మాట విలువ
రవి ఎనిమిదేళ్ళ పిల్లవాడు. అతని తండ్రి రమణరావు. రమణరావుగారు వ్యవసాయ
శాఖలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. వాళ్లిల్లు చాలా చిన్నది. అద్దెలు ఎక్కువ పెట్టలేక జీతం
పొదుపు చేసుకుని మూడొందల గజాల భూమి కొనుక్కున్నారు. దాని మీద చక్కని పాక
వేయించారు. ఆయన భార్య జ్యోతి, ఆ పాకను ఎంతో అందంగానూ పరిశుభ్రంగానూ
ఉంచుతుంది.
ఆ పాకను పాక అనలేం. అది ఒక అందమైన పెంకుటింటిలా ఉంటుంది. ఆ
ఇంటిచుట్టూ రకరకాల పూలమొక్కలున్నై. ఈ పూలతోట ఆ ఇంటికి ఎంతో అందాన్నిచ్చింది.
ఆ చక్కని ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటాడు చిన్ని రవి.
ఒకరోజున రమణరావుగారు ఉదయమే బటికిపోతూ “రవీ అమ్మను జాగ్రత్తగా చూడు,
ఏదైనా పని చెప్తే చేసి సహాయపడు. నేను రెండు రోజులదాకా ఎగ్జిబిషనులో పని చెయ్యాలి
కాబట్టి ఇంటికి రాలేను అని చెప్పారు.
“సరే నాన్నా నేను అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాను” అని రవి మాటిచ్చాడు.
ఆ రోజు శుక్రవారం. తండ్రి వెళ్లిన తరువాత తల్లి వంట చేస్తుంటే అన్నిట్లో
సహాయపడ్డాడు. ఇల్లు సర్దుతుంటే సామాన్లన్నీ అక్కడి నుండిక్కడికీ ఇక్కడ నుండక్కడికీ
అందించాడు. వాడిని చూస్తే చాలా ముచ్చటనిపించింది జ్యోతికి. అందుకని “రవీ రేపు
సాయంకాలం నిన్ను ఈ ఊరి పెద్ద తోటకు తీసుకెళ్తాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. ఆ
తోట నీ కిష్టం కదా అని అక్కడికి తీసుకెళ్తాను” అన్నది తల్లి.
రవి సంతోషానికి పట్టపగ్గాలులేవు.
శనివారం నాడు ఉదయం భోజనాలైనాక సాయంత్రం తోటలో సరదాగా తినడానికి
పిండివంటలు చేసింది జ్యోతి. రవి కాగితపు సంచులలో వాటిని జాగ్రత్తగా పొట్లాలు కట్టి
బుట్టలో సర్టిపెట్టాడు. ఇద్దరూ మూడు గంటలకల్లా పెద్ద తోటకు బయల్దేరారు. బస్సులో
పోవాలని అటునడిచారు. అప్పుడే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నై. వర్షం వస్తుందేమో
పోనీ మానేద్దామా పోవడం అని మనస్సులోనే అనుకుని మళ్లీ చిన్న రవి సంతోషాన్ని
పాడుచెయ్యడం ఇష్టం లేక బస్సులో వాడిని ఎక్కించి తను ఎక్కింది.
తోటలో తిరిగి చాలాసేపు ఆడుకున్నాడు రవి. అక్కడ రకరకాల ఆకులుంటే మాలీల
నడిగి తన హెర్బేరియంలో కని బుట్టలో జాగ్రత్తగా వేసుకున్నాడు. అప్పుడే తల్లి పిలిచి “రవీ
ఐదున్నరైంది ఫలహారం, టీ తీసుకుందామా?” అన్నది.
రవి పరుగు పరుగున చేతులు కడుక్కుని వచ్చాడు. వాడికి బాగా ఆకలిగా కూడా
ఉంది. వాడు తింటూ ఉండగా సన్నని చినుకులు ప్రారంభమైనై. తినడం అయినాక జ్యోతి
చెయ్యి కడుక్కోవడానికని ఒక నీళ్ల కుండీ దగ్గిర కెళ్లింది. ఈలోగా చినుకులెక్కువైనై.
తొందరలో వస్తూ కాలుజారి పడిపోయిందావిడ.
రవి “అమ్మా” అని కేకవేసి తల్లి దగ్గిర కెళ్లాడు. తల్లి కళ్లు మూసుకుని పడి ఉంది. రవి
ఆవిడ ముఖమ్మీద తన చిన్న చెయ్యివేసి “పడ్డావా అమ్మా? నేను లేవతియ్యనా?” అని ప్రేమగా
అడిగాడు.
జ్యోతి మెల్లిగా కళ్లు తెరిచి బిక్కముఖం వేసుకున్న కొడుకును చూసి, ఎలాగైనా లేవాలని
(ప్రయత్నించింది “అబ్బా” అని మళ్లీ పడుకుంది.
“రవీ, నేను లేవలేను బాబూ, కాలు బాగా బెణికింది. నువ్వు వెళ్లి త్వరగా మన డాక్టరు .
ప్రసాదరావుగారిని పిలుచుకొస్తావా? వాళ్లిల్లు ఈ తోటపక్క సందులోనేగా?” అన్నది.
రవి “సరే ఇప్పుడే వెళ్తాను” అని బయల్దేరాడు. వాన బాగా ఎక్కువైంది. తోట పెద్దగేటు
దాటి డాక్టరుగారింటికి పోవాలి. విపరీతమైన వానతోపాటు తోట బయటికెళ్లేసరికి చీకటి
కూడా పడింది. ఆ పక్కసందులో మరీచీకటిగా ఉంది. అందాకా వెళ్లాక వాడికి భయమేసింది.
వెనక్కి పోవాలనుకున్నాడు. కాని తల్లి బాధతో వానలో పడుకుని ఉన్న సంగతి గుర్తుకొచ్చి,
ధైర్యంతో ముందుకు నడిచాడు.
(ప్రసాదరావుగారింటి ముందు లైటువేసి ఉంది. ఆయన భార్య కిటికీలోనుండి గేటు
తెరచుకుని వస్తున్న రవిని చూసి “ఏవండీ మన రమణరావుగారబ్బాయి ఒక్కడూ ఈ వానలో
వస్తున్నాడెందుకో” అని డాక్టరు గారికి ఒక కేకవేసి చెప్పింది.
డాక్టరు ప్రసాదరావు గారు గొడుగు వేసుకుని పరుగున వెళ్లి రవిని లోపలికి తీసుకొచ్చారు.
రవి తల్లి పడిపోవడాన్ని గురించి చెప్పాడు.
“నువ్వు లోపలికి పోబాబూ పక్కతోటలోనేగా నేను వెళ్లి చూస్తాను అని వాళ్ల ఆసుపత్రి
పనిమనిషి నరసమ్మను తీసుకుని తోటవైపు వెళ్లారు.
డాక్టరు గారి భార్య రవి తల తుడిచి వాడి బట్టలు మార్చి వాళ్లబ్బాయి బట్టలు తొడిగింది. .
వేడివేడి పాలు పట్టింది. కాసేపట్లో నరసమ్మ తన భుజం మీద ఆసరా ఇచ్చి జ్యోతిని
నడిపించుకుంటూ వచ్చింది. ఆ వేళకే డాక్టరుగారు కూడా వచ్చేశారు. రవి బుట్టలో దాచుకున్న .
రకరకాల ఆకులు కూడా జాగ్రత్తగా తెచ్చారు. ఆ రాత్రికి వాళ్ళు డాక్టరుగారింట్లోనే ఉన్నారు.
రవి డాక్టరుగారి అబ్బాయి మధుకి కూడా తను తెచ్చుకున్న ఆకుల్లోంచి కొన్ని ఇచ్చాడు.
ప్రసాదరావుగారు రమణరావు గారికి ఎగ్జిబిషను వద్దకు కబురు పంపి జరిగిన విషయం
తెలిపారు.
మర్చాటి ఉదయం పదిగంటల 'కల్లా రమణ రావుగారు డాక్టరుగారింటికి వచ్చారు.
డాక్టరుగారికీ ఆయన భార్యకూ వాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. వారంతా
ఒక ఊరివారే, కాబట్టి ఎప్పుడూ ఒకళ్ళ కొకళ్ళు సహాయంగా ఉంటూ ఉంటారు.
“మీ రవి అంత చీకట్లోనూ వానలోను వస్తే, మా ఆవిడ ఆశ్చర్యపోయిందనుకోండి,
రమణరావుగారు” అన్నారు డాక్టరుగారు.
“తీర వాడిని పంపేశాక, డాక్టరు గారొచ్చిందాకా నాకు కూడా ఆదుర్దా అనిపించిందండీ
ఆ వానలోనూ చీకట్లోనూ ఏమైపోయాడోనని” అంది జ్యోతి.
తండ్రి తన వంక చిరునవ్వుతో చూస్తే, “అమ్మని జాగ్రత్తగా చూడమన్నావు కదు
నాన్నా?” అన్నాడు రవి.