రవి
రవి మనస్సు అదో మాదిరిగా ఉంది ఆ రోజు. ఉదయం బడికి పోయిన వెంటనే
ఇద్దరు తోటిపిల్లలను కొట్టి వారి వద్దనున్న నేరేడు పండ్లను లాక్కుని తిన్నాడు. వారు ఏడుస్తూ
వెళ్లి క్లాసు టీచరుకి చెప్పారు. క్లాసు టీచరు చేత చీవాట్లు తినడం దైనందిన కార్యక్రమంలో
ఒక భాగమే రవికి. అతనిది ఐదో క్లాసు. ఆ క్లాసు టీచరు సుగుణమణి చెప్పగలిగినంతగా
చెప్పేది అల్లరి మానమని. తుదకు ఆ రోజు రవి అల్లరిని గూర్చి ప్రధానోపాధ్యాయురాలు
వద్దకు వెళ్లి విన్నవించింది. ప్రధానోపాధ్యాయురాలు రవి కోసం క్లాసుకు కబురు పంపింది.
సుగుణమణితో (ప్రధానోపాధ్యాయురాలి వద్దకు పోతున్నానని చెప్పి తిన్నగా బడి వదిలి ఇల్లు
చేరుకున్నాడు రవి.
ఉదయం పదకొండు గంటలకే ఇల్లు చేరిన రవిని తల్లి అడిగింది కారణమేమని -
అసలు కారణం చెప్పకుండా ఒంట్లో బాగులేదని తల్లితో అబద్ధమాడాడు. తల్లి ఒళ్ళు పట్టిచూసి,
ఒంట్లో ఎందుకు బాగులేదని అడిగింది. కళ్లలో నీళ్లు తిరిగి తలనొప్పిగా ఉన్నదని అన్నాడు.
తల్లి జాలిగా చూసి 'రవీ, మనస్సు బాగా లేదా నాయనా? బళ్లో అల్లరిగాని ఏమైనా చేశావా?”
అని అడిగింది. రవి మాట్లాడకుండా కళ్లు మూసుకుని పడుకున్నాడు. తల్లి వంట ఇంటిలోకి
పని ఉండి వెళ్లింది. రవి, తల్లి అవతలకు పోవడం చూసి మనస్సులో బాధ పోయేదాకా
వెక్కివెక్కి ఏడ్చాడు.
సాయంకాలం తండ్రి ఇంటికి వచ్చాడు. వస్తూనే “రవీ నీకొక మంచి ఇంగ్లీషు బొమ్మల
పుస్తకం కొనుక్కొచ్చానురా. అది చదవటం నేర్చుకుంటే ఇంగ్లీషులో మాట్లాడటం కూడా
వస్తుంది” అన్నారు.
రవి ఇంకా పడుకునే ఉండటం చూసి, “ఒంట్లోగాని బాగాలేదా నాయనా?” అంటూ
రవి మంచం దగ్గరకు వచ్చి “ఏడిచావెందుకు?” అని ఆదుర్దాతో అడిగారు. దాంతో రవి పైకి
ఏడ్చేశాడు. తల్లి లోపలి నుండి వచ్చి ఆ రోజు రవి ఉదయం పదకొండింటికే వచ్చాడనీ,
వచ్చినప్పటినుండీ తలనొప్పిగా ఉందని అలాగే పడుకొని ఉన్నాడనీ చెప్పింది.
తండ్రి గ్రహించాడు. రవి బళ్ళో ఏదో చేసి ఉంటాడని. ఆ విషయం ఏమీ కదపకుండా
ఆ పూటకు ఊరుకున్నాడాయన. రాత్రి భోజనానికి రమ్మని తల్లీ తండ్రీ పిలిచి తినిపించారు.
మర్నాడు ఉదయం నిద్రలేచిన రవికి ఒకటే దిగులు. బడికి వెడితే క్లాసుటీచరు
అడుగుతుంది. అబద్ధం ఆడి ఇంటికి వెళ్లిపోయావెందుకని. బడికి వెళ్ళకపోతే అమ్మానాన్న
బడికెందుకు వెళ్ళవని అడుగుతారు. ఆలోచించి కాసేపటికి తల్లి వద్దకు వెళ్లి “అమ్మా నేను
బడికి ఇవ్వాళ కూడా పోనే, రేపు వెళ్తాను” అన్నాడు. “పోనీలే బాబూ రేపే వెళ్ళు” అని తల్లి
మళ్లీ రవి దగ్గరగా వచ్చి “నాయనా బళ్లో అల్లరిచేస్తే నిజం చెప్పు అంతేగాని బడిమాని
అబద్ధాలాడవద్దు. నాన్నగారు చూడు ఎంత మంచివారో నిన్ను ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు.
మనపక్కింటి చంద్ర తండ్రిని చూస్తున్నావుగా, రోజూ చంద్రాన్ని కొడుతూ ఉంటారు. ఇవాళ్టికి
మాత్రం అడుకుని రేపటి నుండీ బడికి తప్పకుండా పోవాలి బాబూ” అని బుజ్జగించింది. రవి
తన క్లాసు పుస్తకాలు ముందు వేసుకుని శ్రద్ధగా చదువుతూ కూర్చున్నాడు. రవి తండ్రి
మామూలు (ప్రకారం పది గంటలకల్లా భోజనం చేసి ఆఫీసు బట్టలు వేసుకుని బయటికి
వెళ్లారు. రోజూ ఆఫీసు నుండి సాయంకాలం ఆరుగంటలదాకా ఇంటికి రానేరారు. కాని ఆ
రోజున పదకొండింటికల్లా ఇంటికి వచ్చారు. రవితో ఏమీ మాట్లాడలేదు. రవి తల్లిని పిలిచి
ఆదుర్దాగానూ, రహస్యంగానూ పది నిమిషాలు మాట్లాడి మళ్ళీ వెళ్లిపోయారు.
మర్చాటి ఉదయం రవికి తల్లి తొమ్మిదింటి కల్లా భోజనం పెట్టింది. రవి తండ్రి కూడా
త్వరగా భోజనం చేసి ఆఫీసు బట్టలు వేసుకుని తనతో కూడా వెంటబెట్టుకుని రవిని బడివద్దవదలి
వెళ్లిపోయారు.
బడిలో ప్రార్ధన గంట కొట్టే లోపుగా రవి బిక్కముఖంతో ఒక చెట్టుకింద కూర్చుని
క్లాసుటీచరుకు ఎటువంటి సమాధానం చెప్పాలో ఆలోచించుకుంటున్నాడు. అసలు అల్లరే
చెయ్యకపోతే ఈ బాధ ఉండకపోనుగదా అని విచారిస్తున్నాడు. ప్రధానోపాధ్యాయురాలు
దగ్గరనుండి ప్యూను వచ్చి రవి ఎదురుగా నిలిచి “పెద్దమ్మగారు నిన్ను పిలుస్తున్నారు బాబూ”
అని పిలిచాడు. వాడిని చూడడం తోటే భయపడ్డ రవికి ఇంకా హెడ్‌మిస్టరెసస్ పిలిచిందనడంతో
కాళ్లల్లో వణుకు పుట్టింది. అయినా ప్యూనుతో ప్రధానోపాధ్యాయురాలి గదిలోకి వెళ్లాడు.
ప్రధానోపాధ్యాయురాలు సుశీలాదేవి రవిని ఒక్కసారి చిరునవ్వుతో పరికించి చూసింది.
రవి కళ్లల్లో నీరు నిలిచి ఉంది. “రవీ, నాకు నమస్తే చెప్పావా ఇప్పుడు?” అన్నది. అప్పుడు
నమస్కారం పెట్టలేదని గుర్తుకొచ్చి తల దించుకున్నాడు రవి. “చూడు రవీ, నువ్వు బళ్లో
ఎక్కువగా అల్లరి చేస్తున్నావట. మీ టీచరు సుగుణమణి గారు మీకు (ప్రేమతో పాఠాలు
చెప్తారు. ఆమెను అందరు పిల్లలకంటె ఎక్కువగా నువ్వు విసిగించేశావట. బడికి రావడం
అబద్ధాలాడి అల్లరి చెయ్యడానికా? లేక చదువునేర్చి బుద్ధిమంతుడవడానికా? చెప్పు” అని
రవి వంక చూసింది సుశీలాదేవి. రవి తల ఎత్తి భయంగా ఆమె ముఖంలోకి చూశాడు.
“నాకు జవాబు చెప్పురవీ” అన్నదామె గంభీరంగా మళ్లీ.
“చదువుకుని బుద్ధి నేర్చుకోడానికే బడికి రావాలండీ” అన్నాడు నెమ్మదిగా.
(ప్ర. ఉ. - అయితే నువ్వు మూర్తినీ వాళ్ల తమ్ముడు గోపీనీ కొట్టి వాళ్లు బడితోటలో
కోసుకున్న నేరేడు పండ్లను తినేశావటగా? నిజమేనా?
రవి - అవునండి.
(ప్ర. ఉ. - అట్లా చెయ్యడం తప్పుకాదూ?
రవి - వాళ్లిద్దరూ అంతకుముందు నేనొకసారి మంచి నేరేడు పళ్లుకోసుకుంటే లాక్కుని
తినేసి వెక్కిరించారండి.
(ప్ర. ఉ. - అందుకని నువ్వు తిరిగి వాళ్లను ఏడిపించావా?
(రవి మవునంగా అవునని తల ఊపాడు)
(ప్ర. ఉ. - వారం రోజుల క్రితం సరళ అనే మీ తరగతి అమ్మాయిని జారుడు బండ
మీద నుండి పడేశావటగా? అప్పుడు ఆ పిల్ల చెయ్యి విరిగిందటగా?
రవి - సరళ నేను బండ ఎక్కిన తరువాత వచ్చి, చప్పున నా మీద పడబోయిందండి.
నేను పడిపోయానేమోనని ఆమెను తోశానండి. ఆమె చెయ్యి విరిగిందని తెలిసిందండి.
(ప్ర. ఉ. - నెల రోజుల నాడు లక్ష్మి అనే అమ్మాయిని కొట్టి రెండణాల బిళ్లను ఆమె
వద్దనుండి కాజేశావటగా?
రవి - లక్ష్మిని కొట్టి రెండణాల బిళ్ల లాక్కున్నానండి. కాని కాజేయలేదండి.
ప్ర. ఉ. - లాక్కోవడం అంటే కాజేయడం కాదా?
రవి - ఆ రెండణాల బిళ్ల మరొక చిన్నమ్మాయి దండి. లక్ష్మి ఆ చిన్నమ్మాయి దగ్గర
నుండి లాక్కుంటే ఆ చిన్నపిల్ల ఏడ్చిందండి. అందుకని లక్ష్మిని కొట్టి ఆ చిన్నపిల్లకు ఆ
రెండణాలబిళ్ల ఇచ్చేశానండి.
ప్ర. ఉ. - రవీ నువ్వు నిజం చెప్పావు సంతోషం కాని బళ్లో పిల్లలు ఏదైనా పొరపాటు
చేస్తే నువ్వు కూడా పిల్లవాడివే కదా వారిని నువ్వు శిక్షించడం తప్పుకదూ?
రవి - మరేం చెయ్యాలండి?
ప్ర. ఉ. - మీ క్లాసు టీచరుకు చెప్పాలి. ఆమె వినకపోతే నాకు చెప్పాలి. ఆ విషయం
మేమే చూసుకుంటాం. నిన్ను మూర్తీ అతని తమ్ముడు గోపీ వెక్కిరించి నీ నేరేడు పళ్లు
కాజేసినప్పుడు నువ్వు మీ టీచరు సుగుణమణి గారికి చెప్పావా?
రవి - లేదండి. నేను ఎవ్వరికీ చెప్పలేదండి. చెప్పినా కూడా నేనే అల్లరి పిల్లవాడినని
అందరూ చూసినా చూడకపోయినా కూడా నా మీదే చాడీలు చెప్తారండి (ఏడుపు వచ్చినట్లు
మాట్లాడాడు.
ప్ర. ఉ. - (రవిని బుజ్జగించి జాలిగా చూడు రవీ ఇతర పిల్లలు నిన్ను ఏడిపించి
అల్లరి చేసినప్పుడు నువ్వు పెద్దవారికి చెప్పలేదు. వాళ్లను నీ ఇష్టప్రకారం కొట్టినప్పుడు వాళ్లు
వచ్చి మాకు అంటే పెద్దవాళ్ళకు చెప్పారు. అందుకని నేనూ సుగుణమణిగారూ కూడా నువ్వే
అల్లరివాడివని అనుకుంటున్నాం. ఇక ముందెప్పుడూ ఏం జరిగినా నువ్వు పిల్లలను కొట్టడం
అదీ మానుకోవాలి.
రవి - వాళ్ళు నన్ను కొడితే నేనేం చెయ్యాలండి?
ప్ర. ఉ. - సుగుణమణిగారికి గాని నాకు గాని చెప్పాలి.
రవి - అలాగేనండి.
ప్ర. ఉ. - మరి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు?
రవి - ఎప్పుడు ఆడానండి?
ప్ర. ఉ. - మొన్న మీక్లాసు టీచరుతో నా వద్దకు పోతున్నట్లు చెప్పి ఇంటికి
వెళ్లిపోయావటగా?
రవి - అవునండి. మొన్న రామూ, గోపీ కలిసి నన్ను మీరు కొడతారని భయపెట్టారండి.
అందుకని తప్పించుకు పారిపోయానండి.
(ప్ర. ఉ. - తప్పుచెయ్యడం మానెయ్యాలి గాని తప్పించుకుపోవడం చెడ్డపిల్లల లక్షణం
కాదూ? మరి ఇంట్లో అమ్మగారికి నాన్నగారికి ఒంట్లో బాగులేదనీ తల నొప్పిగా ఉందనీ చెప్పి
నిన్న కూడా బడిమానేశావటగా?
రవి - (ఉలిక్కిపడ్డట్టు చూశాడు) ఇంట్లో అబద్ధం ఆడినట్లు మీకు ఎవరు చెప్పారండీ?
(ప్ర. ఉ. - మీ నాన్నగారు నిన్నవచ్చి అన్ని విషయాలూ తెలుసుకుని వెళ్లారు.
తల్లిదండ్రులతో అబద్ధం ఆడటం తప్పు బాబూ ఎప్పుడూ అటువంటి పని చెయ్యకు. నాన్నగారితో
రేపు నన్ను కలవమని చెప్పు,
రవి - అలాగేనండి.
ఇంతలో రవి నాన్నగారే అక్కడికి వచ్చారు.)
ప్ర. ఉ. - రండి కేశవరావుగారూ. మీ రవితోటే ఇంతసేపటి నుండీ మాట్లాడు
తున్నాను. మీ పిల్లవాడు నేననుకున్నట్లు అల్లరివాడుకాడు. కాని అల్లరివాడని
అనిపించుకున్నాడు. వేరే పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు క్లాసుటీచరుకుగానీ నాకుగానీ
తెలపకుండా తనే కలగజేసుకున్నాడు. దాని బట్టి అంతా అల్లరిపిల్లవాడని రవికి పేరు పెట్టారు.
కొడితే తిరిగి కొట్టడం తప్పు పెద్దవారికి చెప్పాలని చెప్పాను ఇప్పుడే.
కేశవరావు - రవీ చూడు మీ ప్రధానోపాధ్యాయురాలు ఎంత మంచివారో. మొన్న
బళ్లోనూ ఇంట్లోనూ కూడా అబద్ధమాడావటగా?
రవికి దుఃఖం ఆగలేదు)
రవి - నాన్నా ఇంకెప్పుడూ అబద్ధాలాడను మొన్న నిజంగా భయంవేసి ఏడిస్తే తలనొప్పి
వచ్చింది, నిజం చెప్పితే నన్ను అమ్మా నువ్వూ కూడా అల్లరివాడినని అంటారని చెప్పలేదు.
కేశవరావు - ఇవ్వాల్టికి రవిని ఇంటికి పంపండీ. (బెల్లు నొక్కి ప్యూన్ వస్తే
సుగుణమణిగారి కోసం కబురు పంపింది.
రవిని తీసుకుని కేశవరావుగారు ఇంటికి వెళ్లారు - సుగుణమణి ప్రవేశించింది.
ప్ర. ఉ. - మనం అనుకున్నట్టు రవి అల్లరిపిల్లవాడు కాదండీ మెత్తటి మనస్సే. ఎదటి
పిల్లలకు న్యాయం జరిపించడానికో, తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోడానికో
ప్రయత్నించాడు. మనతో చెప్పకుండా తనే చర్య తీసుకున్నాడు. అట్లా చెయ్యటం తప్పు అని
ఇప్పుడే నచ్చ చెప్పాను. ఆ పిల్లవాడి తండ్రి చాలా మంచివాడు. నిన్నా ఇవ్వాళా కూడా ఎంతో
ఆదుర్దాగా వచ్చి వెళ్లారు.
సుగుణమణి - అదేనండీ, నేను ఎంత ప్రయత్నించినా ఇతని అల్లరికి కారణం
తెలియలేదు. రోజూ ఏదో ఒక గొడవ తెచ్చిపెట్టేవాడు.
ప్ర. ఉ. - ఈ సంగతి మీకు చెప్పాలనే పిలిచాను.
సుగుణమణి - అయితే వస్తానండీ.
ప్ర. ఉ. - మంచిది.
ఆ మర్నాడు రవి బడికి వెళ్తూనే సుగుణమణిగారిని కలిసి ఇకముందు అల్లరి చెయ్యనని
ఆమెకు చెప్పి క్షమించమని అడిగాడు. ఆ తరువాత ఎప్పుడూ రవి అల్లరి పిల్లవాడు
అనిపించుకోలేదు.