రైలు ఆట



ఆ వేళ ఆదివారం. ఛాయకు బడిలేదు. మధ్యాహ్నం అమ్మానాన్నా నిద్రపోతున్నారు.

ఛాయకు నిద్ర రాలేదు.

దాని వయస్సు నాలుగేళ్లు. ఎదురింటి బుజ్జిగాడికి కూడా నాలుగేళ్లే. పక్కింటి లీలకు ఐదేళ్లు. బుజ్జిగాడి చెల్లెలు లక్ష్మికి రెండేళ్లన్నర. వాళ్ల ఇండ్లల్లోనూ అంతా పడుకున్నారు. కాని వాళ్లకూ నిద్ర పట్టలేదు. అందుకని ఛాయతో ఆడుకోటానికి వచ్చారు.

వాళ్ళంతా ఏమాడుదామని ఒకరి నొకరు అడిగారు. ఏమీ తోచలేదు. ఈ లోగా లక్ష్మికి ఎదురు గదిలో కుర్చీ కనపడింది. అది పేముకుర్చీ. దానిని బోర్లావేసి 'జిగ్‌, జిగ్‌' అంటూ తోస్తూ ఆట మొదలు పెట్టింది.

“బలే బాగుంది” అనిపించింది. అంతా తలొక కుర్చీని బోర్లవేసి రైలాట మొదలు పెట్టారు.

“జిగ్‌ జిగ్‌!”

కూ..

ఛాయకు మొన్ననే వాళ్ళ నాన్న ఈల కొనిపెట్టారు. అది తెచ్చి నేను గార్డునట, ఈ ఈల ఊదుతానుట, అప్పుడు మీరైళ్ళన్నీ నడుస్తాయట!” అని ఉత్సాహంగా ఈల ఊదింది.

ఈలోగా లక్ష్మిని చీమకుట్టింది. అది ఏడుపు మొదలు పెట్టింది. ఈ గోలంతా విని ఛాయ అమ్మా, నాన్నా లేచివచ్చారు. ఆ గది సామానులన్నీ చిందర వందరగా ఉన్నాయి. బల్లమీది కాగితాలూ పుస్తకాలూ నేలమీద దొర్లుతున్నాయి.

ఛాయ తల్లి లక్ష్మిని “ఊరుకో అమ్మా” అని ఎత్తుకున్నది. అది ఊరుకుంది. లక్ష్మిని తీసికొని వాళ్ళ అన్న చల్లగా జారాడు.

లీల అమ్మకు కూడ ఈ గోల వినపడింది ఆమె లీలను పిలిచింది. అది కూడా వెళ్లిపోయింది. “తప్పుకాదూ, వాళ్లింట్లో అల్లరి చేయవచ్చా?” అని లీలను కోపపడితే, “అది అల్లరి చెయ్యలేదండి, లక్ష్మిని చీమ కుడితే ఏడ్చింది” అని ఛాయ తల్లి చెప్పింది.

ఇక ఛాయ ఒక్కతే మిగిలింది. వాళ్ళ నాన్నగారు కిందపడ్డ కాగితాలు తీసుకుంటూ “అయ్యో ఆఫీసు కాగితాలు ఇంకా చింపివెయ్యలేదు, నయం” అంటూ ఛాయకేసి నవ్వుతూ చూశారు. ఛాయ బిక్కముఖం వేసింది. వాళ్ళమ్మ దానికేసి చూస్తూ “చూడు ఎంత అల్లరిచేశావో!” అంటూ కోపపడింది. “మరి అల్లరి చెయ్య లేదన్నావుగా లీల అమ్మతోటి?” అంది ఛాయ భయపడుతూ. వాళ్ళమ్మా నాన్న నవ్వుకుని “ఇంకెప్పుడూ ఆఫీసుగదిలో ఆడకండి” అన్నారు. ఛాయ బుర్ర ఊపింది.

మర్నాడు ఛాయ నాన్నగారు ఆమెకొక కీ ఇస్తే నడిచే రైలు బండి కొనిపెట్టారు. లీలకు, బుజ్జికి, లక్ష్మికి చూపించి ఛాయ హాయిగా వరండాలో అందరితో ఆడుకుంది ఆ రైలుతో.

Responsive Footer with Logo and Social Media