ఎలుగాయి కథ
ఒక అడవిలో అన్నిరకాల జంతువులూ ఉండేవి. వాటిలో ఒకచిన్న ఎలుగుగొడ్డు
ఉండేది. దానిని 'ఎలుగాయి' అని పిలిచేవి ఆ అడవిలో జంతువులు. ఎలుగాయి ఈడుకు
చిన్నవాడే కాని వాడి మనస్సు ఎప్పుడూ ఊరికే ఉండదు. ఒకనాడు వాడి తల్లితోటీ తం(డ్రితోటి
చెప్పాడు. “నాకు ఈ అడవిలో ఈ జంతువుల మధ్య జీవించడం చాలా విసుగుగా ఉంది.
ఎప్పుడూ ఏ మార్పూలేకుండా ఒకటే తీరున బతకాలి.”
వాడి తల్లీ తండ్రీ పొట్టచెక్కలయేటట్లు నవ్వి “ఒరేయ్ ఎలుగబ్బాయ్ నువ్వు జంతువువేకదా
జంతువుల మధ్య జీవించకుండా ఇంకెక్కడ జీవిస్తావురా?” అన్నాయి.
“అవును, నేను జంతువునే ఐతే మాత్రం ఎప్పుడూ జంతువుల మధ్యనే పడి ఉండాలని
ఉందా? నాకు మనుష్యుల తోటి కలిసి జీవించాలని ఉంది. ఇంక మీరిద్దరూ నాకేమి చెప్పినా
వినదలచుకోలేదు” అని అరిచాడు ఎలుగాయి.
“ఒరేయ్ నీకు వయస్సు చాలా తక్కువ. పెద్దవాడివయ్యేదాకా మా మాట విను, తరువాత
నీ ఇష్టం” అన్నాడు తండ్రి ఎలుగు.
“అయితే మీరు చెప్పేదేమిటి?” అని కోపంగా కసురుకుంటూ అడిగాడు ఎలుగాయి.
అప్పుడు తల్లి ఎలుగు అన్నది. “అబ్బాయీ కోపం తెచ్చుకోకు - మనుష్యులతోటి
జీవించాలని నీకు ఉన్నా, వాళ్లు నీతో జీవించడానికి ఇష్టపడరు. నువ్వు మరీ మొండికెత్తితే
నిన్ను చంపేస్తారు కూడా.”
తండ్రి, “నీకు అటువంటి కోరిక ఎందుకు పుట్టిందిరా?” అని అడిగాడు. నాకు
మనుష్యులతోటే జీవించాలని ఎప్పుడూ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు చక్కగా మంచి
బట్టలు వేసుకొని తిరుగుతారు. మంచాల మీద పరుపుల మీదా పడుకుంటారు. మంచి
మంచి పళ్లాలలో భోజనం చేస్తారు. హాయిగా రకరకాల కుర్చిలలో కూర్చుంటారు. మంచి
మంచి ఇండ్లలో నివసిస్తారు. మనమో! మనదీ ఒక బతుకేనా? ఎప్పుడూ ఏదో దొరికిందింత
తిని ఏగుట్టలలోనో పడి ఉండాలి. ఛీ! నేనింక ఇట్లా బతక దలచుకోలేదు” అన్నాడు ఎలుగాయి.
వాడి తండ్రికీ తల్లికీ వాడికి ఎట్లా నచ్చచెప్పాలో తోచలేదు. ఏది చెప్పినా వినకుండా
మొండిగా వాదిస్తున్నాడు.
కొంత సేపటికి తల్లి అన్నది బతిమాలుతూ “మనుష్యులతో జీవించాలనే కోరిక బాగానే
ఉంది. కాని అది చాలా ప్రమాదమైన జీవితం. అటువంటి ఆలోచనలను వదులుకో నాయనా!
అయినా నువ్వు మనుష్యుల దగ్గరకు పోవడం వాళ్లతో కలిసి ఉండటం ఎట్లా కుదురుతుందిరా?”
అని,
“నువ్వూ, నాన్నా నన్ను తీసుకువెళ్లి వాళ్ల దగ్గర దింపి రండి. నేనక్కడే ఉండిపోతా,
వారం రోజుల క్రితం ఎవరో సర్కసు మనుష్యులు నన్ను తీసుకుపోదామనివస్తే నాన్న నన్ను
దాచేశాడు. లేకపోతే నేనీ పాటికి హాయిగా మనుషుల మధ్య ఉండేవాడిని” అని అన్నాడు
ఎలుగాయి. తండ్రికి చాలా విసుగు పుట్టింది. అయినా “నీకు నీ మంచి తెలియటం లేదురా,
సర్కసు వాళ్లతోపోతే నీ కోరికలన్నీ తీరవు సరికదా వాళ్లు నిన్ను చాలా బాధపెడతారు. నేను
చెప్పిన మాటవిని ఆ గొడవ మరచిపో నాయనా” అని చెప్పి చూశాడు.
ఎలుగాయికి మళ్లీ కోపం వచ్చింది. తల్లీ తండ్రీ తనను సుఖపడనీయరని అనుకుని
స్నేహితుల సలహాకోసం బయలుదేరాడు.
అడవిలోని అన్ని జంతువుల పిల్లలతోటీ ఎలుగాయి ఎనాడో స్నేహం చేశాడు. వాడు
మొదట ఒక సింహం పిల్లవాడి దగ్గరకు వెళ్లాడు. “ఒరేయ్ సింహా, నాకు మనుష్యులలాగ
జీవితం గడపాలని ఉంది. మా అమ్మానాన్న మనుష్యుల దగ్గరకు పోనివ్వరు, ఏం చేసేదిరా?”
అని అడిగాడు.
“ఒరేయ్, ఎలుగాయ్ మా అమ్మానాన్నా కూడ పోవద్దనే అంటారు రా - మనం
వాళ్ళను అసలు అడగనే కూడదురా” అన్నాడు సింహపు పిల్లవాడు.
ఎలుగాయికి ఈ సలహా బలేనచ్చింది. అయినా అంతటితో ఊరుకోలేదు. మా
అమ్మానాన్నా నన్ను పోనివ్వటం లేదు అని చెప్పాడు. మా అమ్మానాన్నా కూడా వెళ్ళవద్దని
అన్నారు. అందుకని నేను వెళ్లడం మానేశానురా” అన్నాడు ఏనుగాయి.
“నీ ముఖం అమ్మానాన్నా ఎప్పుడూ ఒద్ధనే అంటారు వాళ్లు ముసలి వాళ్లు, శుద్ధ పిరికి
నాయనమ్మలు. వీళ్ళు వద్దన్నారని మానేస్తావా దద్దమ్మా?” అని అడిగాడు ఎలుగాయి.
“అవునురా మనం ఇంకా చిన్నవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ల మాట వినాలి” అని ఇక
మాట్లాడకుండా ఏనుగాయి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
ఎలుగాయి ముఖం చిట్లించుకుని మరొక చోటికి వెళ్లాడు. ఈ సారి ఒక కోతి పిల్లవాడిని
కలిశాడు తన కోరికను తెలియపరచి వాడి సలహా ఏమిటని అడిగాడు.
“ఒరేయి ఎలుగాయి, అమ్మానాన్నా ఏది వద్దంటే అదే చెయ్యాలిరా అప్పుడే మంచి
గమ్మత్తుగా ఉంటుంది.” అని కోతి సలహా ఇచ్చాడు. ఈ సలహా ఎలుగాయికి చాలా బాగా
నచ్చింది. అయినా ఇంకా మిగిలిన జంతువుల పిల్లల సలహాలు కూడా తీసుకునేటందుకు
అందరినీ మర్నాడు ఒక సభ జరుపుకుందాం రమ్మని పిలిచాడు.
మర్చాడు సభ మొదలైంది. సభకు వచ్చిన రకరకాల జంతువుల పిల్లలూ చక్కగా
షోకులు చేసుకుని వచ్చాయి. అందులో కొన్ని చెరుకుముక్కలూ, దుంపముక్కలూ,
పచ్చివేరుసెనగకాయలూ, ఇంకా ఏవేవో కొరుక్కుని తింటూవచ్చాయి. 'సభకు వచ్చిన
జంతువులలో ఒక్కటీ పెద్దది లేదు. వచ్చినవన్నీ తమకు తోచినట్లు మనుష్యులను గూర్చి
చెప్పాయి. మొత్తానికి అన్నీ మనుష్యులలాగ జీవించాలనే కోరుకున్నాయి. ఒకటి రెండు
జంతువులు ఒప్పుకోకపోయినా మిగిలినవన్నీ పెద్దవారి సలహా ఎప్పుడూ వినరాదు. అనే
నిశ్చయానికి వచ్చాయి. సరేనంటే సరే ననుకున్నాయి. అందులో నక్కపిల్లవాడు లేచి
మొట్టమొదట మనలో ఒకళ్లు మనుష్యుల దగ్గరకు పోయి జీవించాలి. కొన్నాళ్ళ తరువాత
మిగతా వాళ్లం అందరం పోవచ్చును అన్నాడు. సభలోని వారంతా దీనికి ఒప్పుకున్నారు.
ఈసారి ఎవరైనా సర్కసువాళ్ళు అడవిలోకి జంతువుల కోసం వస్తే ఎలుగాయిని
పట్టుకుపోయేటట్లు చూడాలన్నారు. తమ తల్లిదండ్రులకెవ్వరికీ ఈ విషయం తెలియనీయ
రాదన్నారు. అంతా ఒప్పుకున్న తరువాత సభ ముగిసింది.
వారం రోజులు తిరగకుండానే ఒక సర్కసు కంపెనీ వాళ్లు ఆ అడవిలోకి వచ్చారు.
ఎలుగాయిని స్నేహితులంతా చేరి రహస్యంగా వాళ్ళు తీసుకుపోయేటట్లు చేశారు.
ఎలుగాయి తల్లీతండ్రీ రెండు మూడు రోజులదాకా వాడికోసం వెతికి వెతికి రాత్రి
నిద్రా పగలు తిండీ మాని చివరకు ఏ సర్కసువాళ్ళో తీసుకుపోయి ఉంటారని ఇక చేసేది
ఏమీ లేక ఊరుకున్నాయి.
ఈ లోగా అడవిలోని జంతువుల పిల్లలన్నీ ఎలుగాయి ఏమి విశేషాలు తెస్తాడోనని
రాత్రీ పగలూ ఆత్రంతో గడుపుతున్నాయి.
ఒక నెలరోజులు గడిచాయో లేదో, ఒకనాడు ఎలుగాయి అడవిలో కనుపించాడు.
మొదట వాడి స్నేహితులెవరూ వాడిని గుర్తుపట్టలేదు. వాడి కాళ్ళకూ చేతులకూ ఏవో గజ్జలూ
పూసలూ కట్టి ఉన్నాయి. మెడకు ఒక తెగిపోయిన తాడు ఉంది. సన్నగా చిక్కిపోయి పలుకరిస్తే
ఏడిచేలాగా ఉంది వాడి ముఖం.
ఇంతలో జంతువుల పిల్లలన్నీ ఈ విషయం తెలిసి పరుగు పరుగున వచ్చి ఒక సభ
ఏర్పరచి దాంట్లో ఎలుగాయిని మాట్లాడమన్నాయి.
ఎలుగాయి మాట్లాడాడు. “నేను మా అమ్మనూ నాన్ననూ ఎదిరించి మనుష్యులతో జీవించాలని వెళ్ళాను. వెళ్ళాక నేను పడ్డబాధలు ఇన్నీ అన్నీ కాదు. నాకు సర్కసువాళ్ళు ఆకలి వేసినప్పుడు తిండి పెట్టేవాళ్ళు కాదు. బాగా ఆకలిగా ఉన్నప్పుడే ఏవేవో మొగ్గలు వేయమనేవాళ్ళు, వాళ్ళ భాష నేను అర్థం చేసుకోలేకపోతే నన్ను చచ్చేటట్టు కొట్టేవాళ్ళు. నా ఒళ్ళు చూడండి. ఎన్ని దెబ్బలు తగిలినాయో! మనం జంతువులం వాళ్ళు మనుష్యులు. వాళ్ళతో మనకు స్నేహం ఎట్లా ఏర్పడుతుందీ? వాళ్ళు సుఖంగా మంచాలమీద పడుకున్నా హాయిగా కుర్చీలమీద కూర్చున్నా. అందమైన బట్టలు కట్టుకున్నా, మనని మాత్రం జంతువులుగానే చూస్తారు. వాళ్ళకు తోచింది తోచిన వేళకు పెడతారు. మనకు తోచినప్పుడు అటూ ఇటూ తిరగడానికైనా వీలులేకుండా తాళ్ళతో కట్టేస్తారు. అక్కడ ఉన్ననాళ్ళూ ఈ అడవిలోని మీరందరూ జ్ఞాపకం వచ్చి ఏడవని రోజులేదు. మా అమ్మానాన్నా నా గురించి ఎంతగా విచారిస్తున్నారోనని బెంగపెట్టుకున్నాను. ఇక ముందు వాళ్ళు చెప్పినట్లే విని ఇంకెక్కడికి పోకుండా ఉండాలని అనుకుంటూ వచ్చాను. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడి తప్పించుకోవలసి వచ్చింది.
సభలో నుండి ఏనుగాయి “మరైతే నువ్వు ఇక్కడి కెట్లా రాగలిగావురా?” అని ఆశ్చర్యంగా
అడిగాడు.
ఆ సర్కసు వాళ్ల పిల్లవాడు రోజూ నాతో అడుకునేవాడు. వాడిని నా మెళ్లో తాడు
ఒక్కమారు విప్పమని బతిమాలాను. వాడు విప్పడం చేతకాక తాడు కోసేశాడు” అని చెప్పి
ఎలుగాయి కాసేపు ఏడిచాడు.
“అమ్మానాన్నా మనుష్యుల దగ్గరకు ఎందుకు పోవద్దన్నారో ఇప్పుడు బాగా తెలిసింది”
అని కూడా అన్నాడు ఏడుపుమాని.
సభకు వచ్చిన చిన్న జంతువులన్నీ (శ్రద్ధగా ఎలుగాయి చెప్పినదంతా విన్నాయి.
మనం “పెద్దవాళ్ళమయేదాకా అమ్మానాన్నా మాట వినాలి” అని అనుకున్నాయి.