గమ్మత్తు కథ



రాత్రి భోజనాలయాయి. తాతయ్యతోపాటు వెన్నెలలో కూర్చున్నారు పిల్లలంతా.

“చెప్పుతాతా!” అన్నాడు బాబు,

“ఏమి చెప్పాలిరా?” అన్నాడు తాతయ్య బాబు బుగ్గలు నులిమి.

“గమ్మత్తు కథ” అన్నాడు బాబు.

“సరే వినండి” అని మొదలు పెట్టాడు.

అనగా అనగా ఒక ఊరుండేది. ఆ ఊళ్లో తళతళ అనే పిల్ల ఉండేది. ఆ పిల్లను వాళ్ల అమ్మానాన్నా చాలా ముద్దుగా పెంచుతున్నారు. ఒకనాడు ఆ పిల్ల ఆడుతూ, ఆడుతూ ఊరి బయటకు వెళ్లింది. అక్కడ పెద్ద కొండరాయి ఉంటే దానిమీద కూర్చుంది. ఆ రాతిపైన చిన్న బిరడాలాగా ఏదో కనుపించింది. తళతళకు తీసి చూడాలనిపించింది. ఆ బిరడాను అటూ ఇటూ తిప్పింది. వెంటనే రకరకాల సంగీతం వినిపించింది. తళతళ ఆశ్చర్యపోయి మళ్లీ తిప్పింది. ఈసారి ఆ బిరడా కాస్తా లోపలికి దిగిపోయి ఒక రూపాయి కాసంత కన్నం కనిపించింది.

ఆ కన్నంలోకి తొంగి చూచింది. దాంట్లో తనంత పిల్లలిద్దరు మంచి మంచి అందమైన బట్టలు తోడుక్కుని చక్కని రకరకాల బొమ్మలతో సంతోషంగా ఆడుకుంటున్నారు. “ఆ పిల్లలు అంత చిన్న కన్నంలోంచి లోపలకు ఎట్లా దిగారా?” అని ఆలోచించింది తళతళ.

కాసేపటికి వాళ్లనే అడగాలనిపించి కేకవేసింది ఏయ్‌ అమ్మాయిలూ అని. వాళ్లాకేక వింటేగా! దగ్గరపడి ఉన్న కొన్ని గులకరాళ్లను తీసుకుని ఒక్కొక్కటే ఆ కన్నంలో నుండి వేసింది. మూడు రాళ్లు పడ్డ తరువాత లోపల ఉన్న పిల్లలు ఇద్దరూ పైకి చూశారు.

వాళ్లు పైకి చూడగానే “లోపలికి నేనుకూడా రావచ్చా?” అని వాళ్లను అడిగింది తళతళ.

“ఓ! రావచ్చు కాని మాలాగా బుద్ధిమంతురాలివైతేనే రానిస్తాం” అన్నారు వాళ్లు.

“నేను కూడా బుద్ధిగా ఉంటా. ఆ బొమ్మలతో ఆడుకోనిస్తారా?” అన్నది తళతళ. అట్లాగే రా అంటూ వాళ్లు నేలపైన ఒక బిరడాను నొక్కారు. వెంటనే తళతళ కూర్చున్నచోట పెద్ద తలుపు తెరుచుకుని లోపలకు దిగేటందుకు మెట్లు కనిపించాయి. ఆ మెట్ల మీదనుండి దిగి ఆ పిల్లల దగ్గరకు వెళ్లింది తళతళ.

వాళ్లను “మీ పేర్లేమిటి?” అని అడిగింది. అందులో ఒక పిల్ల “నా పేరు కలకల దాని 'పేరు కళకళ” అన్నది.

వాళ్లు ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నారు. తరువాత కళకళ అన్నది. “మా దగ్గరకు వచ్చావు కదా, నువ్వు మా బొమ్మలన్నీ చూస్తావా?”

“చూపిస్తారా? నాకు బొమ్మలంటే ఎంతో ఇష్టం” అన్నది తళతళ.

వాళ్ళు తళతళకు రకరకాల బొమ్మలు చూపించారు. గుడ్డ బొమ్మలూ, అట్ట బొమ్మలూ, గుడ్డ పువ్వులూ, ఊలు బొమ్మలూ, మట్టి బొమ్మలూ, రకరకాలవీ, రంగురంగులవీ చూపించారు. తళతళ “మీకివన్నీ ఎక్కడనుంచి వచ్చాయి?” అని అడిగింది.

వాళ్ళు “మేమే చేసుకుంటాం, మాకు కావలసిన అట సామానులన్నీ” అన్నారు. తళతళ వాళ్లను “ఇంత చక్కని బొమ్మలు చేసుకోవడం ఎలాగా?” అని అడిగింది. కలకల, కళకళ "పాపం ఈ అమ్మాయికి ఈ బొమ్మసామాన్లు చేసుకోవడం నేర్పాలి” అనుకున్నారు.

తళతళ రోజూ “ఆడుకుని వస్తానని” వాళ్ళమ్మతో చెప్పి, కొంత అడుగున ఇంట్లో ఉన్న అమ్మాయిల దగ్గరకు వెళ్లేది. వాళ్ల ముగ్గురికీ స్నేహం బాగా కలిసింది.

మొదట కాగితాలు, మెంతులూ నానపెట్టి, రుబ్బి, ఆ గుజ్జుతో పళ్ళూ కాయలూ, బుట్టలూ బొమ్మలూ చెయ్యడం చూపించారు. తరువాత, మట్టితో బొమ్మసామాను చేసి రంగు వేయడం నేర్పారు. ఆఖరున రంగుకాగితాలతోటి పువ్వులూ బుట్టలూ చేయడం, గుడ్డ బొమ్మలూ, బొమ్మగుడ్డలూ అందంగా కుట్టడం నేర్పారు. కలకల, కళకళ బాగా చేసేవారు. తళతళ కూడా చాలా బాగా చెయ్యడం నేర్చుకుంది.

ఒకసారి తళతళ తండ్రికి జబ్బు చేసింది. ఉద్యోగంలోకి పోలేక ఇంట్లోనే ఉండిపోయాడు. అందుకని ఆయనకు ఆరు నెలలు జీతం రాలేదు. తళతళ తల్లి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడింది.

అప్పుడు తళతళ తను కలకల, కళకళ వద్ద కష్టపడి నేర్చుకున్న పనితోటి రకరకాల బొమ్మలు చేసి అమ్మి డబ్బుతెచ్చి తల్లికిచ్చింది. తళతళ తల్లీ తండ్రీ చాలా సంతోషపడ్డారు.

గారాబంగా పెంచినా బుద్ధిమంతురాలే ఐంది. తండ్రికి జబ్బు తగ్గేదాకా తళతళ అలా డబ్బు సంపాదించింది.

తండ్రికి జబ్బు తగ్గి మళ్ళీ ఉద్యోగంలో చేరేదాకా తళతళ తన స్నేహితుల దగ్గరకు పోలేదు. “ఏమో మన స్నేహితురాలు రావడంలేదు” అని వాళ్లు రోజూ అనుకునేవారు. ఇట్లా ఉండగా ఒకరోజు ఎంతో సంతోషంతో వచ్చి, వాళ్లు తనకు నేర్పిన పని తనకు ఎంత ఉపయోగించిందో చెప్పింది. వాళ్లు కూడా సంతోషించి, “నువ్వు బుద్ధిమంతురాలివి కాబట్టే, మేము నీకు నేర్పాం” అని అన్నారు.

“తరువాత వాళ్లంతా నిద్రపోయారు, మనని కూడా నిద్రపొమ్మన్నారు” అన్నాడు తాతయ్య.

Responsive Footer with Logo and Social Media