రహస్యం



ఆ వేళ అమ్మకు పుట్టిన రోజు. రాజూ, రవీ, పద్మా చాలా హడావిడిగా ఉన్నారు.

రాజు అమ్మ పుట్టిన రోజుకోసం, ఏమి బహుమానం ఇవ్వాలా అని ఆర్నెల్ల నుండీ ఆలోచిస్తున్నాడు. అమ్మ రోజూ భారత రామాయణాలు చదివి తమకు కథలు చెప్తూ ఉంటుంది.

ఎప్పుడో మేనమామ తనకిచ్చిన పది రూపాయల తోటి ఒక భగవద్గీత కాపీ కొన్నాడు రాజు, దానికి అందమైన అట్టవేసి ఒక రంగు కాగితంలో ఒక రిబ్బనుతో కట్టాడు. దాని మీద “ప్రియమైన అమ్మకు” అని రాశాడు.

అమ్మ పుట్టిన రోజుని అమ్మమ్మ బాగా జరుపుతుంది. అందుకని పిల్లలంతా దాన్ని ఒక పెద్ద పండుగ చేసినట్టు చేస్తారు.

నిన్న పక్కింటి లీల “అంత పెద్ద వాళ్లకు పుట్టిన రోజు పండుగ చేస్తారా?” అని నవ్వితే “తల్లీ, తండ్రీ దైవ సమానులే, వాళ్ల పుట్టిన రోజులు తప్పకుండా చెయ్యాలి” అని పద్మ చెప్పింది.

పద్మ తన దగ్గర బోలెడు డబ్బు ఉందని మహాగర్వ పడుతోంది. ఆ మధ్య మామయ్య పట్టుపరికిణీ కుట్టించుకోమని పాతిక రూపాయలిచ్చాడు. తన పుట్టిన రోజునాడు అమ్మ ఎలాగా తనకు పట్టు పరికిణీ కుట్టించింది. అందుకని ఆ పాతిక రూపాయలు దాచుకుంది. అమ్మకు ప్రయాణం చేసేటప్పుడు ఉపయోగంగా ఉంటుందని ఒక పెద్ద తోలు సంచీ కొన్నది. దానిని అందంగా రంగు కాగితాలతోటి జరీ రిబ్బన్లతోటి కట్టి “ప్రియమైన నా తల్లికి” అని రాసిన చీటీ దానికంటించింది.

రాజూ, పద్మా తమతమ బహుమానాలను అమ్మకు స్నానం చేసిరాగానే ఇచ్చెయ్యాలని సిద్ధం చేసుకున్నారు.

రవి వాళ్ళను చూస్తూ, అటూ ఇటూ తిరుగుతూంటే “రవీ నువ్వు అమ్మకేమీ ఇవ్వవా?” అని అడిగింది.

“ఇస్తాను” అన్నాడు.

“ఏదీ?” అంది పద్మ.

“బయట ఉన్నది” అన్నాడు.

“అయ్యో, బయట ఎందుకుంచావు? చినుకులు పడుతున్నాయిరా” అని ఆదుర్దాగా అంది పద్మ.

ఒక చిరునవ్వు నవ్వాడు రవి. అంతేగాని బయటికి వెళ్లి దాన్ని తీసుకురాలేదు.

ఈ లోగా అమ్మ స్నానం చేసి, నాన్నగారు కొనుక్కొచ్చిన కొత్త చీర కట్టుకుంది. అమ్మమ్మ పూజచేసి హారతిచ్చింది.

నాన్నగారూ భోజనాల బల్ల దగ్గిర కూర్చుని పిల్లల్ని పిలిచారు. రాజు ముందు తన కానుకను అమ్మకిచ్చాడు. అమ్మ సంతోషించింది. తరువాత పద్మ తన కానుకనిచ్చింది. చాలా బాగుందంది అమ్మ.

అందరూ రవి వైపు తిరిగారు. నాన్నగారూ, “రవీ, నీ కానుక ఏదిరా?” అని అడిగారు.

“బయట ఉన్నది” అన్నాడు రవి.

“అయ్యో వాన వస్తోంది తడిసిపోతుంది త్వరగా తీసుకురా” అన్నది అమ్మ.

“నువ్వేరా అది నీ దగ్గిరకు రాదు” అన్నాడు రవి చిలిపిగా నవ్వుతూ.

అందరూ బయటికి వెళ్ళారు. రెండు గజాల మేర ఒక గుడ్డ కప్పి ఉన్న చోటకి రవి వాళ్లను తీసుకు వెళ్లాడు.

“అమ్మా, ఒక్కసారి కళ్లు మూసుకో” అన్నాడు తల్లి కళ్లు మూసుకుంది.

కళ్లు తెరిచిన తల్లి ఆశ్చర్యానికి అంతులేదు. అక్కడ ఆకుపచ్చరంగులో “భగవంతుడా, మా అమ్మకు ఆయురారోగ్యాలిచ్చి మాకు మరి నూరు పుట్టిన రోజులు చేసే భాగ్యాన్నియ్యి!” అని “శ్రమతో రవి” అనీ ఉంది. అదంతా కొత్తిమిరి అక్షరాలతో ఉంది.

అంత అందంగా కొత్తిమిరితో అన్ని అక్షరాలను ఎలా పెంచాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మకు కొత్తిమిరి అంటే ప్రాణం.

“రవీ, ఒక్క అక్షరమైనా చెదరకుండా ఎంత చక్కగా పెంచావురా? మా కెవ్వరికీ తెలియకుండా అన్నాళ్లూ ఎలా ఉంచావురా?” అని (ప్రేమతో తల్లి అడుగుతూంటే, రవి సిగ్గుపడి సంతోష పడిపోయాడు.

తరువాత తోట కత్తెరతో జాగ్రత్తగా కొత్తిమిరి కోసి, ఆ పూట పచ్చడి చెయ్యమని అమ్మమ్మకిచ్చాడు.

Responsive Footer with Logo and Social Media