పేదరాశి పెద్దమ్మ, బూరెలు
ఒకనాడు ఒక పేదరాశి పెద్దమ్మ ఒక గంపెడు బూరెలు వండింది. అప్పుడే ఒక చిన్న
పిల్లవాడు ఆమె దగ్గిరికొచ్చి “నాకో బూరె పెట్టవా?” అన్నాడు. అప్పుడామె ఆ పిల్లవాడి
చేతిలో ఒక బూరె పెట్టి, గంపెడు బూరెలూ లోపలికి పట్టుకెళ్లి దాచేసింది. అదేమంటే “బాబూ,
కష్టపడకుండా ఏమీ కావాలనుకోకు” అంది.
ఆ పిల్లవాడి చేతిలో నుండి ఆ బూరె జారి కింద పడింది. దాన్ని తీసుకుందామని ఆ
పిల్లవాడు ఒంగున్నాడు. ఈ లోగా ఆ బూరె దొర్లుకుంటూ దొర్లుకుంటూ చాలా దూరం
పోయింది.
ఆ పిల్లవాడు బూరె అలా దొర్లుకు పోతోందేమా అని దాన్ని చూస్తూనే చాలా దూరం
పరుగెత్తాడు. అది ఉన్నట్లుండి ఒక ఇంట్లోకి దూరింది.
ఆ ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలూ దాన్ని అందుకోవాలని ఒకళ్లమీద ఒకళ్లు పోటీపడి
“బూరె నాక్కావాలంటే నాక్కావాలని ఇల్లు నాలుగు మూలలా పరుగులు తీసి ఆఖరుకి ఒకళ్లమీద
ఒకళ్లు పడి నుదుర్లు బొప్పెలు కట్టాక ఆ బూరె ఎటు పోయిందో” తెలుసుకోలేక ఊరుకున్నారు.
కాని, ఆ పిల్లవాడు మాత్రం ఆ ఇంట్లో నుండి బూరె బయటికి రావడం మళ్లీ దొర్లుకుంటూ
పోవడం చూసి దాని వెంట వెళ్లాడు. కొంత సేపటికా బూరె మరో ఇంట్లోకి దూరింది. ఆ
ఇంట్లో ఒక ముసలి మనిషి నీరసంగా పడుకుని ఉన్నాడు. ఆకలిగా ఉంది, బూరెను చూసి
దాన్ని తిందామని పట్టుకోపోయాడు. అతని చేతికి చిక్కకుండా అది మళ్లీ మరో చోటికి దారి
తీసింది. బైట నిలబడ్డ పిల్లవాడు మాత్రం ఇంకా ఆశ చావక మళ్లీ దాని వెంట వెళ్లాడు.
కొంతసేపటికా బూరె ఒక పెరుగు దుకాణంలోకి దూరింది. ఆ దుకాణంలో కవ్వంతో
ఒక మూలగా వెన్న చిలుకుతున్న గొల్లమ్మి “అరే బూరె వండుకోకుండానే వచ్చింది.
ఎన్నాళ్లయ్యిందో బూరె తిని” అని సంతోషంగా దాన్ని పట్టుకోబోయి చల్లకుండను తన్నేసింది.
చల్లకుండ పగిలిపోయింది. నేలంతా కడిగి బూరెకోసం చూస్తే అదీ లేదు. రెండు విధాలా
నష్టపోయింది పాపం!
ఆ బూరె వెంటనే ప్రయాణం సాగించిన పిల్లవాడు మాత్రం అది ఎటుపోతోందొ
హస్తూ కొండలూ గుట్టలూ దాటుకుంటూ పోయాడు పాపం. అయినా అది అతని చేతికి
ఏక్కకుండా మరో ఇంటికెళ్లింది. ఆ ఇంట్లో అత్తాకోడలూ దాన్ని చూసి నాక్కావాలంటే
నాక్కావాలని మాటామాటా అనుకున్నారు. ఇరుగూ పొరుగో వచ్చి “అదే మమ్మా, ఒక్క బూరె
కోసం ఎందుకు కొట్లాడుకుంటారు? చెరిసగం తినండి. మళ్లీ ఇద్దరూ కలిసి మరికాసిని
బూరెలు వండుకు తినండి” అని తీర్చు చెప్పారు. ఈలోగా ఆ దారే పోతున్న పదిమంది ఆ
బూరె దొర్లుతూ పోయే తీరును చూసి వాళ్ళూ ఆ పిల్లవాడి వెనకే పరుగెత్తారు.
అప్పుడే అడుక్కుతింటూ అటు వచ్చిన ఒక ముష్టిది “అరే బూరెరా, బూరె. రా కొడుకా
మంచిగా తిందువు” అంటూ కొడుకును పిలిచేసరికి ఆ బూరె అక్కడ లేనేలేదు. ఆ వెళ్లే
వాళ్లతోపాటు ఆ ముష్టి మనిషి కూడా కొడుకును వెంటేసుకుని పరుగుతీసింది. మరికొంత
దూరం వెళ్లేసరికి మరో పాతికమంది, వీళ్ళందరూ ఎందుకు పరుగుతీస్తున్నారో తెలియకుండానే
వాళ్ళతో పాటు వీళ్ళూ పరుగు పెట్టడం మొదలెట్టారు.
మరి కొంత దూరం వెళ్ళేసరికి మరో వందమంది వీళ్ళతో చేరారు. ఈ లోగా ఆ బూరె
దారిలో పెద్ద గొయ్యిలో జారిపడిపోయింది. అది పడిపోవడం చూసిన పిల్లవాడు నిరాశతో
మళ్ళీ వెళ్ళిపోయాడు. ముష్టిమనిషి నడవలేక అక్కడే ఆగిపోయింది. ఇక మిగతావాళ్ళంతా
ముక్కుకు సూటిగా పరుగుతీస్తూనే ఉన్నారు.
నిరాశతో ఇంటి ముఖం పట్టిన పిల్లవాడు మళ్ళీ పేదరాశి పెద్దమ్మకెదురైనాడు. “ఏం
బాబూ ఎటు పోతున్నావు” అంది పెద్దమ్మ.
“బూరె గోతిలో పడిపోయింది పెద్దమ్మా” అన్నాడు.
“అయ్యో మరోటి కావాలా” అంది.
“ఒద్దు. కష్టపడకుండా కావాలనుకున్నా. అందుకే అందకుండా పోయింది. పోనీలే,
నాకు ఏం కావాలో తెలిసి వెతుక్కుంటూ అంతదూరం పరుగెత్తా కదా పెద్దమ్మా. ఆ పరుగెత్తే
జనం వాళ్లకేం కావాలో కూడా తెలుసుకోకుండానే పరుగెత్తుతున్నారింకా. ”
“అవును బాబూ వాళ్ళందర్నీ మేలు గొలిపి ఆలోచించుకునేట్టు చెయ్యాలి. అప్పుడే
మనిషి మనిషిలా బతుకుతాడు” అంది పెద్దమ్మ.