నాకే తెలుసు, నాకేం తెలుసు



శ్రీనుకి ఎనిమిదేళ్ళు. ఛాయ అతని చెల్లెలు. దానికి ఐదేళ్ళు. ఇద్దరూ ఒకే బళ్ళో చదువుతున్నారు. “అన్నీనాకే తెలుసు” అనే అలవాటు శ్రీనుది. అందుకని అతన్ని అంతా “నాకే తెలుసు” అనేవారు. ఛాయ మాట్లాడితే “నాకేం తెలుసు?” అంటూ ఉంటుంది. అందుకని ఆమెకాపేరు వచ్చింది.

ఒకనాడు బడి పిల్లలనందర్నీ జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళారు. నాకే తెలుసు, నాకేం తెలుసు చెట్టాపట్టాలతో వెళ్లారు.

పంతుళ్ళు బడిపిల్లలను బారులు కట్టి జాగ్రత్తగా అన్ని మూలలకూ తీసుకువెళ్తున్నారు. రకరకాల జంతువులనూ పక్షులనూ చూపించారు. పిల్లలకు ప్రతీచోటా ఇంకా నిలబడాలనే ఉంది. కాని వేళ చాలదని పంతుళ్ళు తొందరగా తీసుకుపోతున్నారు. నాకేం తెలుసుకు ఏనుగును చూడటమంటే బలే సరదా, “చూసిన కొద్దీ చూడాలనుంది, శ్రీనూ” అంది నిమ్మళంగా అన్నతో “ఐతే చల్లగా వెనక్కి జారు” అన్నాడు నాకే తెలుసు.

ఎవ్వరూ చూడకుండా ఇద్దరూ వెనక పడ్డారు. “మరి అంతా వెళ్ళిపోతారేమో మనకి దారేం తెలుసు?” అంటూ భయపడింది నాకేం తెలుసు. “నాకు తెలుసు” అన్నాడు నాకే తెలుసు. వాళ్ళు కాసేపు ఎదురుగాను, కాసేపు వెనకా, కాసేపు పక్కగాను నిలబడి ఏనుగును పరీక్షగా చూశారు.

చీకటి పడింది. నాకేం తెలుసు, “ఇంటికి పోదాంరా అన్నయ్యా” అంది. కాని బడిపిల్లలు కాని, పంతుళ్ళుకాని ఎక్కడా కనుపించలేదు. “మళ్ళీ, మనం ఒక్కళ్ళమూ ఇంటికి పోగలమా?” అంది నాకేం తెలుసు. “భయపడకు, పోలీసు లెవరైనా ఉంటే ఇంటికి పంపించమని అడుగుదాం” అన్నాడు నాకే తెలుసు. “ఐతే నీకు దారి తెలియదా?” అని బిక్కూబిక్కూమంది. చెల్లాయి. ఆమెకు పోలీసులంటే భయం. “నాకు తెలుసులే, ఐనా చీకటిగా ఉందని” అంటూ . చెల్లి చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు నాకే తెలుసు.

జంతు ప్రదర్శనశాలలో ఒక పోలీసు స్టేషను ఉంది. ఒక పోలీసు గడపలో కొయ్యబొమ్మలా నుంచున్నాడు. నాకేం తెలుసు అతనికి అవతల పక్కను లోపలి ఒకాయన కుర్చీలో కూర్చుని కాగితాలు చూసుకుంటున్నాడు. చుట్టూ పెద్ద పెద్ద తుపాకులు గోడకు , అమర్చి ఉన్నాయి. నాకేం తెలుసుకు చాలా భయం వేసింది. అన్న చెయ్యి గట్టిగా పట్టుకుంది. నాకే తెలుసు తమ కథ చెప్పి ఇంటికి పంపమని అడిగాడు. “చిన్న పిల్లలు అలా .

విడిపోవచ్చా” అని ఆ పోలీసు ఉద్యోగి వాళ్ళకేసి గట్టిగా చూశాడు. లోపల మాత్రం “తెలివైన పిల్లలే” అనుకున్నాడు. నాకే తెలుసు ఏమీ మాట్లాడలేదు.

వాళ్ళ నాన్నగారి పేరు అడిగి ఫోనుచేసి అద్దె మోటారు రప్పించి ఇద్దరిని జాగ్రత్తగా ఇంటికి పంపేశాడు.

ఇంట్లో అడుగుపెట్టగానే నాకేం తెలుసు అమ్మ ఒడిలో పడి ఏడ్చింది. “అక్కడ ఏడుస్తూ . కూచోకుండా తెలివైన పనే చేశారు. కాని పాపం పంతుళ్ళు మీకోసం వెతుక్కోరూ?” అంటూ వాళ్ళ నాన్నగారు పెద్ద పంతులింటికి మనిషిని పంపారు. “మేం యింకెప్పుడూ అట్లా చెయ్యమండి” అని నాకే తెలుసు, నాకేం తెలుసు మర్నాడు .

బడిలో పంతుళ్ళతో చెప్పారు. పంతుళ్ళు నాకేం తెలుసును ఏమీ అనలేదు కాని నాకే తెలుసును కొంచెం కోపపడ్డారు.

Responsive Footer with Logo and Social Media