తమసోమా జ్యోతిర్గమయ



అనగా అనగా ఒక రాజుగారుండేవారు. ఆయన పెద్ద రాజభవనంలో ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు. ఆ భవనం నలు మూలలా చాలా ఎత్తైన సరుగుడు చెట్టులుండేవి. ఆయన ఏనాడూ బయట ఏముందో చూసేవాడు కాదు. ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. ఆ భవనంలో ఉన్న వాళ్లంతా అలాగే ఎప్పుడూ దిగులుగా ఉండేవారు. కాని ఆ భవనంలోని వంటగదివైపు ఒక చిన్న దడి ఉండేది. ఆ దడిలో నుండి వంట చేసే ఒక పిల్ల రాజభవనంలో నుండి బైటకు తరచూపోతూ అక్కడికి దగ్గర్లో ఉన్న ఒక పట్టణానికి పోయి వస్తూ ఉండేది. ఆ పిల్ల పేరు చిరునవ్వు.

ఒకనాడు ఇద్దరు అందమైన చిన్న పిల్లలు నృత్యం చేసుకుంటూ వంటశాలవైపున్న దడిలో నుండి రాజుగారి వంటశాలలోకి (ప్రవేశించారు. చిరునవ్వు అక్కడే కూర్చుని కూరలు తరుగుతోంది. ఈ చిన్న పిల్లలు రంగు రంగుల దుస్తుల్లో ముత్యాల్లాంటి పలువరుసలతో గంతులేస్తూ పిల్లి మొగ్గలేస్తూ పకపకా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటే, చిరునవ్వు కూడా గట్టిగా నవ్వుకుంటూ “మీరెవరు, ఎందుకొచ్చారిక్కడికి?” అని అడిగింది. వాళ్ళు “మేము రాజుగార్ని చూడాలని వచ్చాం” అన్నారు.

“పెరటి గుమ్మంలో నుండి వంటశాలలోకి ప్రవేశిస్తే మీకు రాజుగారెలా కనిపిస్తారు? మీరు సింహద్వారంలో నుండి వెళ్లి రాజుగార్ని చూడాలి” అంది చిరునవ్వు.

ఈ నవ్వులన్నీ విని లోపల గాడి పొయ్యిదగ్గర వంట పని చూసుకుంటున్న పాకకళాశాస్త్రి పరుగుపరుగున వచ్చాడు. చేతిలో పెద్ద గరిటతో మోకాళ్ల దాకా ఎర్ర పట్టుపంచకట్టుకుని, నడుంకి జరీకండువా కట్టుకుని ఆ నవ్వే పిల్లల్నీ కూరలు తరిగే చిరునవ్వునూ చూసి తనూ నవ్వుతూ “ఎవరమ్మాయిలూ మీరు” అన్నాడు.

“నా పేరు వజ్రరశ్శి” అని ఒక అమ్మాయంటే, రెండో అమ్మాయి “నా పేరు వైడూర్యరశ్శి” అంది.

వజ్రం, వైడూర్యం గలగల నవ్వుకుంటూ మిలమిల మెరుస్తూ చకచక పరుగులు తీస్తూ, “మేము రాజుగార్ని చూడాలి” అని మళ్లీ అన్నారు.

“ఠాజుగార్ని చూడాలంటే సింహద్వారం వైపునుండి వెళ్లి చూడాలిగాని వంటశాలలో రాజుగారెలా కనిపిస్తారు” అని పాకకళాశాస్త్రి తనూ పకపక నవ్వుతూ చేతిలో గరిటను రకరకాలుగా తిప్పుకుంటూ అన్నాడు.

అప్పుడే అక్కడికి వచ్చాడు రాజుగారి వడ్డన బ్రాహ్మడు ఆహారపతి. ఎప్పుడూ ముఖం మాడ్చుకుని నవ్వితే పాపం అన్నట్టుండేవాడు. అతను కూడా నవ్వుతూ “ఏమైంది? వీళ్లెవరు” అని అడిగాడు. పాకకళాశాస్త్రి “వీళ్లు రాజుగార్ని చూస్తారుట, సింహద్వారం వైపు పొమ్మంటే పోరట” అన్నాడు.

ఆహారపతి కూడా పొట్టపట్టుకుని నవ్వు ప్రారంభించాడు. ఇక అందరూ నవ్వుతూ తుళ్లుతూ వజ్రన్నీ, వైడూర్యాన్నీ చూస్తూ సంతోషిస్తున్నారు.

రాజుగారు ఆకలికి ఆగలేక ఆహారపతికోసం తన పరిచారిక భోజనప్రియను పంపారు. ఆమె వాతపు శరీరం వలన కాళ్లూ చేతులూ బిగుసుకుని గడకర్రలాగా నడుస్తుంది. అలాగే ఆయాసపడుతూ నడుస్తూ, అసలే చిటపటలాడే ముఖాన్ని మరీ చిటపటలాడించు కుంటూ వంటగదివైపు నడిచింది. భవనం కప్పెగిరిపోయేలాగా నవ్వులూ రంగురంగుల కాంతులూ నిపించిన వంటగదివైపు నడిచి అక్కడి దృశ్యాన్ని మాడ్చుకున్న ముఖంతో చూస్తూ చూస్తూ ముఖంమ్మీదికి నవ్వు తెచ్చుకుని అసలే వంచలేని కాళ్లతో తనూ అటూ ఇటూ గంతులేసి పకపకానవ్వి, తరువాత పొట్ట పగిలేలా నవ్వు ప్రారంభించింది.

భోజన(ప్రియ రాకకోసం కూడా ఎదురు చూసీచూసీ, అసలే మటమటలాడే రాజుగారు ఆకలివల్ల మరీ కోపంతో చిటపట లాడుతూ అక్కడ చేరిన తన పరివారం అందరిపైన విసుగుకుని “అంతా ఏమయ్యారు? నా భోజనం ఏమైంది?” అని అరిచారు.

రాజుగారి అరుపు వంటశాలలోని అందరికీ వినిపించింది. భోజనప్రియ నవ్వుకుంటూ, గంతులెయ్యడం వలన వాతపు శరీరం వంగి కాళ్లు మామూలుగా వంగి రాజుగారి గదివైపుకు పరుగుతీసింది. ఆమె వెనకాలే ఆహారపతీ, ఆయన వెనకే పాకకళాశాస్త్రీ నవ్వుకుంటూ తుళ్లుకుంటూ వెళ్లేరు. ముందు ఎంతో తీక్షణంగానూ, కోపంగానూ, చిరాకుగానూ చూస్తున్న రాజుగారి ముఖం కూడా మారింది. ముందు ఆశ్చర్యం, తరువాత సంతోషం కనిపించినై, ఆ ముఖంలో క్రమంగా ఆయన కూడా నవ్వుతూ సంగతేమిటని అడిగారు. వాళ్ళంతా వజ్రరశ్మీ, వైడూర్యరశ్మీ రావడం గురించీ వారు వచ్చి వంటశాలను ఏ విధంగా వెలుగుతోనూ, నవ్వులతోనూ నింపారో ఉత్సాహంగా చెప్పారు. రాజుగారు వాళ్లని పిలుచుకు రమ్మని పంపారు.

వజ్రం, వైడూర్యం ఒకళ్లకొకళ్లు అతుక్కున్నట్టు పక్కపక్కనే కూర్చుని రాజుగారి వద్దకు రమ్మంటే లేచి వెళ్లలేదు. ఆ మాటవిని రాజుగారే అక్కడికి వేంచేశారు. వజ్రరశ్మీ, వైడూర్యరశ్మీ పిల్లిగంతులేస్తూ పరుగులు తీస్తూ పకపక నవ్వుతూ అక్కడ కనిపించారు - వాళ్లను (ప్రేమగా చూస్తూ, రాజుగారు “మీరు నా భవనంలోకి రాకుండా వంటశాలలోనే ఉండిపోయా రెందుకూ? రండి, రండి నాతో భవనమంతా తిరగండి” అన్నారు.

రాజుగారితో “మీరెప్పుడూ కిటికీలు మూయించి మీ భవనాన్ని చీకటితో నింపుతారు” అని వజ్రం అంటే “ఆ చిన్న చిన్న కిటికీలు తెరిచినా ఒకటే తెరవకపోయినా ఒకటే” అంది వైడూర్యం.

“సరే మా భవనంలో ఉన్న కిటికీలన్నిటినీ తెరిపించి పెద్దవి చేయించేస్తా రండి” అన్నారు.

“కిటికీలు పెద్దవి చేస్తే మాత్రం వాటి కెదురుగా గుబురుగా పెరిగిన పిచ్చి చెట్లన్నీ భవనాన్ని చీకటిగానే ఉంచుతాయి” అని వజ్రం అంటే “చక్కని అందమైన పూలతోటలుంటే బాగా ఆడుకోవచ్చు, అవి కిటికీలకు అడ్డం రావుకూడా” అంది వైడూర్యం.

రాజుగారు క్షణం ఆలోచించి, తన భవనంలో ఒక్క చిరునవ్వు తప్ప అందరూ విచారంలో మునిగి తేలుతున్నట్టుంటారు. వంటశాలనంటి ఉన్న చిన్న దడి దగ్గర కూర్చుని కూరలు తరిగే చిరునవ్వు మాత్రమే రోజూ కాస్త వెలుగును చూస్తోంది. అందుకేనేమో ఆమె ఒక్కర్తీ ఎప్పుడూ విచారంగా కనిపించదు. వజ్రం, వైడూర్యం తన భవనంలో ఎల్లప్పుడూ తిరిగేటట్టు చేస్తే రాజభవనంలో అందరూ సంతోషంతో తేలిపోవచ్చు అని అనుకున్నారు. వెంటనే వందల. మంది వడ్రంగులనూ, మేస్త్రీలను , కూలీలనూ పిలిపించేశారు.

రాజుగారు తలవాలే గాని పనులు అవడం కష్టమా? మర్నాటికల్లా చిన్న కిటికీలు పెద్దవైనాయి, కిటికీల కడ్డంగా ఉన్న పిచ్చి చెట్లన్నిట్నీ కొట్టేశారు. రంగురంగుల పువ్వుల చెట్లు పువ్వులతో సహా భవనం చుట్టూరా అమర్చేశారు. వజ్రం, వైడూర్యం తమతో తెచ్చిన కాంతి కిరణాలన్నీ భవనమంతటా విస్తరించాయి. ఇప్పుడు రాజుగారూ, ఆయన పరివారం చాలా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ చురుకుగా పనులు చేసుకుంటూ ఉంటున్నారు.

రాజుగారు అన్ని ఏర్పాట్లూ చేసి, వజ్రరశ్మినీ, వైడూర్యరశ్మినీ భవనం అంతటా తిప్పాలని వంటశాలవైపు వెళ్లారు. అక్కడ వాళ్లు లేరు. చిరునవ్వు చెప్పింది వాళ్లిద్దరూ తమ సంతోషాన్నీ కాంతి కిరణాలనూ భవనమంతటా విస్తరింపచేసి సూర్యకాంతిలో కలిసి పోయారని.

“అయితే, వజ్రరశ్మీ, వైడూర్యరశ్మీ సూర్యరశ్మిలోని భాగాలన్నమాట!” అని అన్నారు రాజుగారు.

రాజభవనంలోని వారంతా ఆరోగ్యంతో, సంతోషంతో చురుకుదనంతో తమ తమ పనులను చేసుకుంటూ, ఈ మార్చుకు కారణమైన వెలుగును ప్రసాదించిన వజ్రాన్నీ, వైడూర్యాన్నీ | ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉండేవారు.

Responsive Footer with Logo and Social Media