కమల విమల
కమల విమల
కమలకు వయస్సు వదేళ్ళు. చిన్నతనంలో మసూచికం వచ్చి ముఖమంతా మచ్చలు
పడ్డాయి.
ఒకనాటి మధ్యాహ్నం వాళ్ల బళ్లో చాలామంది పిల్లలు కలిసి ఆటలాడుతున్నారు.
మధ్యలో విమల అనే ఒక నల్లటి అమ్మాయి, పదేళ్లది, కమలను డీకొని అనుకోకుండా కిందకు
పడతోసి, తను కూడా పడిపోయింది. దానితో ఆటకు అడ్డు కలిగింది. పిల్లలంతా ఎవరికి
తోచింది వాళ్ళు అన్నారు. కమల అడ్డంగా నిలబడిందనీ, విమల కావాలనే పడేసిందనీ
ఏమేమో చెప్పుకున్నారు. దాంతో కమలకూ విమలకూ పట్టలేని కోపం వచ్చి, ఒకరినొకరు
తిట్టుకున్నారు. “ఆ నల్లటి కాకిదే తప్పు” అంది కమల విమలను. “ఆ తిరగలి గంట్లదే నన్ను
తోసింది!” అంది విమల.
ఇంతలో బడి గంట ఐంది. అంతా తరగతులలోకి వెళ్లారు. ఆ రోజల్లా కమలా
విమలా ఏడుస్తూనే గడివి, సాయంకాలం ఇండ్లకు వెళ్లారు.
కమల ముఖం చూసి వాళ్ల అమ్మానాన్నా “ఏడిచావెందుకమ్మా” అని అడిగారు.
ఒక అమ్మాయి నన్ను తిరగలి గండ్లు , అని పిలిచింది” అనిచెప్పి పెద్ద పట్టున వెక్కి
వెక్కి ఏడ్చింది. కమల తల్లీ తండ్రీ తమ పిల్ల ముఖం పైనున్న మచ్చలు ఆమెకు కష్టం
కలిగించాయని విచారించారు.
కాస్త ఏడుపు తగ్గిందాకా బుజ్జగించి, నువ్వు కూడా ఆ అమ్మాయిని ఏమైనా అన్నావా
కమలా? అని అడిగారు వాళ్ళ నాన్నగారు.
“ఆ అని తల ఊపింది కమల.
“ఏమన్నావే” అని అడిగింది తల్లి.
నల్లగా ఉంటుందా అమ్మాయి, అందుకని 'నల్లకాకీ' అన్నాను అని నిజం చెప్పేసింది.
అప్పుడు వాళ్ళ అమ్మానాన్నా అన్నారు : “చూడు తల్లీ, అందం లేకపోతే మనం
తోటివారిని వెక్కిరించవచ్చా? అందం పుట్టుకతో వచ్చేది, మన గొప్ప వలన రాదు.”
“నన్ను ముందు అట్లా ఎందుకన్నదీ, ఆ అమ్మాయి?” అడిగింది కమల.
“ఆ అమ్మాయి పొరపాటున అన్నదేమో, “అట్లా అనరాదు విమలా?” అని నువ్వు
చెప్పితే బాగుండేది జన్మతో వచ్చిన అందం కోసం ఒకరినొకరు వెక్కిరించుకోవడం తప్పుకాదూ?”
అని అడిగారు కమల నాన్నగారు.
కమల మాట్లాడకుండా విన్నది.
“విమల అమ్మానాన్నా ఎవరే?” అని కమల తల్లి అడిగింది.
“ఆ పిల్లకు తల్లీ తండ్రీ చచ్చిపోయారట” అన్నది కమల, వెంటనే తల్లి “అయ్యోపాపం!
అటువంటి పిల్లను ఏమీ అనరాదు తల్లీ! మళ్లీ స్నేహం కలుపుకుని ఆ అమ్మాయిని రేపు
మనింటికి తీసుకురా” అంది.
అప్పుడు కమల కళ్ల వెంట నీళ్లు కారినై. ఈసారి కోపంవల్ల కాదు. “విమలను నల్లకాకీ
అని అనకుండా ఉంటే బాగుండేది” అనిపించింది కమలకు.
కమల తల్లీ తండ్రీ, ఇంకేమీ అనలేదు. కమల కూడా ఏమీ మాట్లాడలేదు. రాత్రి
నిద్రకూడా రాలేదామెకు.
మర్నాడు మామూలు వేళకంటె, చాలా ముందుగా బడికి వెళ్లింది కమల. వెళ్లినవెంటనే
విమల కూర్చునే చోటు వేపు చూసింది. ఇంకా విమల రాలేదు. అలాగే కొంతసేపు చూచింది
బడివేళకు కాస్త ముందుగా విమల కూడా వచ్చింది. ఆమె ముఖం విచారంగా, పలుకరిస్తే
ఏడ్చేటట్టుంది. వెంటనే కమల వెళ్లి - “విమలా, నన్ను క్షమించు, నిన్ను అనవసరంగా
'నల్లకాకీ” అని మనస్సు కష్టపెట్టాను. ఇంకెప్పుడూ అనను” అన్నది.
విమలకు ఏడ్చువచ్చింది. ఏడ్పులోనే ఇలా అన్నది. “నిన్ను నేను కూడా 'తిరగలి
గంట్లూ' అన్నానుగా! మా అన్నయ్యా, వదినా “అంతే కావాలి నీకు. ఒకళ్ల జోలికి వెళ్లకూడదని
తెలియదా!” అన్నారు.
ఆట గంట కొట్టగానే, కమలా, విమలా కలిసి బడి తోటలోకి పోయి కూర్చుని, చాలా
స్నేహంగా మాట్లాడుకున్నారు. విరోధమంతా మర్చిపోయారు.
ఆ సాయంత్రం విమలను తన ఇంటికి తీసుకు వెళ్లింది కమల. వాళ్ల అమ్మా నాన్నా |
విమలను వాళ్లమ్మాయి లాగానే చూశారు. విమల కూడా వాళ్లను “అమ్మా, నాన్నా!” అనడం
మొదలు పెట్టింది.
అది మొదలు కమలా విమలా బడిలో పిల్లలనెవర్నీ వెక్కిరించడం మానేశారు.
అందం లేని పిల్లలనెవరినీ, తిట్టడం వెక్కిరింఛడం మానేశారు. అందం లేని పిల్లలనూ
అమ్మా నాన్నా లేని పిల్లలను, ఎక్కువ (ప్రేమతో చూసి స్నేహం కలుపుకునే వాళ్లు.
