ముంగిస, తోడేలు
అనగా అనగా ఒక అడవిలో ఒక తోడేలు ఒక ముంగిస ఉండేవి. అవి దగ్గర దగ్గరగా ,
నివసించేవి. అందుకని ఎక్కువ పిట్టల్ని చంపినా, ఎక్కువ కాయలూ పళ్లూ దొరికినా రెండూ
కలిసి పంచుకుని సంతోషంగా లొట్టలేస్తూ తినేవి. ఒకనాడు అవి రెండూ వెన్నెట్లో నడుస్తూ
కులాసాగా మాట్లాడుకుంటున్నాయి.
ముంగిస - తోడేలమ్మా, తోడేలమ్మా నువ్వు ఎప్పుడైనా పులిహోర తిన్నావా?
తోడేలు - ఓ, పులిహోర తిన్నాను, దాని తాతలాంటి పులావు కూడా తిన్నాను...
ముంగిస - పులావా? దాంట్లో ఆలుగడ్డ ముక్కలూ, (చప్పరిస్తూ) ఇంకా పచ్చి బటానీలూ, .
లవంగాలూ, అవన్నీ వేస్తారు కదా?
తోడేలు - ఓస్! నువ్వంత కన్నా తిని ఎరుగవు కాబోలు! నే చెప్తా నిను. సీమకోడి
మాంసం పెద్ద పెద్ద ముక్కలు చేసి బాగా నెయ్యివేసి వేగించి ఆలుగడ్డ బదులు పలావులో వేస్తే
అబ్బ! లొట్టలు వేస్తూ నాకిప్పుడు తినాలనిపిస్తోంది. దానిలో టమాటోపళ్లూ పచ్చి బటానీలూ,
ఇంకా కొత్తిమీర మంచి తాజావి వెయ్యాలి. ఓ, అది తింటేనా స్వర్గానికి బెత్తెడు దూరంలో
ఉంటామనుకో. అంత రుచిగా ఉంటుందా సీమకోడి మాంసపు పులావు!
ముంగిస - ఆ పులావు నాక్కూడా తినాలని ఉంది తోడేలమ్మా. దానిని గూర్చి
వింటుంటేనే నానోరు ఇంతగా ఊరుతోంది మరి తింటే ఎంత బాగుంటుందో కదా!
తోడేలు - అదే నే చెప్పేది సీమకోడి రుచి మరి దేనికీ లేదు. నేను జీవితంలో ఎన్నో
జంతువుల మాంసాన్నీ పిట్టల మాంసాన్నీ తిన్నాను గాని, ఈ సీమ కోడి మాంసంతోటి ఏదీ
సాటికాదు. ఇప్పుడే ఆ పులావు తినెయ్యాలని ఉంది నాకు, కాని ఎట్లా వస్తుంది?
ముంగిస - పోనీ మనం చేసుకు తిందామా?
తోడేలు - నీ ముఖం, సీమకోడి ఎక్కడ నుండి వస్తుంది ఉన్నట్లుండి? (విసుక్కుంది
తోడేలు)
ముంగిస - అది కాదు తోడేలమ్మా పక్క ఊళ్ళో చాలా మేడలున్నై - అక్కడి వాళ్ళు
కోళ్లను పెంచుతారు. మనం పోయి ఎక్కడైనా ఒకదాన్ని వెతికి తెచ్చుకోవచ్చుగా?
తోడేలు - అవును. నీ ఆలోచన చాలా బాగుంది. పద పదాం.
సరే అంటే సరే అనుకుని రెండూ బయల్దేరినై. పోయి పోయి పక్క ఊరుచేరినై. అక్కడ
ఒక మేడ కనిపించింది. ఆ మేడ వెనుకవైపు నుంచి దొడ్లోకి ప్రవేశించి, ఒక కిటికీలో నుండి
లోపలికి తొంగి చూచినై. ఒక బల్లమీద కొన్ని వండిన కోళ్ళు పళ్ళాలలో అమర్బబడి తినేందుకు
సిద్ధంగా ఉన్నై, మాంచి వాసన వచ్చింది. ముంగిస ఉండబట్టలేక “తోడేలమ్మా, అవి భలే
బాగున్నై కదూ? కమ్మటి వాసన వేస్తున్నవి అవేనా సీమ కోళ్ళు?” అని అడిగింది.
తోడేలు - నీ జన్మలో సీమకోడిని చూచినట్లే లేదే. మన పులావులోనికి పనికి వచ్చే
కోళ్ళు ఆ కోళ్ళపాకలో ఉన్నై చూడు - పద అటుపోదాం.
తోడేలమ్మా ముంగిసా రెండూ చేతులు కలుపుకుని ఎంతో ఉత్సాహంగా కోళ్ళ గుడిసెవేపు
నడిచినై. కాని అక్కడే ఒక భయంకరమైన కుక్క కోళ్ళకు కాపలా కాస్తోంది. దానిని చూడడం
తోటే మన తేడేలూ ముంగిసా గతుక్కుమన్నై, పరీక్షగా చూస్తే ఆ కుక్క నిద్రపోతోందని తేలింది.
అవి రెండూ మెల్లిగా రహస్యంగా మాట్లాడుకున్నై.
తోడేలు - ముంగీ, అదుగో ఆ గుంటలోపడుకున్నవే సీమకోళ్ళు అవి లోపల పడుకున్నై.
ఆ కుక్కను చూడబోతే మనకు అడ్డం వచ్చేటట్టుంది. మనం మెల్లిగా పోయి మంచి మాటల
తోటి మాయబుచ్చి వాటిలోని రెండు కోళ్ళనైనా మన వెంట వచ్చేటట్లు చెయ్యాలి. చప్పుడు
కాకూడదు సుమా!
ఇకనేం, అవి రెండూ అడుగులో అడుగులేసుకుని మెల్లగా కుక్కను దాటాయి. కోళ్ళకు
దగ్గరగా పోయి మాటలతో వాటిని పైకి రప్పించాలని ప్రయత్నం చేసినై.
తోడేలు - ఆ వెధవ పాకలో పడి ఉంటారేం ఎప్పుడూ? పిండి ఆరబోసినట్లు వెన్నెల
కాస్తుంటే?
ముంగిస - ఈ కోళ్ళకు సుఖపడాలనే కోరిక ఉండదేం.
తోడేలు - (రెండడుగులు ముందుకువేసి) ఏయ్, ఏయ్, కోళ్ళూ, మిమ్మల్నే రండి
త్వరగా, ఈ వెన్నెట్లో హాయిగా తిరిగివద్దాం.
ముంగిస - ఏయ్ కోళ్ళూ మాంచి అవకాశం మీలో ఇద్దరైనా రండి సరదాగా తిరిగి
వద్దాం.
ఆ కోళ్ళేవీ కళ్ళయినా తెరవలేదు.
తోడేలు - చూడండీ, ఓ కోళ్ళూ వస్తే వెంటనే వచ్చేయ్యాలి సుమా. మళ్లీ చందమామ
మేఘాల చాటుకుపోతే వెన్నెల రమ్మన్నారాదు. మళ్లీ మీరే విచారిస్తారు.
అఆ కోళ్ళు వీటి మాటలు వింటేగా. మళ్లీ తోడేలూ, ముంగిస వాటిని మాట్లాడించాలని
'ప్రయత్నించినై.
ముంగిస - ఈ వెధవ మురిగిపోయిన కోళ్ళ గుడిసెలో కాస్తగాలైనా లేకుండా అట్లాగే
తెగనిద్రపోతే మీ ఆరోగ్యం తగలబడుతుంది.
తోడేలు - అంత సేపు నిద్రపోతే మత్తెక్కి తెగబలిసిపోతారు.
ఆ కోళ్ళలో నుండి ఒక పెద్దకోడి మగతగా కళ్ళు తెరిచి “పోనిద్దూ మేమెంత లావెక్కినా
'మాకు బెంగలేదు. ఆరోగ్యం చెడినా మేమీ పాకలోనే ఉంటాం” అని మళ్లీ పలకకుండా
పడుకుంది.
మన తోడేలు ముంగిసా తమ ప్రయత్నం మాత్రం మానదలచుకోలేదు.
ముంగిస ఏయ్, అట్లాగే కదలకుండా మెదలకుండా పడుకుని తెగనిద్రపోతే గడ్డం
కింద మరో గడ్డం వస్తుంది. రెండు గడ్డాలుంటే అబ్బ ఎంత అసహ్యంగా ఉంటారో తెలుసా?
అయినా ఒక్క కోడైనా ఉలకలేదు పలకలేదు. తోడేలుకు ఉడుకుమోతుతనం వచ్చింది.
తోడేలు - ఇంత మంచి పెద్ద మనుష్యులం వచ్చి మర్యాదగా పిలిస్తే బొత్తిగా మోటుగా
ఒక్క మాటైనా విననట్టుగా నటించడం మహా గొప్పకాబోలు!
అప్పుడొక లావాటి కోడి మాట్లాడింది.
....కోడి - పోదురూ! మాకు గడ్డం కింద గడ్డం వచ్చినా మరో రెండు గడ్డాలు వచ్చినా
బెంగలేదు. మాకు ఇక్కడే బాగుంది. పైకి రానేరాం.
ముంగిస - మంచి వెన్నైట్లో తిరిగి ఆనందించడం ఈ మొఖాలకు తెలిస్తేగా? ఇదిగో,
ఆఖరిసారి చెబుతున్నా తరువాత విచారించి లాభం లేదు. ప్రపంచంలో విచిత్రాలన్నీ చూడాలంటే
మాతో రండి లేదా, మీ ఖర్మం మీది, ఉత్తమూర్థుల్లాగున్నారు. మేం పోతున్నాం.
ముంగిసా, తోడేలూ వెనక్కి తిరిగినై వెళ్లి పోతున్నట్లు నటిస్తూ. వెంటనే ఆ కోళ్ళలోకల్లా
ఒక చిన్నది చటుక్కున లేచింది. దానికి ప్రపంచం అంతా తిరిగి ప్రపంచజ్ఞానం సంపాదించాలని
కోరిక పుట్టింది. దాని కాళ్ళు సాధారణంగా ఊరికే ఉండవు. తెగ తిరగాలని ఉంటుందెప్పుడూ.
తోడేలూ ముంగిసా ముందు నడిస్తే ఈ చిన్నకోడి వాటి వెనుక నడిచింది. కుక్క కళ్ళు తెరిచి
ఒకసారి “హ్రూ” అని మళ్ళీ పడుకుంది. దానితో తోడేలూ ముంగిసా గతుక్కుమని మళ్ళీ
తేరుకున్నై, అడుగుల్లో అడుగువేసుకుని కుక్కను దాటేసి పైకి వచ్చినై. వాటితో వచ్చిన చిన్నకోడి
ఉత్సాహానికి అంతులేదు. తెగ కబుర్లు చెప్పేస్తోంది. వెన్నెల భలే బాగుందంది. అట్లా రోజూ
తిరిగితే భేషుగ్గా ఉంటుందంది.
ఇక మన తోడేలూ ముంగిసా ఆ చిన్న కోడిని తెగ పొగిడేసిన్నై “నువ్వు చిన్నదానివైనా
చాలా తెలివైన దానివి. మీ పెద్ద కోళ్లలాగా నువ్వు మొద్దువు కావులే!” అన్నై.
కోడిపిల్ల - మనం ప్రపంచం చుట్టూ ఎప్పుడు తిరుగుదాం?
తోడేలు - ఓ, ఇప్పుడు అంతా ఆ విమానాల్లో పోయి ప్రపంచకాన్ని ఇట్టే చూసేసి
వస్తున్నారు. అదెంత పనిలే,
ముంగిస - మరి నాకు చాలా ఆకలి వేస్తోంది. ఏవైనా కూరలు కోసుకుని పోయి
ఇంతకడుపు నిండా తిని మరీ పోదాం. (తోడేలు వంక చూసి కన్నుగీటి అన్నది)
తోడేలు - (ముంగిస వైపు కన్నుగీటి) అవును కాసిని పచ్చి బటానీలూ, టమాటా
పళ్లూ, కొత్తిమీర దార్లో పొలంలో దొరుకుతాయి... కోసుకుపోయి ఏమైనా చేసుకుని తినిపోదాం.
పొలంలోకి వెళ్లినై ముంగిసా, తోడేలు. వెంట వెళ్ళిన కోడిపిల్ల ఇదంతా విచిత్రంగా
చూస్తూ, తనుకూడా సరదాగా బోలెడు పచ్చి బటానీలు కోసింది. కూరలు పట్టుకుని అడవిలో
తోడేలు ఇంటికి వెళ్లారు.
తోడేలు త్వరగా పొయ్యి రాజేసింది. పులావుకు కావలసిన వస్తువులన్నీ వండేసింది.
దాంట్లో కమ్మటి నెయ్యి పోసింది. కత్తిచేత్తో పట్టుకుంది తెగ కబుర్లు చెప్పుతున్న చిన్న కోడిని
కొయ్యడానికి. ఇంతలో దానికి ఒక ఆలోచన తట్టింది.
తోడేలు - ఏమే ముంగీ! ఈ కోడిపిల్ల ఒక్కరికే చాలేటట్టు లేదుకదా మరి ఇద్దరం ఎట్లా
తినగలమే?
ముంగిస - పోనీలే తోడేలమ్మా ఇవాళ్టికి నేను తింటాను. నువ్వు మరోరోజు మళ్ళీ
చేసుకుని తిందుగాని.
తోడేలు (కోపంగా) ఇంతావండీ వార్చీ నీకు మెక్కబెడతానటే?
ముంగిస - లేకపోతే కోడి పిల్లను పూర్తిగా నువ్వే తినెయ్యాలని అనుకున్నావా?
అందాక కబుర్లు చెప్తూ పొయ్యిదగ్గరే కూర్చుని, వండేవంటకాల్ని విచిత్రంగా చూస్తున్న
కోడిపిల్ల వీటి మాటలువిని గజగజలాడిపోయింది. “అయ్యబాబోయ్! వీళ్ళు నన్ను ఇందుకా
తీసుకొచ్చారు!” అనుకుని హడలిపోయింది.
తోడేలూ, ముంగిసా ఇంకా బాగా పోట్లాటలోకి దిగినై.
తోడేలు - నా ఇంట్లో వండేకోడి మాంసపు పులావు నాది గాని నీది ఎట్లాగవుతుంది?
ముంగిస - నన్ను దగా చేసి నువ్వే తినెయ్యాలని చూస్తున్నావా? అసలు నీకు పెట్టకుండా
నేనే తినేస్తా చూడు.
తోడేలు - నేను కష్టపడి చేస్తే నువ్వెట్లా తింటావే?
ముంగిస - అబ్బో! నువ్వే కష్టపడ్డట్టు. నేనుండబట్టే అసలా కోడిపిల్ల వచ్చింది తెలుసా?
తోడేలు - నోరు ముయ్యి! నేను నీకు పెట్టకుండా అంతా తినేస్తా ఏం చేస్తావో చెయ్యి.
ముంగిస - ఓయబ్బో నేనేకదా ఇంత పెద్దగా ఉన్నాను నన్నేం చేస్తుందనుకున్నావా?
నేనూ నీకు చెప్పగలను బుద్ది .
తోడేలు - అసలా కోడిని ముట్టుకో! నీ సంగతి చెప్తా!
ముంగిస - ముట్టుకుంటా ఏం చేస్తావో చెయ్యి,
ఇంతలో తోడేలూ ముంగిసా కోడిపిల్ల కూర్చున్నవైపు చూచినై. ఇంకెక్కడి కోడిపిల్ల?
అది అప్పుడే హడలిపోయి పారిపోయింది. దాంతో కోడిపిల్ల పోవడానికి నువ్వు కారణమంటే
నువ్వు కారణమని పోట్లాడుకున్నై, ఒకళ్ళపై వకరు పడి తన్నుకుంటూ మండే పొయ్యి మీద
కాగే నేతిలో పడి మొర్రయని వక్కసారే చచ్చిపోయినయి.
ఇక కోడిపిల్ల మాటంటారా? అది దాని పాకచేరుకుని “అబ్బ! ఎంత హాయిగా ఉంటుందీ పాకలో, బయటికిపోతే అన్నీ కష్టాలే కదా! ఈ పాక వదలి మళ్ళీ పోను, బాబూ” అనుకుంది.