రంగు.. రంగుల రెక్కలు... మూతపడవు కనురెప్పలు!



హాయ్‌ నేస్తాలూ...! రంగురంగుల రెక్కలున్న సీతాకోకచిలుకలను చూస్తుంటే మనకు భలేగా అనిపిస్తుంది కదూ...! కనురెప్పలు కూడా మూత పడవు కదా! వాటి వెంటే పరిగెత్తి పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటాం. అవి మాత్రం ఆసలు మన చేతికి చిక్కనే చిక్కవు. పట్టుకునేలోపే ఎగిరిపోతాయి. అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం వాటి గురించే చెప్పుకోబోతున్నాం కాబట్టి...

దుబాయ్‌లో సీతాకోకచిలుకల కోసం ఓ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. దాని పేరు 'బటర్‌ పై గార్డెన్‌. ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల సీతాకోకచిలుకలు చూసుంటారు? అని ఎవరైనా అడిగితే... మహా అయితే పది రకాలు చూసుంటాం అని చెబుతాం. కానీ దుబాయ్‌లో ఏర్పాటు చేసిన బటర్‌పై గార్డెన్‌లో 15వేల రకాల సీతాకోకచిలుకల్ని ఒకేసారి చూడొచ్చట. మరో విషయం ఏంటంటే. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒక్కో సీతాకోకచిలుక ఒక్కోలా ఉంటుందట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా. ఇది నిజమే నేస్తాలూ..

తగిన వాతావరణం...

సీతాకోకచిలుకలు పచ్చదనం ఎక్కువగా ఉన్నచోట ఉండటానికి ఇష్టపడతాయి కాబట్టి... వాటి కోసం ప్రత్యేకమైన మొక్కలను కూడా ఈ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఇదే అన్నింటి కంటే అతిపెద్ద 'బటర్‌ ఫ్లై గార్డెన్‌. మొత్తం 45 జాతులకు చెందిన సీతాకోకలు ఇక్కడ ఉన్నాయి. నిర్వాహకులు వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారట. అవి బతకడానికి అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్‌ 654 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. గార్డెన్‌లో ఎక్కడ చూసినా అసలైన సీతకోకచిలుకలతో పాటుగా బొమ్మ సీతాకోకలు కూడా కనిపిస్తాయి. పిల్లలయితే ఈ గార్డెన్‌కి వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారట. ఈ చోటుకి వెళ్లాలంటే. ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందట. వారాంతాల్లో ఇక్కడికి సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. పిల్లలు ఎంచక్కా ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఉంటాయిక్కడ... ఈ 'బటర్‌ ఫ్లై గార్డెన్‌ విశేషాలు భలే ఉన్నాయి కదా పిల్లలూ...!

Responsive Footer with Logo and Social Media