అసూయ



ఇంజనిరుగారబ్బాయి తన కొత్తసైకిలు బడిలో క్లాసు బయట తాళం వేసి వదలి క్లాసు కెళ్లాడు. అతను వెళ్లిన అరగంటకు మాస్టర్ అబ్బాయీ తన పాత సైకిల్ని తోసుకుంటూ ఒక విసురున క్లాసు బయట వదిలేసి తన వాచీ చూసుకుని లోపలికి పరుగుతీశాడు.

పాతసైకిలు కొత్తసైకిలు వైపు చూసింది. కొత్త సైకిలు, భలేమెరిసిపోతూ అందంగా కనిపించింది. ఇందాకా ఇంజనీరుగారబ్బాయి దాన్ని నడుపుతుంటే తనను దాటేసి చకచకా ఎలా వెళ్లిందో గుర్తు తెచ్చుకొని పాతసైకిలు అసూయతో కుళ్లి ఏడ్చింది.

కొత్తసైకిలు “ఏం ఏడుస్తున్నావా? మీ మాస్ట్రారబ్బాయి నిన్ను విసిరేసినప్పుడు నీకు దెబ్బలేమైనా తగిలాయా?” అని అడిగింది.

అసలే అసూయతో కుళ్లుతున్న పాత సైకిలుకి ఒళ్లు మండిపోయింది. “తన గొప్పదనం వెల్లడి చేసుకోవాలని నాతో మాట్లాడుతోందిది. నేనసలు దీంతో మాట్లాడనే మాట్లాడను.”

అనుకుని కళ్లు తుడుచుకుని నీరసంగా పడుకుంది.

కొత్తసైకిలు మళ్లీ పలకరించింది. “ఏం, మీ యజమాని నిన్ను తిట్టాడని మనసు కష్టపెట్టుకున్నావా? అయినా నీ తప్పేముంది? ఇన్నాళ్లనుండి వాళ్ళకు నువ్వు చాకిరి చేస్తుంటే కాస్త టైరు మార్చించి రంగు వేయించి నిన్ను జాగ్రత్తగా వాడాలని వాళ్ళకు తెలియొద్దూ?”

“అవన్నీ చేస్తే నువ్వు బడికి త్వరగానే వచ్చేదానివిగా?” అని ఓదార్పుగా అంది కొత్తసైకిలు.

ఈ ఓదార్పు మాటలతో పాతసైకిలుకి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది.

“నువ్వు చెప్పినట్లు నన్ను వాళ్లు ఎప్పుడూ జాగ్రత్తగా వాడరు. ఇంట్లో పిల్లలందరూ నన్ను రోజంతా తిప్పి ఇష్టమొచ్చినట్లు వాడేసి నా రంగంతా పోగొట్టి డొక్కులాగా చేశారు. నా వయస్సు ఇంకా ఐదేళ్లయినా లేదు. అప్పుడే ముసలితనం వచ్చేసింది. ఇందాక బయటికి తెస్తూ మా యజమాని నన్ను నానా మాటలూ అన్నాడు. నేను పాతడొక్కునట. రోజూ బడికి ఆలస్యంగా తీసుకువెళ్తానట. దారి పొడుగునా నన్ను ఎత్తిపడేస్తూ తీసుకొచ్చాడు. నీకేం, అదృష్టవంతురాలివి. మెరుపులాగా నడుస్తావు. నిన్ను, మాయకుండా మీ యజమాని అపురూపంగా చూసుకుంటాడు. నిన్నెప్పుడూ తిట్టడు” అని తన అసూయను పైకే కక్కేసింది పాత సైకిలు.

నువ్వు మాత్రం నడవలేవా మెరుపులాగా, నా వయస్సు రెండేళ్ళే అయినా ఐదేళ్ళనాటి నీ మెషీను చాలా మంచిది. అందుకని నాకంటే నువ్వేబాగా నడవగలవు. నీకు కొత్తటైర్లు వేసి నూనెరాసి రంగు పూయిస్తే నాకన్న నువ్వే అందంగా తయారై నాకన్నా త్వరగా పోగలవు తెలుసా?” అన్నది కొత్తసైకిలు.

చిన్నవాళ్లెప్పుడూ అమాయకంగానే ఉంటారు. పాతసైకిలు వయస్సులో పెద్దదైనా మొదట తనకన్నా మూడేళ్ళు చిన్నదైన కొత్త సైకిల్ని చూసి అసూయ పడిపోయింది. తరువాత కొత్తసైకిలు మనసు మంచిదని గ్రహించింది.

“అనవసరంగా అసూయ పడ్డాను' అనుకుంది. కొత్త సైకిలుతో కాస్త మాట్లాడి మనసు తేలిక పరచుకోవాలనుకుని “చూడు నువ్వు చెప్పినట్టు నాకు టైర్లు మార్చించి రంగులు వేయిస్తే బాగుండును కాని మా యజమానికి నేనంటే శ్రద్ధలేదు. నేనేం చేసేది?” అని అడిగింది, ఏడుపు ఆపుకుంటూ.

“మీ యజమానికి మా యజమాని చెప్తాడులే, నువ్వేడవకు” అని సముదాయించింది కొత్తసైకిలు.

ఇంజనీరుగారబ్బాయి క్లాసు బయటికొచ్చి “శ్రీనూ ఇవ్వాళ బడికి అరగంట ఆలస్యంగా వచ్చావెందుకూ?” అని మాస్ట్రారబ్బాయిని అడిగాడు తన కొత్తసైకిలు తాళం తీస్తూ.

“ఏం చెప్పేదిరా రవీ, నీకు మంచి సైకిలుంది. నా వెధవ సైకిలు పాతడొక్కైంది. మా నాన్న కొత్తది కొనమంటే, “మళ్లీ ఏడాది కొంటాలే” అంటారు. దారి పొడుగునా దీంతో తిప్పలే నాకు. రోజూ విరిచి ముక్కలు చెయ్యాలని అనిపిస్తుంది నాకు” అన్నాడు శ్రీను కోపంతో,

ఈ మాటలు విని పాతసైకిలు భయంతో ఒణికిపోయింది. కొత్తసైకిలు దానికి సంజ్ఞ చేసి ఓదార్చింది.

“అదేమిటి శ్రీను అంత మంచి సైకిల్ని వాడుకోవడం చేతకాక, పైగా దాన్ని తిడుతున్నావా? నాలుగొందలు పెట్టి కొత్తసైకిలెందుకురా? దీనికో పాతికో ముప్పయ్యో రూపాయలు ఖర్చుచేసి టైర్లు మార్చించి అయిలింగు చేయించి రంగు వేయించు నా సైకిలుకన్నా కూడా నీదే బాగుంటుంది” అన్నాడు రవి.

శ్రీనుకి రవి మాటలు నచ్చినై. అతను పాత సైకిలుని జాగ్రత్తగా తీసుకెళ్ళి కొంచెం డబ్బు ఖర్చుపెట్టి సరి చేయించాడు.

ఒక రోజున శ్రీనూ, రవీ పక్క పక్కగా సైకిళ్లు తొక్కుతూ సంతోషంగా బడికి వెళ్తున్నారు.

కొత్తసైకిలు పాతసైకిలుతోటంది, “నువ్వు ఆస్పత్రి నుంచెప్పుడొచ్చావు? నిన్ను చూసి నేను గుర్తే పట్టలేదు! ఎంత అందంగా ఉన్నావిప్పుడు! మహా వేగంగా నడిచేస్తున్నావే!” అని పలకరించింది.

“అవును నువ్వు చాలా మంచి దానివి. నన్ను నువ్వు (ప్రేమగా పలకరించి నేనేడ్చినప్పుడు నన్ను ఓదార్చావు. నేను చాలా చెడ్డదాన్ని ముందు నిన్ను చూసి అసూయ పడ్డాను. ఇప్పుడు నువ్వెంత మంచిదానివో నాకు తెలిసి వచ్చింది. మీ యజమాని మా యజమానికి నచ్చచెప్పాక నన్ను అస్పత్రిలో చేర్చి, పాడైన భాగాలను తీయించి కొత్తవి వేయించి, రంగులు పూయించాడు. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అంతా నీ చలవే” అన్నది కొత్త రూపంలో మెరిసిపోతున్న పాతసైకిలు.

అప్పటి నుండీ పాతసైకిలు ఎవ్వర్నీ చూసి అసూయపడరాదని గుణపాఠం నేర్చుకుంది.

Responsive Footer with Logo and Social Media