అటకమీది దయ్యం



అమ్మ అత్తా వాళ్లింటికెళ్లింది. రాధకేమి తోచడం లేదు. అత్తా వాళ్లింట్లో పిల్లల్లేరు. అందుకని రాధ అమ్మతో పోలేదు. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా రమవచ్చింది. రమ రాధా స్నేహితురాళ్లు. ఇద్దరి వయస్సూ ఎనిమిదేళ్లు.

రాధా, రమ ఏమి ఆడుకుందామా అని ఆలోచిస్తూ ఉండగానే వాన ప్రారంభమైంది. కాసేపట్లో అది పెద్దవానైంది. ఇక ఈ పిల్లలు బయట తోటలో ఆడుకునే అవకాశం లేకపోయింది.

“రమా, ఒకసారి నువ్వు మా అటక ఎక్కుదామన్నావు కదూ?” అంది రాధ.

“మీ అమ్మ కోప్పడుతుందన్నావు కదూ?” అంది రమ.

“ఇప్పుడు మా అమ్మ ఇంట్లో లేదులే. ఎక్కి చూద్దామా? నేను కూడా చూడలేదెప్పుడూ” అంది రాధ.

“అంత పైకి ఎక్కాలంటే చిన్న స్టూలుగానీ కుర్చీగాని చాలదే రాధా. ఒక నిచ్చెన ఉండాలి” అంది రమ.

“ఓ, దానికేం సామాను గదిలో ఒక చిన్న నిచ్చెన ఉంది. దాన్ని నేనే మొయ్యగలను. వంటవాడు నిద్రపోతున్నాడు. వాడు లేచేలోగా మనం అటక ఎక్కి దిగి మళ్లీ నిచ్చెనని ఆ గదిలో పడేద్దాం” అని రాధ నిచ్చెన తెచ్చింది.

రమ నిచ్చెన ఎక్కి సగం దూరం పోయి “ఒసేయ్‌ రాధా కింద గట్టిగా పట్టుకోవే, నాకు భయమేస్తోంది.” అంది.

” *ఫరవాలేదులే ఎక్కవే నేను కూడా ఎక్కి వస్తాను నీ వెనకే” అని రాధ అంటే రమ పైదాకా ఎక్కేసి “నువ్వు కూడా రావే. ఇక్కడ వెల్తురు సరీగ్గాలేదు” అంది.

రాధ కూడా పైకెక్కింది. “బాబోయ్‌, ఇక్కడ అంతా బూజూ సాలె పురుగులూ సాలెగూళ్లూ నేవ్‌. అంతా దుమ్ము దుమ్ముగా ఉంది” అంటూ గౌను మూతికడ్డం పెట్టుకుంది.

అక్కడ ఒక పాత ట్రంకు పెట్టెమీద ఇద్దరూ కూర్చున్నారు. ఉన్నట్టుండి రమ రాధను వాటేసుకుని నోట మాట లేకుండా వేలుతో ఒకమూలకు చూపింది. రాధ కూడా రమను గట్టిగా కౌగిలించుకుని భయంతో ఆయాసపడుతూ దయ్యం! అని నీరసంగా నూతిలో నుండి మాట్లాడుతున్నట్టంది.

అక్కడ రమ చూపించిన చోట నల్లని గుడ్లు మెరుస్తున్నై. అవి మెల్లిగా దగ్గిరకొచ్చిన్నై. ఈ లోగా ఆ పిల్లలిద్దరూ ముచ్చెమటలుపోసి ఒణికిపోతున్నారు. భయంతో కళ్ళు మూసుకున్న వాళ్ళిద్దరూ “మ్యావ్‌” అనే అరుపుతో ధైర్యం పుంజుకుని కళ్ళు తెరిచారు. వాళ్ళ ఎదురుగుండా ఒక నల్లపిల్లి ఉంది. అది వచ్చిన మూల నుండి ఇంకా చిన్న చిన్న అరుపులు వినిపించినై. అవి పిల్లికూనలవని వాళ్ళు తేలికగా గ్రహించారు. ఆ నల్లపిల్లి తన కూనల్ని వీళ్ళు పట్టుకెళ్తారని కాబోలు భయపడి వీళ్లమీదికి “గుర్‌, ఘుర్‌...” మంటూ వచ్చింది.

“రావే రమ, మనం దిగి వెళ్లిపోదాం. ఆ పిల్లి మననేం చెయ్యదుగానీ భయపడకు” అని ధైర్యం చెప్పి నిచ్చెన కోసం చూస్తే అది అక్కడ లేదు.

రాధ గాభరాగా, “రమా నిచ్చెన ఏమైందే?” అని అంటూ ఉండగా, కిందినుంచీ “నిచ్చెన దయ్యమెత్తుకెళ్ళిందే” అని కీచు గొంతుకతో ఎవరో అన్నారు. అటుచూస్తే రాధ అన్న పన్నెండేళ్ళ రఏ. వాడు అల్లరివాడు. రాధా, రమ పైకి ఎక్కినప్పుడు స్న్నేహితుడింటి నుండి ఇంటికొచ్చాడు. వీళ్ళని కనిపెట్టి చూస్తున్నాడు. రాధ భయంతో పిల్లిని చూసి “దయ్యం” అని అనడం విన్నాడు. వీళ్లని మరికాస్త ఏడిపించాలని నిచ్చెన అటక దగ్గిర నుండి తీసేసి ఒక మూలకు పెట్టాడు. కాసేపు ఏడిపించి నిచ్చెన అందించి రాధా, రమ దిగడానికి సహాయపడ్డాడు.

అప్పుడే వచ్చిన రాధ తల్లి రవిని కోప్పడింది. వాళ్ళని అనవసరంగా ఏడ్చించవద్దని. "అమ్మా నువ్వు ఒద్దంటావని నువ్వు లేకుండా చూసి ధైర్యంగా నిచ్చెనవేసి అటక ఎక్కి పిల్లిని చూసి భయపడ్డారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిచ్చెన తీసేశాను. నన్ను కోప్పడతావెందుకమ్మా!” అన్నాడు రవి.

“బుద్ధి చెప్పడానికీ కోప్పడడానికీ నేనున్నాను గదుట్రా? అసలే భయపడ్డవాళ్ళని నువ్వు ఇంకా భయపెట్టరాదు” అని రవిని కేకలేసి “రాధా నువ్వు ఎక్కింది కాక రమను కూడా ఎక్కించావు కదా. భయంతో కిందపడితే కాళ్లో చేతులో విరిగిపోవూ? అదీకాక పాతసామానున్న ఆ అటక ఏ పురుగూ పుట్రా అన్నా ఉండి కరిస్తే ఏమయ్యేది? రమ వాళ్ళ అమ్మగారు నువ్వు అల్లరి పిల్లవని అనరూ?” అని సన్నగా రాధను చీవాట్లు పెట్టారు వాళ్ళమ్మ.

“అవునమ్మా నాకు తెలియక ఎక్కాను. ఇంకెప్పుడూ నీకు చెప్పకుండా చెయ్యనమ్మా” అంది రాధ తప్పు తెలుసుకున్నట్టు.

“పిన్చిగారూ అసలు ఆ అటక ఎక్కుదామని నేనే చాలాసార్లు రాధతోటన్నానండీ నానించే ఈ గొడవంతా అయ్యింది” అంది రమ నేరస్తురాలిలాగా.

మీకు అంత చూడాలని ఉంటే నేను చూపించేదాన్ని పైకెక్కించి జాగ్రత్తగా. మీరు మంచి పిల్లలు అల్లరి చెయ్యరు. “ఇక మీదట ఏదైనా చూడాలనిపిస్తే ముందుగా నాతో చెప్పాలి. సరేనా?” అని వాళ్లిద్దర్నీ బుజ్జగించారు రాధ తల్లి.

రాధా రమ భయం నుంచి తేరుకుని అటకమీద అంటిన దుమ్మూ ధూళీ పోయేటట్టు కాళ్ళూ చేతులూ ముఖం కడుక్కొచ్చారు.

రమ వర్షం తగ్గాక ఇంటికిపోతూ “రాధా మీ అమ్మ భలే మంచిదే” అన్నది.

“అమ్మలందరూ' మంచి వాళ్లేనే, మన కొక్కొక్కప్పుడు తెలియదు, అంతే” అన్నది రాధ మహా అనుభవజ్ఞురాలైనట్టు.

Responsive Footer with Logo and Social Media