచ్చాక మాత్రం తినడానికి కాస్త ఆపిల్‌లానే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టు పత్రాలతో హెర్బల్‌ టీలు కూడా తయారు చేసుకుంటారు. విత్తనాలనేమో వేయించుకొని తింటారు. దక్షిణ కొరియాలో ఎండు పెర్సిమాన్‌ను సంప్రదాయక వంటకాల్లోనూ వినియోగిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎండు ఫలాలనూ తేనీటి తయారీలో వాడతారు. కుకీలు, కేక్‌లు, బ్రెడ్‌లు, సలాడ్స్‌ తయారీలోనూ ఉపయోగిస్తారు.

ఖనిజాలే... ఖనిజాలు...!

ఈ పండ్లలో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్‌లో కంటే కూడా వీటిలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ -సి కూడా పెద్ద మొత్తంలోనే లభిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ - బి, ఎ, ఐరన్‌, బెటా కెరోటీన్లూ ఈ ఫలాల్లో లభ్యమవుతాయి. ధర కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో కాశ్మీర్‌ లోయలో ఈ పండ్ల తోటలను బౌత్సాహికులు సాగు చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే. పెర్ఫిమాన్‌లో దాదాపు రెండువేల రకాలున్నాయి. కానీ వాణిజ్యపరంగా ప్రస్తుతం కేవలం రెండు రకాలనే పండిస్తున్నారు. 'మామిడిలానే ఇవి కూడా సీజనల్‌ పండ్లు. ఏటా సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య ఇవి ఫలసాయాన్ని ఇస్తాయి. కానీ మొక్కను నాటిన ఏడు సంవత్సరాల తర్వాతే కాపు ప్రారంభమవుతుంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ ఈ వింత పండు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!

Responsive Footer with Logo and Social Media