తమ్ముడు మంచివాడు
“తమ్ముడుపుడితే ఏడుస్తావెందుకే?” అన్నది అత్త, “అమ్మనన్ను ఎత్తుకోలేదు” అని
ఏడుస్తోంది ఛాయ. “ఐతే తమ్ముడిని నేను తీసుకుపోనా?” అని నవ్వుతూ అడిగింది అత్త,
మళ్ళీ అదీ ఇష్టం లేదు ఛాయ కు. “ఆ వద్దు” అన్నది. అత్త మళ్లీ నాలుగైదుసార్లు “నేను
తీసుకుపోతా” అన్నది. “వద్దు” అని అంతకంతకు గట్టిగా అన్నది ఛాయ. ఏడుపుకూడా
మరచిపోయింది.
అప్పుడే తమ్ముడిని స్నానం చేయించడానికి ఎత్తుకుంది ఛాయావాళ్ళ అమ్మ. “ఛాయా,
తమ్ముడు చూడు నీవంకే చూస్తున్నాడు” అన్నది నవ్వుతూ. తమ్ముడు ఛాయవంక చూశాడు.
ఛాయ కూడా నవ్వింది. తమ్ముడు బాగానే ఉన్నాడు. కాని తమ్ముడు పుట్టినప్పటి
నుంచి అమ్మ తనను ఎత్తుకోవడం లేదు. అందుకని “తమ్ముడిని దింపెయ్యి నన్నే ఎత్తుకో”
అని కాళ్లకు అడ్డువచ్చింది. “తప్పమ్మా నువ్వు పెద్దదానివి. తమ్ముడు చిన్నవాడు. వాడికి
ఆడుకోవడం కూడా చేతకాదు. చూడు అక్కయ్యవని నిన్నే ఆడించమంటున్నాడు. వాడి గిలకలూ
బొమ్మలూ అన్నీ నువ్వే తీసుకొని వాడికి ఆట నేర్చాలి” అన్నది వాళ్ళ అమ్మ. తమ్ముడు మళ్లీ
నవ్వాడు. ఛాయ గిలక వాయించింది. చేతులు కొట్టుకుంటూ చాలాసేపు నవ్వాడు తమ్ముడు.
“ఆ కీచు బొమ్మ నాది” అన్నది ఛాయ. “అన్నీ నీవే తమ్ముడికిచ్చి నువ్వే ఆడించు” అన్నది
అమ్మ.
“మరి తమ్ముడు లాక్కోడూ?” అని అడిగింది ఛాయ, “వాడింకా చిన్నవాడు. నీ దగ్గర
లాక్కోడు” అన్నది అమ్మ. నిజంగా ఛాయ బొమ్మలన్నీ తీసుకున్నా తమ్ముడు నవ్వుతూనే
ఉన్నాడు. “తమ్ముడు మంచివాడు” అని ముద్దు పెట్టుకుంది ఛాయ.
కాకరపువ్యు వత్తి
దీపావళి పండుగ వచ్చింది. గోపి, శ్రీను, చిట్టి, ఛాయ సాయంకాలమయేసరికి కొత్త బట్టలు తొడుగుకొని, ముస్తాబయి కూర్చున్నారు. వాళ్ళ నాన్న బజారు వెళ్ళారు ఎందుకో.
టపాకాయలు కొనేసి అప్పుడే నాలుగు రోజులైంది. వాటిలో కొన్ని కాలిపోయాయి
కూడా.
గోపికి పదేళ్లు, శ్రీనుకు ఎనిమిదేళ్లు, చిట్టికి ఐదేళ్లు ఛాయకు మూడేళ్లు. గోపి శ్రీనూ
“తాటాకు టపాకాయలు కాలుస్తామనీ” “సీమటపాకాయలు కాలుస్తామని” అని ఊరికే గంతులు
వెస్తున్నారు. చిట్టి “కారకరపువ్వువొత్తులు, మతాబాలు మాత్రమే కాలుస్తాను” అన్నది. అంతకన్న
పెద్దవి కాల్చడానికి భయమని ఒప్పేసుకుంది.
ఇక ఎటొచ్చీ ఛాయ మిగిలింది. దానికి అన్నీ కాల్చాలనే ఉంది. కాని ఇంకా చిన్నది
కనుక ఏది కాల్చడానికీ భయమే. అందుకని రోజల్లా దేనికో ఒకదానికి పేచీ పెడుతోంది.
పండుగ బట్టలు వేసీ వెయ్యడంతోటే ఏడువు మొదలు పెట్టింది. మొదట ఏదో
కుట్టిందనుకున్నారు. చాలాసేపు ఆడించి ఆడించి విసుగెత్తారు అంతా.
చిట్టిమాత్రం ఛాయను ఆడించాలనుకుంది. “చెల్లాయీ ఏంకావాలమ్మా” అని అడిగింది.
అప్పుడు చిట్టి గౌను మెడవంక చూపించి “అది నాకు లేదూ” అని మళ్ళీ కంఠం ఎత్తింది.
చిట్టి గౌనుకు నీలం అంచు కుట్టాడు దర్జీవాడు. ఛాయ గౌనుకు కుట్టలేదు. ఛాయ
చూపించి ఏడ్చేదాకా అది ఎవ్వరూచూడలేదు. అప్పుడంతా ఒక్కసారి నవ్వుకుని “నీలం రంగు
అంచువల్ల చిట్టి గౌను ఏమీ బాగాలేదు. నీ గౌనే చాలా బాగుంది.” అని నచ్చచెప్పారు.
ఛాయ సందేహంతో చిట్టివంక చూసింది. చిట్టికూడా నవ్వుతూ ఒప్పుకుంది. అప్పటితో
ఛాయపేచీ తీరింది.
ఆవేళ సాయంకాలం ఎవరో స్నేహితులూ, చుట్టాలూ చూడవచ్చారు. వాళ్ళ ఇంటికి.
ఛాయ, వాళ్ళ అమ్మ చాటున దాక్కుంది. సిగ్గు వేసి.
కాసేపుండి లోపలికి పోయింది. ఇంకా కాసేపటికి గొల్లుమని ఛాయ ఏడుపు వినపడింది.
అంతా పరుగున లోపలికి వెళ్ళారు. ఛాయ ఒక ఖాళీ బిందెలో దిగి నుంచుని ఉంది. పైకి
రాలేక ఏడుస్తోంది. వాళ్ళమ్మ మెల్లగా పైకితీసి ఎత్తుకుని ముద్దు పెట్టుకోగానే ఏడుపుమాని
సిగ్గుతో తలవంచుకుంది ఛాయ.
ఇళ్ళల్లోను, వీధులలోను ప్రమిదలు వెలిగించారు అంతా. ఎంతో అందంగా ఉంది.
ఆరు గంటలు దాటింది. టపాకాయల సంబరం మొదలైంది. అంతా అన్నీ వెలిగిస్తున్నారు.
ఛాయ కాకరపువ్వువత్తి ఒకటి వెలిగించింది. దాని పువ్వులు చిందటం చూచి ఆమెకు భయం
పట్టుకుంది.
కాని కాకరపువ్వువత్తి పారవేస్తుందేమో అంటే పార వెయ్యదు. ఏడుపు మాత్రం మొదలు పెట్టింది. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి భయం లేదులే అమ్మా, ఆ పువ్వులు కాలవు, ఇదిగో చూడు అని చేతి మీద ఆ పువ్వులు పడేటట్టు చెయ్యిచాపారు. ఛాయ ఆశ్చర్యంతోటి ఆనందం తోటి చూసింది. వరసగా ఎన్నో పువ్వు వత్తులు కాల్చేసింది.